పసిడి విజేతకు రూ.10 లక్షలు

10 lakhs to the winner of Pasidi– జాతీయ క్రీడలకు భారీ నగదు బహుమతి
నవతెలంగాణ-హైదరాబాద్‌ : 38వ జాతీయ క్రీడల్లో సత్తా చాటిన క్రీడాకారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ నగదు ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఉత్తరాఖాండ్‌లో జరుగుతున్న నేషనల్‌ గేమ్స్‌లో తెలంగాణ నుంచి 205 మంది క్రీడాకారులు పోటీపడుతున్నారు. జాతీయ క్రీడల్లో పతకం సాధించి, తెలంగాణ గర్వపడేలా చేసిన అథ్లెట్లకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తుందని శాట్‌ చైర్మన్‌ కే. శివసేనారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్‌ రెడ్డి తెలిపారు. ‘జాతీయ క్రీడల్లో మన అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. పతక వేటలో మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు. పసిడి పతకం సాధించిన అథ్లెట్లకు రూ. 10 లక్షలు, రజతం సాధిస్తే రూ. 5 లక్షలు, కాంస్యం సాధిస్తే రూ. 3 లక్షల నగదు బహుమతి అందించనున్నామని’ శివసేనా రెడ్డి వెల్లడించారు. సోమవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో జాతీయ క్రీడల్లో పోటీపడుతున్న టెన్నిస్‌ క్రీడాకారులకు ఆ సంఘం తరఫున పది మందికి రూ. 25 వేలు చొప్పున అందజేశారు. జాతీయ క్రీడల్లో తెలంగాణ మహిళల టెన్నిస్‌ జట్టు గతంలో పోటీపడినా.. పురుషుల జట్టు తొలిసారి అర్హత సాధించింది. ఈ కార్యక్రమంలో శాట్‌ వీసీ ఎండీ సోనీబాలా దేవి, తెలంగాణ టెన్నిస్‌ సంఘం ఆఫీస్‌బేరర్లు తదితరులు పాల్గొన్నారు.