– ఖమ్మం లోక్‌సభ టిక్కెట్‌పై పూర్తైన కాంగ్రెస్ కసరత్తు
– బెంగళూరులో ఖర్గే సమక్షంలో..మంత్రులు భట్టి,పొంగులేటి, తుమ్మల చర్చలు
– ఎవరికిచ్చేది ప్రకటిస్తామన్న అధ్యక్షులు
– రఘురాంరెడ్డిని ఫైనల్ చేసినట్టు సమాచారం
– రాత్రి లేదా నేడు అధికారిక ప్రకటన
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ టిక్కెట్‌పై నెలకొన్న పీటముడి వీడే సమయం ఆసన్నమైంది. అభ్యర్థి ఎవరనేది సోమవారం రాత్రి లేదా మంగళవారం అధికారిక ప్రకటన చేస్తామని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జునఖర్గే జిల్లా మంత్రులకు సూచించారని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్‌రెడ్డి తనయుడు రామసహాయం రఘురాంరెడ్డి (ఆర్‌ఆర్‌ఆర్) అభ్యర్థిత్వాన్ని అధిష్టానం ఇప్పటికే ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఎన్నికల నామినేషన్ల సమయం ఆసన్నమవుతుండటంతో అభ్యర్థిత్వాన్ని తేల్చక తప్పని స్థితిలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క సోమవారం బెంగళూరు వెళ్లారు. పార్టీ అధ్యక్షులు ఖర్గే సమక్షంలో ఇరువురు ఉమ్మడిగా.. వేర్వేరుగా చర్చలు జరిపారు.
భార్య కోసం భట్టి.. తమ్ముడు, వియ్యంకుని కోసం పొంగులేటి
ఇద్దరు మంత్రులు తాము సూచించిన పేర్లనే ఫైనల్ చేయాలని పట్టుబట్టారు. ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క తన భార్య మల్లు నందినికి టిక్కెట్ ఇవ్వాల్సిందిగా కోరారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు పొంగులేటి ప్రసాద్‌రెడ్డి పేరు ప్రతిపాదించారు. లేదంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచన మేరకు తన వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డి పేరు ఖరారు చేసినా తనకు అభ్యంతరం లేదనట్టుగా మంత్రి పొంగులేటి విన్నవించుకున్నట్టు సమాచారం. ఇద్దరు మంత్రులతో సుమారు రెండు గంటల పాటు చర్చల అనంతరం పార్టీ అధ్యక్షులు తాము సోమవారం రాత్రి లేదా మంగళవారం అభ్యర్థి పేరును వెల్లడిస్తామని సూచించడంతో హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. ఇదే సమయంలో మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావునూ సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. అధిష్టానం నిర్ణయం తీసుకున్న వ్యక్తికి మద్దతిస్తానని తెలిపినట్టు సమాచారం.
గెలుపుపై ఆశలతోనే మంత్రుల పట్టు..
కాంగ్రెస్ బలంగా ఉన్న ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకుంటే గెలుపు ‘నల్లేరుపై నడకేనని’ భావించి ముగ్గురు మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తమ కుటుంబసభ్యులకు ఇప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ముగ్గురు మంత్రుల పోటీ నేపథ్యంలో మినిస్టర్ల కుటుంబీకుల్లో ఎవరికీ ఇవ్వబోమని అధిష్టానం తేల్చిచెప్పడంతో తెరమీదకు స్థానికులు, స్థానికేతరుల పేర్లు వచ్చాయి. ఈలోగా కాంగ్రెస్ ఓవర్ కాన్ఫిడెన్స్ కొంపముంచే పరిణామాలు ఉత్పన్నమయ్యే స్థితి కనిపించడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మధ్యేమార్గంగా రామసహాయం రఘురాంరెడ్డి పేరును తెరమీదకు తెచ్చారు. మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబమే కావడం, జిల్లాలోని పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం చేగొమ్మ రఘురాంరెడ్డి స్వస్థలం కావడంతో ఆయన పేరును ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.
గతం నుంచే రామసహాయానికి పోటీపై ఆసక్తి..
గతంలోనే అనేక పర్యాయాలు రామసహాయం రఘురాంరెడ్డి కాంగ్రెస్ తరఫున టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేశారు. 1985లో డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. 1989, 1991లో వరంగల్ పార్లమెంట్ ఎన్నికల ఇన్‌చార్జిగా,దీంతోపాటు వరంగల్ జిల్లాలోనే రెండు అసెంబ్లీ స్థానాలకు ఇన్‌చార్జిగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో 2012లో రాజ్యసభ, 2014లో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఆశించారు. 2014లో పాలకుర్తి, 2018లో పాలేరు అసెంబ్లీ టిక్కెట్ కోసం ప్రయత్నించారు. 2023లో కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చినా వియ్యంకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోసం వదులుకున్నారు.
స్వస్థలం పాలేరు నియోజకవర్గమే..
రామసహాయం రఘురామ్‌రెడ్డిది మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబమే. ఆయన తల్లిదండ్రులు సురేందర్‌రెడ్డి, జయమాల దంపతులది కూసుమంచి మండలం చేగొమ్మ. 1961 డిసెంబర్ 19న రఘురాంరెడ్డి వీరికి జన్మించారు. నిజాం కళాశాలలో బీకామ్, పీజీ డిప్లొమా పూర్తి చేశారు. వ్యాపార రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆయన తండ్రి సురేందర్‌రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు, వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నికయ్యారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, పీవీ నర్సింహారావు కుటుంబాలతోనూ వీరి కుటుంబానికి సాన్నిహిత్యం ఉంది. రఘురాంరెడ్డికి ఇద్దరు కుమారులు. వీరిలో పెద్దకుమారుడు వినాయక్‌రెడ్డి సినీ హీరో దగ్గుబాటి వెంకటేశ్ పెద్ద కుమార్తె ఆశ్రితను వివాహం చేసుకోగా.. చిన్నకుమారుడు అర్జున్‌రెడ్డికి మంత్రి పొంగులేటి కుమార్తె స్వప్నరెడ్డిని ఇచ్చి వివాహం చేశారు.
బీఆర్‌ఎస్ అభ్యర్థి నామతోనూ సత్సంబంధాలు..
బీఆర్‌ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావుతోనూ రఘురాంరెడ్డి కుటుంబానికి సత్సంబంధాలు న్నాయి. హైదరాబాద్‌లో వారి ఇండ్లు పక్కనే ఉండటం, ఇద్దరూ ఒకే జిల్లాకు చెందిన వారు కావడంతో మంచి అనుబంధం ఉంది. గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో నామ గెలుపు కోసం సురేందర్‌రెడ్డి కృషి చేసిన సందర్భాలు ఉన్నాయి.