తలో దారిలో ఆర్‌ఆర్‌ఆర్‌

 RRR on his way– అసెంబ్లీకి కలిసిరావడం కష్టమే
– బీజేపీ ఎల్పీ నేత నియామకం ఇంకా పెండింగ్‌లోనే
– జయసుధ చేరిక సరే… మా మాటేందంటున్న బండా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా పేరు సబ్‌టైటిల్‌ రౌద్రం..రుధిరం..రణం.తమ ముగ్గురు ఎమ్మెల్యేలు (రాజాసింగ్‌,రఘునందన్‌రావు, రాజేందర్‌) కూడా అసెంబ్లీలో ఆర్‌ఆర్‌ఆర్‌ను తలపించేలా ఉగ్రరూపం దాల్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతారని బీజేపీ గొప్పలకు పోయింది. ఆ సినిమా సబ్‌ టైటిల్‌లోని లక్షణాలేవీ వారిలో కనిపించట్లేదు. అసలు ఆ ముగ్గురూ అసెంబ్లీ సమావేశాల్లో కలిసిపోవడమనేదే కుదిరేటట్టు కనిపించడం లేదు. సస్పెండ్‌ అయిన రాజాసింగ్‌…బీజేపీ ఎల్పీ నేత పదవి ఇవ్వలేదన్న ఆగ్రహంతో రఘునందన్‌రావు, పేరుకే చేరికల కమిటీ చైర్మెన్‌, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మెన్‌ తోకలు తగిలించి తనకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే నైరాశ్యంలో ఈటల రాజేందర్‌ ఉన్నారు. ఆ ముగ్గురూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తున్నది. ఇటీవల బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఉమ్మడి సమావేశానికి రాజాసింగ్‌ రాలేదు. కాదు..కాదు…ఆ సమావేశ ఆహ్వానాన్నే ఆయనకు కిషన్‌రెడ్డి పంపలే దని తెలిసింది. రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ వేటు ఎత్తివేయించే విషయంలో కాస్త చొరవ తీసుకున్న ఈటల రాజేందర్‌పై ఆ పార్టీ కీలక నేతలు అధిషా ్టనానికి ఫిర్యాదు చేయడంతో అక్షింత లు పడిన విషయం తెలిసిందే. దీంతో రాజేందర్‌ గమ్ముగా ఉంటున్నారు. అసెంబ్లీ సమావేశాలను 30 రోజుల పాటు నిర్వహించాలనీ, అన్ని అంశాలపైనా సమగ్రంగా చర్చించాలని ఆ సమావేశంలో తీర్మానించామని ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఎమ్మెల్సీ ఏవీఎన్‌ రెడ్డి మీడియా ముందుకొచ్చి చెప్పారు. ఆ సమావేశంలో పాల్గొన్న ఈటల మాత్రం మీడియా సమావేశంలో పాల్గొనకుండానే వెళ్లిపోయారు. ఒకానొక దశలో రఘునందన్‌రావు ను బీజేపీ ఎల్పీ నేతగా నియమించబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే, గతంలో టీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు ఆ పార్టీ ఎల్పీనేతగా పనిచేసిన ఈటలను కాదని రఘునందన్‌రావుకు ఇచ్చి కొత్త తలనొప్పి తెచ్చుకోవడం ఎందుకనే భావనలో రాష్ట్ర అధిష్టానం పడ్డట్టు తెలిసింది. ఎన్నికలకు ముందు ఇదే చివరి అసెంబ్లీ సమావేశాలు కావడం, అవి కూడా నాలుగైదు రోజులకు మించి జరగబోవనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చివరి అంకంలో కొత్త పంచాయతీ ఎందుకనే చర్చ ఆపార్టీలో కొనసాగుతున్నది.
జయసుధ చేరిక సరే.. మా మాటేందంటున్న బండా
సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరారు. ఆమె సికింద్రాబాద్‌, ముషీరాబాద్‌ స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీచేస్తారనే లీకులు ఆ పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నది. కాగా, వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే సీటు ఇస్తామన్న హామీతోనే హైదరాబాద్‌ మాజీ మేయర్‌ బండా కార్తీక రెడ్డి బీజేపీలో చేరిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో జయసుధ చేరికతో బండా దంపతులు డైలామాలో పడ్డారు. కీలకనేతలకు ఫోన్లు చేసి తమకిచ్చిన హామీ మాటేంటని ప్రశ్నిస్తున్నారు. మాటతప్పితే తమ దారి తాము చూసుకుంటామనే పరోక్ష హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిసింది. ముషీరాబాద్‌ నియోజకవర్గం నుంచి తన కుటుంబ సభ్యులనుగానీ, కుదరకపోతే తన అనుచరుల్లో ఎవరినైనా ఒకరిని నిలపాలనే ఆలోచనలో ఎంపీ లక్ష్మణ్‌ ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. అదే నియోజకవర్గం నుంచి హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి పోటీచేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తన కూతురు రాజకీయ భవిష్యత్తు కోసం దత్తాత్రేయ కూడా జాతీయ స్థాయిలో పైరవీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ముషీరాబాద్‌, సనత్‌నగర్‌ నియోజకవర్గాల్లో పలు కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఉంటున్నారు. జయసుధతో ఏ లొల్లి లేకుండా ఉండేందుకు చూసుకోవడంలో భాగంగా ఆమెకు జాతీయస్థాయిలో నామినేటెడ్‌ పోస్టుగానీ, సెన్సార్‌బోర్డు సభ్యురాలిగా నియమించాలనే ప్రతిపాదనను తెరపైకి తెస్తున్నారు. మొత్తంగా జయసుధ చేరిక ఆ పార్టీలో కొత్త తలనొప్పులను తీసుకొచ్చి పెడుతున్నది.