సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బాధిత శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్ల రూపాయలను అందజేయనున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. ఈ సంబంధిత చెక్కులను నిర్మాత, టీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్‌రాజుకు ఆయన అందజేశారు. బుధవారం అల్లుఅరవింద్‌తోపాటు నిర్మాతలు దిల్‌రాజు, రవిశంకర్, సుకుమార్ కిమ్స్ ఆస్పత్రిలో ఉన్న శ్రీతేజ్‌ని పరామర్శించారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ, ‘శ్రీతేజ్ ప్రస్తుతం కోలుకుంటు న్నాడు. వెంటిలేషన్ తీసేశారు. ఆ బాబు త్వరలోనే మనందరి మధ్య తిరుగుతాడని ఆశిస్తున్నా. బాబు కుటుంబానికి అల్లుఅర్జున్ తరఫున కోటి రూపాయలు, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ తరఫున రూ.50 లక్షలు, దర్శకుడు సుకుమార్ తరఫున రూ.50 లక్షల రూపాయలను సాయంగా అందిస్తున్నాం’ అని తెలిపారు. ‘శ్రీతేజ్ హెల్త్ కండిషన్ బాగుందని డాక్టర్లు చెబుతున్నారు. బాబు కుటుంబానికి అల్లుఅరవింద్, ‘పుష్ప2′ నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ రూ.2 కోట్ల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి అపాయింట్‌మెంట్ అడిగాం. సినీ ప్రముఖులతో ముఖ్యమంత్రిని కలిసి చర్చిస్తాం. హీరోలు, దర్శకులు, నిర్మాతలందరం నేడు(గురువారం) సీఎంని కలవబోతున్నాం. ఎఫ్‌డీసీ చైర్మన్‌గా అటు ప్రభుత్వానికి, ఇటు పరిశ్రమకు వారధిగా అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాను’ అని దిల్‌రాజు చెప్పారు.