రూ.2,000 నోట్లు వెనక్కి

– సెప్టెంబర్‌ 30 వరకు గడువు
– అప్పటి వరకు చలామణీలోనే..
– ఆర్‌బీఐ కీలక ఆదేశాలు
ముంబయి : రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించింది. ఈ నోట్లను 2023 సెప్టెంబర్‌ 30 లోగా బ్యాంక్‌ల్లో మార్చుకోవచ్చని శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే అప్పటి వరకు పెద్ద నోట్లను లావాదేవీలకు ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది. ఇకపై ఎవరికీ రూ.2వేల నోట్లను జారీ చేయవద్దని బ్యాంక్‌లకు ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. మే 23 నుంచి ఏ బ్యాంక్‌ శాఖలో అయినా ఈ నోట్లను మార్చుకోవడానికి ప్రజలకు వీలు కల్పించింది. అయితే.. ఒకసారి రూ.20,000 వరకు మాత్రమే ఈ నోట్లను మార్చుకునేందుకు వీలుంది. ఎలాంటి నిబంధన లేకుండా ఎంత మొత్తం అయినా డిపాజిట్‌ చేసుకునే అవకాశం ఉంది. దేశంలోని 19 ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లోనూ రూ.2వేల నోట్లు మార్చుకునే సౌలభ్యం కల్పించింది.
2016 నవంబర్‌ 8న ప్రధాని మోడీ అనుహ్యాంగా రూ.500, రూ.1000 పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. వాటికంటే పెద్ద నోటు రూ.2000 తెచ్చిన విషయం తెలిసిందే. దీంతో నల్లధనం దాచుకునే వారికి మరింత సులభం అయ్యిందనే అరోపణలు వెళ్లువెత్తాయి. ఆర్‌బీఐ యాక్ట్‌ 1934లోని సెక్షన్‌ 24(1) ప్రకారం.. 2016 నవంబర్‌లో రూ.2వేల నోటును ఆర్‌బీఐ చలామణిలోకి తీసుకొచ్చింది. మార్చి 2017 నాటికి మొత్తం కరెన్సీలో రూ.2000 నోట్ల వాటా విలువ 89 శాతంగా ఉంది. 2018 మార్చి 31 నాటికి రూ.6.73 లక్షల కోట్లు (37.3శాతం), 2023 మార్చి 31 నాటికి రూ.3.62 లక్షల కోట్లు లేదా 10.8 శాతానికి పెద్ద నోట్ల చలామణి తగ్గింది. 2018-19 నుంచి ఈ నోట్ల ముద్రణను ఆర్‌బీఐ పూర్తిగా నిలిపివేసింది. క్లీన్‌ నోట్‌ పాలసీలో భాగంగా రూ.2,000 నోట్లను చలామణీని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్టు ఆర్‌బీఐ ప్రకటించింది.
నకిలీ నోట్ల హల్‌చల్‌
రూ.2000 నోట్లను చలామణిలోకి తెచ్చిన తర్వాత దేశంలో నకిలీ నోట్ల బెడద వంద శాతం పైగా పెరిగింది. 2016లో రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసి రూ.2 వేల నోట్లను ప్రవేశ పెట్టిన తర్వాత నకిలీ నోట్ల చలామణి ఏకంగా 107 రెట్లు పెరిగిందని స్వయంగా కేంద్ర ప్రభుత్వ గణంకాలే పేర్కొంటున్నాయి. 2016లో దేశవ్యాప్తంగా నకిలీ రూ.2వేల నోట్లు 2,272 పట్టుబడగా.. 2020లో వీటి సంఖ్య ఏకంగా దాదాపు 2.45 లక్షలకు చేరిందని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.