రూ.10 వేలు మీ సొంతం..

Mamata Baijuపి.ఎన్‌.బి సినిమాస్‌ బ్యానర్‌ పై రూపొందిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘డియర్‌ కృష్ణ’. ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా రైటర్‌, డైరెక్టర్‌ విజయేంద్ర ప్రసాద్‌, హీరో శ్రీకాంత్‌ చేతుల మీదుగా విడుదల చేశారు. పీఎన్‌ బలరామ్‌ రచయిత, నిర్మాతగా, దినేష్‌ బాబు డైలాగ్స్‌, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్షయ్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో ‘ప్రేమలు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని దోచుకున్న మమిత బైజు కీలక పాత్రలో నటిస్తుండగా, ఐశ్వర్య మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ఈ సందర్భంగా రచయిత విజయేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ,’ట్రైలర్‌ చాలా బాగుంది. ఇందులోని ప్రతి షాట్‌ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘ప్రేమలు’ హీరోయిన్‌ మమతా బైజు నటించడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా కచ్చితంగా ఘన విజయం సాధించాలి’ అని తెలిపారు. ‘వినూత్నమైన కథతో, వినూత్నమైన రీతిలో ప్రమోషన్స్‌ చేయడం నచ్చింది. రియల్‌ ఇన్సిడెన్స్‌ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం మెచ్చుకోదగ్గ విషయం. మలయాళంతో పాటు తెలుగులో ఒకేసారి ఈసినిమా విడుదల కానుంది’ అని నటుడు శ్రీకాంత్‌ అన్నారు. మొదటి 100 టికెట్ల బుకింగ్‌లో ఒక టికెట్‌ను ఎంపిక చేసి, ఆ టికెట్‌ కొనవారికి రూ.10,000 క్యాష్‌ బ్యాక్‌ కింద బహుమతిగా అందించనున్నట్టు మేకర్స్‌ ప్రకటించారు.