రాయల్స్‌ హ్యాట్రిక్‌

రాయల్స్‌ హ్యాట్రిక్‌– రాజస్థాన్‌ వరుసగా మూడో విజయం
– బౌల్ట్‌, చాహల్‌కు ముంబయి దాసోహం
– ముంబయి125/9, రాజస్థాన్‌ 127/4
నవతెలంగాణ-ముంబయి
వాంఖడేలో హ్యాట్రిక్‌ హ్యాట్రిక్‌. రాజస్థాన్‌ రాయల్స్‌ వరుసగా మూడో విజయం సాధించగా, ముంబయి ఇండియన్స్‌ వరుసగా మూడో పరాజయం చవిచూసింది. 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని రాజస్థాన్‌ రాయల్స్‌ ఊదేసింది. మరో 27 బంతులు ఉండగానే లాంఛనం ముగించింది. రియాన్‌ పరాగ్‌ (54 నాటౌట్‌, 39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో చెలరేగాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ (16), శివం దూబె (8 నాటౌట్‌) రాణించారు. యశస్వి (10), బట్లర్‌ (13), సంజు (12) వికెట్లతో రాయల్స్‌ ఒత్తిడిలో పడినా పరాగ్‌ ఫటాఫట్‌ ఇన్నింగ్స్‌తో హ్యాట్రిక్‌ విజయాన్ని అందించాడు. అంతకుముందు, ట్రెంట్‌ బౌల్ట్‌ (3/22), చాహల్‌ (3/11), నండ్రె బర్గర్‌ (2/32) మ్యాజిక్‌తో ముంబయి ఇండియన్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 125 పరుగులే చేసింది. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (34, 21 బంతుల్లో 6 ఫోర్లు), తెలుగు తేజం తిలక్‌ వర్మ (32, 29 బంతుల్లో 2 సిక్స్‌లు) ముంబయి ఇండియన్స్‌కు గౌరవప్రద స్కోరు అందించారు.
ముంబయి విలవిల
తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన ముంబయి ఇండియన్స్‌కు ట్రెంట్‌ బౌల్ట్‌ కోలుకోలేని షాక్‌ ఇచ్చాడు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ చివరి రెండు బంతులకు రెండు వికెట్లు పడగొట్టిన బౌల్ట్‌.. తన రెండో ఓవర్‌ రెండో బంతికి సైతం వికెట్‌ తీశాడు. రోహిత్‌ శర్మ (0), నమన్‌ దిర్‌ (0), డెవాల్డ్‌ బ్రెవిస్‌ (0) ఎదుర్కొన్న తొలి బంతికే డకౌట్‌గా నిష్క్రమించి డగౌట్‌కు చేరుకున్నారు. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (16, 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడుతూ మెప్పించగా అతడినీ బర్గర్‌ సాగనంపాడు. దీంతో 20/4తో ముంబయి ఇండియన్స్‌ పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. తిలక్‌ వర్మ (32), కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (34) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డారు. 36 బంతుల్లో 56 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను మళ్లీ పట్టాలెక్కించారు. చాహల్‌ వరుసగా తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యను అవుట్‌ చేసి ముంబయి ఆశలపై నీళ్లు చల్లాడు. చివర్లో టిమ్‌ డెవిడ్‌ (17, 24 బంతుల్లో 1 ఫోర్‌) వేగంగా పరుగులు సాధించటంలో విఫలమయ్యాడు. పియూశ్‌ చావ్లా (3), గెరాల్డ్‌ (4) తేలిపోయారు.