నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ లో సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం గంగాదరప్ప అధ్యక్షతన పెండింగ్ ప్రాజెక్టులు – జిల్లా సమగ్రాభివృద్ధి అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా శోభన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కేటాయిస్తున్న బడ్జెట్ జిల్లా వ్యవసాయ రంగానికి, సాగునీటి రంగానికి ఏమాత్రం సరిపోయేదిగా లేదని అన్నారు. వ్యవసాయానికి సాగునీళ్ళు కల్పించడం ద్వారా అధిక ఉత్పత్తి సాధించవచ్చని అన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో పూడికతీతకు నిధులు కేటాయించకపోవడంతో ప్రాజెక్టులో పూడిక పేరుకపోయి సామర్థ్యం తగ్గుతూ వస్తోందని అన్నారు. పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంచి, ఆయకట్టు రైతులకు మరింత సాగునీరు అందించాలని అన్నారు. ఈ రెండు ప్రాజెక్టుల ఆధునికీకరణకు సరైన నిధులు కేటాయించకపోవడంతో మరమ్మతులకు నోచుకోవడం లేదు. బాన్సువాడ నియోజకవర్గంలోని మంజీరా నదిపై పలు చెక్‌డ్యాంల నిర్మాణాలు ప్రారంభించాలి. ఈ బడ్జెట్‌లోనైన సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలి. నాగమడుగు ఎత్తిపోతల పనులను పూర్తి చేయాలి.
రామడుగు లెఫ్ట్ కెనాల్ లీకేజ్ వలన చివరి ఆయకట్టు వరకు నీరు అందడం లేదు. భారీ వర్షాలకు బుంగలు పడ్డాయి. తాత్కాలిక మరమ్మతులు తప్ప శాశ్వత పరిష్కారం చూపడంలేదు. కాల్వలు, తూములకు మరమ్మతులు చేయాలని, చివరి ఆయకట్టుకు సైతం నీళ్లు అందేలా చూడాలి. ప్రాజెక్ట్ పై ప్రభుత్వం దృష్టి సారించాలి. కామారెడ్డి జిల్లాలో నిజాంసాగర్, పోచారం, కౌలాస్‌నాల లాంటి సాగునీటి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ చాలా ప్రాంతాలకు సాగు, తాగునీరు అందడం లేదు. సాగునీటి ప్రాజెక్టులకు అరకొర నిధులు కేటాయించడం, నిధుల లేమీతో సంవత్సరాల తరబడి ప్రాజెక్టుల పనులు పూర్తికావడం లేదు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని బీడు భూములకు సాగునీటిని అందించేందుకు గత 15ఏళ్ల నుంచి చేపడుతున్న కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనులకు నిధుల లేక ముందుకు కదలడం లేదు. జుక్కల్ నియోజకవర్గంలో నాలుగు మండలాల పరిధిలోని 50 గ్రామాల్లో 30వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం మంజీరా నదిపై నాగమడుగు ఎత్తిపోతల పథకానికి పూర్తిస్థాయి నిధులను కేటాయించి పనులను పూర్తి చేయాలి. తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ.. నిజాం సాగర్ పూడిక తీయాలని అన్నారు. రామడుగు లెఫ్ట్ కెనాల్ లికేజికి మరమ్మత్తు చేయాలని కోరారు. జిల్లా ప్రాజెక్టులకు రూ. 1000 కోట్లు ఈ బడ్జెట్ సమావేశంలో కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బాధవత్ దేవేందర్ సింగ్, జిల్లా కమిటీ సభ్యులు గట్టు లక్ష్మి, గిర్జా ఎల్లయ్య, పి. మురళీ కృష్ణ, వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు.