– ఏసీబీకి చిక్కిన ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ లచ్చునాయక్
– ఇంట్లో, ఆస్పత్రి చాంబర్‌లో సోదాలు
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లచ్చు నాయక్ శుక్ర వారం తన నివాసంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఔషధాల టెండర్‌కు అనుమతి ఇచ్చేం దుకు కాంట్రాక్టర్ లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ఎం.వి శ్రీనివాస రావు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన కాంట్రాక్టర్ రాపోలు వెంకన్న రెండు సంవత్సరాలుగా సర్జికల్, డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. అయితే నాన్ టెండర్ డ్రగ్స్‌ను కూడా సప్లై చేయాలని గతంలోనే సూపరింటెండెంట్ కాంట్రాక్టర్‌కు ఆర్డర్ ఇచ్చారు. అయితే దానికి గడువు ఇంకా ఐదు నెలలు ఉండగానే ప్రతి దానిలో 10 శాతం వాటా కావాలంటూ సూపరింటెండెంట్ లచ్చు నాయక్ డిమాండ్ చేశారు. అందులో భాగంగానే కాంట్రాక్టర్ 45 రోజుల కిందట లక్ష రూపాయలు, 12 రోజుల కిందట మరొక లక్ష రూపాయలు ఇచ్చాడు. కాగా మూడ్రోజుల కిందట కాంట్రాక్టర్‌తో మాట్లాడిన సూపరింటెండెంట్ మళ్లీ రూ.3 లక్షలు డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకుంటే టెండర్ కాల్ ఫర్ చేస్తానని చెప్పడంతో కాంట్రాక్టర్ రాపోలు వెంకన్న ఏసీబీని ఆశ్రయించాడు. 9తేదీనే ఏసీబీకి ఫిర్యాదు అందింది. అప్పటి నుంచి అధికారులు వివరాలు సేకరించారు. శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో కాంట్రాక్టర్ సూపరింటెండెంట్ ఇంటికి వెళ్లి డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డబ్బులను రికవరీ చేశారు. సూపరింటెండెంట్ లచ్చు నాయక్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని సూపరింటెండెంట్ చాంబర్లోనూ తనిఖీ చేశారు. టెండర్ ప్రాసెస్, నాన్ టెండర్ ప్రాసెస్ రికార్డులతో పాటు మరికొన్ని రికార్డులను పరిశీలించారు. విచారణ పూర్తయిన అనంతరం కోర్టులో హాజరు పరచనున్నారు. నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా 2021 డిసెంబర్ 30న లచ్చు నాయక్ బాధ్యతలు స్వీకరించారు.
దిక్కుతోచని పరిస్థితుల్లో ఏసీబీని ఆశ్రయించా..
రెండు సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి మందులు సరఫరా చేస్తున్నాను. నన్ను జేపీ అపాయింట్‌మెంట్ చేశారు. నిబంధనలకు అనుగుణంగా మందులు సప్లై చేస్తున్నాను. గత నవంబర్ నెలలో ఆడిట్ జరిగింది. దాని బేస్ చేసుకుని సూపరింటెండెంట్ లచ్చు నాయక్ డబ్బులు డిమాండ్ చేశారు. లేదంటే టెండర్ పెడతానని చెప్పారు. ఇప్పటికే రెండు లక్షలు ఇచ్చినా మళ్లీ మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేయడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏసీబీని ఆశ్రయించాను. రాపోలు వెంకన్న (డ్రగ్స్ కాంట్రాక్టర్)