– విద్యావైద్యం ఉచితంగా అందిస్తాం
– ఉపాధి హామీ పనిదినాలు 200, వేతనం రూ.600కు పెంపు
– ఒకేసారి రూ.2 లక్షల వరకు రుణమాఫీ
– పంట పెట్టుబడి సహాయం రూ.20 వేలు
– సీపీఐ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో సొంత ఇంటి జాగా ఉన్నోళ్లకు గృహ నిర్మానానికి రూ.10 లక్షలు ఆర్థిక సాయం చేయనున్నట్టు సీపీఐ రాష్ట్ర సమితి ప్రకటించింది. పట్టణ ప్రాంతాల్లో గతంలో మాదిరిగా మధ్య తరగతి ప్రజలకు హౌజింగ్ బోర్డు ద్వారా నెల వాయిదాలతో ఇండ్ల నిర్మాణం చేపడతామని తెలిపింది. రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలందరికీ ఇంటి స్థలాలు ఇస్తామని పేర్కొంది. బుధవారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో సీపీఐ జాతీయ కార్యదర్శులు కె నారాయణ, సయ్యద్ అజీజ్‌పాషా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ కలిసి పోటీ చేస్తున్నాయని ప్రకటించింది. రాబోయే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ఎన్నికల ప్రణాళిక అమలుకు కృషి చేస్తామని పేర్కొంది. బీఆర్‌ఎస్ హయాంలో అణచివేయబడిన ప్రజాస్వామిక, రాజ్యాంగ హక్కులను తక్షణమే పునరుద్ధరించాలని తెలిపింది. ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా ఉంటూ ఎన్నికల ప్రణాళిక అమలుకు సలహా, సూచనల స్వీకరణకు తెలంగాణ స్టేట్ కన్సల్టేటివ్, అడ్వైజరీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించాలని సూచించింది. ప్రజాస్వామిక ఉద్యమాల అణచివేతలో భాగంగా బనాయించిన అక్రమ కేసులను ఎత్తేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, కలవేణి శంకర్, పశ్యపద్మ, బాలనర్సింహా, హేమంత్‌కుమార్, ఈటి నరసింహ తదితరులు పాల్గొన్నారు.
మ్యానిఫెస్టోలోని ముఖ్యాంశాలు
అర్హులైన పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు 200 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత కరెంటు
విద్యుత్ బిల్లుల్లో అవలంబిస్తున్న అశాస్త్రీయమైన నాన్‌టెలిస్కోపిక్ విధానం రద్దు
రైతుకు పట్ట పెట్టుబడి సహాయం ఎకరాకు రూ.20 వేలు
విద్యావైద్యం ఉచితంగా అందించుట
కేరళ తరహాలో రేషన్ దుకాణాల ద్వారా సబ్సిడీ ధరలపై 13 రకాల నిత్యావసర వస్తువుల పంపిణీ
సెప్టెంబర్ 17ను కర్నాటక, మహారాష్ట్ర తరహాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా ఉత్సవాలు
ఆర్‌వో చట్టాన్ని సవరించి పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను పరిశీలించి పట్టాలివ్వడం
అన్యాక్రాంతమైన గిరిజన అసైన్డ్ భూములను తిరిగి ఇప్పించుట
పోడు సాగు చేస్తున్న అర్హులైన గిరిజనులందరికీ అటవీ హక్కుల చట్టం అమలు, హక్కు పత్రాలు అందజేయుట
ప్రభుత్వ భూములను అర్హులైన పేదలకు పంపిణీ
భూ నిర్వాసితులకు 2013 చట్టం అమలు
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాలకు, అవినీతికి బాధ్యులైన వారిపై నిర్ణీత కాలవ్యవధిలో చట్టపరమైన కఠిన చర్యలు
ప్రభుత్వ రంగాన్ని కాపాడాలి. అసంఘటిత కార్మికులకు నెలకు కనీసం రూ.26 వేలు ఇవ్వాలి.
కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆర్నెల్లలోగా మెగా డీఎస్సీ నిర్వహించి అవసరమున్న 20 వేల ఉపాధ్యాయుల నియామకం
విశ్వవిద్యాలయాల్లో బోధన, బోధనేతర ఖాళీల భర్తీ
ఏటా నిర్దిష్ట కాలవ్యవధిలో ప్రభుత్వ ఖాళీల భర్తీకి ప్రత్యేక ఉద్యోగాల క్యాలెండర్
పట్టణ ఉపాధి హామీ పథకం ఏర్పాటు
బీసీ సబ్‌ప్లాన్ రూపొందించుట
ఒకేసారి రూ.రెండు లక్షల వరకు పంట రుణాలు మాఫీ
ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించడం
అటవీ హక్కుల చట్టంలో గిరిజనులతోపాటు ఆ ప్రాంత పేదలకు హక్కులు
పోడు వ్యవసాయం చేసుకుంటున్న దళితులకు పట్టాలు
భృతి పథకం ద్వారా నెలకు రూ.5 వేలు అందజేయుట
రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయింపు
ప్రయివేటు విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ఫీజుల నియంత్రణ చట్టం
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు.
కొత్తగూడెంలో సీపీఐకి మద్దతు
తొలగించబడిన 26 బీసీ కులాల పోరాట సమితి
కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావుకు పూర్తి మద్దతు ఇస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర తొలగించబడిన 26 బీసీ కులాల పోరాట సమితి అధ్యక్షులు ఆళ్ల రామకృష్ణ ప్రకటించారు. బుధవారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డిని ఆ సంఘం ప్రతినిధి బృందం కలిసింది. ఈ సందర్బంగా రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన అత్యంత వెనుకబడిన 26 బీసీ కులాలను సీఎం కేసీఆర్ వివక్షపూరితంగా బీసీ జాబితా నుంచి తొలగించి అన్యాయం చేశారని అన్నారు. దీంతో విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో తీవ్రంగా నష్టపోయామని చెప్పారు. బీసీల హక్కులను కాలరాసి దగా చేసిన బీఆర్‌ఎస్‌ను ఓడిస్తామన్నారు. అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ వెంటనే తొలగించిన 26 బీసీ కులాలను తిరిగి బీసీ జాబితాలో చేరుస్తామంటూ హామీ ఇచ్చిందని అన్నారు. అందుకే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించామన్నారు. చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన 26 బీసీ కులాలను తొలగించడం దారుణమన్నారు. తిరిగి చేర్చడానికి ఎన్నికల తర్వాత ఏర్పడే నూతన ప్రభుత్వంపై సీపీఐ ఒత్తిడి తెస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రధాన కార్యదర్శి పివివి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు ఎంఆర్‌కె రెడ్డి, చొల్లంగి ప్రసాద్, సంయుక్త కార్యదర్శి చిత్తూరు వేణు, రాష్ట్ర కార్యవర్గసభ్యులు జె వెంకటేశ్వర్ రావు, మురళీధర్, టి శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.