– కంబాలపల్లిలో భూమి.. మద్దికుంట భూమికి రిజిస్ట్రేషన్
– తహసీల్దార్ ప్రతిపాదన.. ఎన్‌ఓసీ ఇచ్చిన ఆర్డీఓ
– పేదలకిచ్చిన ఇండ్ల స్థలాల భూమిని కాజేసిన వైనం
– ఫిర్యాదులు పట్టని రెవెన్యూ అధికారులు
– మూడ్రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ కలెక్టర్ ఆదేశం
– అయినా విచారణ చేపట్టని అధికారులు
ఫోర్జరీ ప్రొసీడింగ్‌తో రూ.40 కోట్ల విలువ చేసే పదెకరాల భూమిని కబ్జా చేశారు కొంతమంది ప్రబుద్దులు. కంబాలపల్లిలో భూమి ఉంటే మద్దికుంటలో విలువైన భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వ్యక్తి లేకపోయినా అతని పేరిట మాజీ సైనికుడి కోటాలో ఐదెకరాల్ని కాజేశారు. సదాశివపేట రెవెన్యూలో అంతు చిక్కని భూదందా లోగుట్టు వ్యవహారమిది. ఫోర్జరీ పత్రాలతో ఎన్‌ఓసీకి అర్జి పెడితే గుడ్డిగా తహసీల్దార్ ప్రతిపాదన పంపగా ఆర్డీఓ ఎన్‌ఓసీ ఇచ్చేశారు. ముంబయి జాతీయ రహదారి వెంట ఉన్న విలువైన భూముల్ని కాజేసిన వైనంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులకు పట్టించుకోకపోవడం గమనార్హం. అసలు విషయం తెలిసి బాధిత కుటుంబం లబోదిబోమంటోంది.
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిది
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని నిజాంపూర్‌కు చెందిన మాజీ సైనికుడు గులాం మహముద్‌కు 22 నవంబర్ 1995లో ప్రభుత్వం కంబాలపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 88లో 5 ఎకరాల భూమిని కేటాయించింది. ప్రొసీడింగ్ నెంబర్ బీ/3883/1995 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గులాం మహమూద్‌కు పట్టా ఇచ్చింది. మద్దికుంటకు చెందిన ఆరీఫుద్దీన్ మహమూద్ కుటుంబ సభ్యులను సంప్రదించి భూమిని అమ్ముతారా అని అడిగారు. అందుకు గులాం మహమూద్ భార్య నజీమున్నీసాబేగం అంగీకరించారు. దీంతో భూమికి సంబంధించి ఒరిజినల్ పట్టా సరిఫికెట్ ఇవ్వాలని కోరగా.. తన భర్త పేరిట ఉన్న సర్టిఫికెట్‌ను ఇచ్చింది. అది తీసుకెళ్లిన ఆరీఫుద్దీన్‌్.. ఒరిజినల్ ప్రోసీడింగ్ సర్టిఫికెట్ నెంబర్ బీ/3883/1995కు బదులుగా ప్రొసీడింగ్ నెంబర్ బీ/3883/22.11.2000గా ఫోర్జరీ సర్టిఫికెట్ సృష్టించాడు. ఫోర్జరీ సర్టిఫికెట్‌తో ఎన్‌ఓసీ తీసుకున్నారు. కంబాలపల్లిలో గులాం మహమూద్‌కు ప్రభుత్వం ఇచ్చిన భూమికి మార్కెట్ విలువ లేకపోవడంతో.. ఆరీపొద్దీన్ తన సొంత ఊరైన మద్దికుంటలో 88 సర్వే నెంబర్‌లోని పేదల భూమి ఐదెకరాలను ఫోర్జరీ సర్టిఫికెట్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. కాగితాల్లో తప్ప పొజిషన్‌లో భూమి లేకపోయేసరికి 88 సర్వే నెంబర్‌లో ఉన్న పేదల ఇండ్ల స్థలాల భూమి రెండెకరాలు, పేదలకు అసైన్డ్ చేసిన మూడెకరాల భూమిని గులాం మహముద్ నుంచి తాము కొనుగోలు చేసినట్టుగా కబ్జా చేశారు.
గుడ్డిగా ఎన్‌ఓసీ ఇచ్చిన అధికారులు
ఒరిజినల్ ప్రొసీడింగ్ కాకుండా ఫోర్జరీ సర్టిఫికెట్ పెట్టి ఎన్‌ఓసీ కోరగా.. రెవెన్యూ అధికారులు కనీసం రికార్డుల్ని పరిశీలించకుండా కాసులకు కక్కుర్తిపడి ఎన్‌ఓసీ ఇచ్చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన అర్జీని పరిశీలించి జత చేసిన ప్రొసీడింగ్ సర్టిఫికెట్ ఒరిజినలా కాదా అన్నది కూడా పరిశీలించలేదు. ఏదీ చూడకుండా తహసీల్దార్ ప్రతిపాదనలు పంపగా ఆర్డీఓ కార్యాలయం నుంచి ఎన్‌ఓసీ జారీ చేశారు. రాజమ్మ పేరిట ఉన్న రెండెకరాల భూమిని కూడా మహ్మద్ ఖాజా పేరిట మార్పిడి చేశారు. లేని వ్యక్తి ప్రకాశ్‌రావు పేరిట మాజీ సైనికుడి కోటాలో ఐదెకరాల్ని కట్టబెట్టారు.
నజీమున్నీసాబేగంను నమ్మించిన వైనం
ఒరిజినల్ ప్రొసీడింగ్ సర్టిఫికెట్‌కు బదులు ఫోర్జరీ చేసి తమ భూమిని కాకుండా మద్దికుంటలో మరొకరి భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్న విషయాన్ని నజీమున్నీసాబేగం గమనించలేదు. తమ భూమిని అమ్ముకున్నందున కొనుగోలుదారులు సంతకాలు చేయమన్న చోట చేసేశారు. తన భర్త పేరిట ఉన్న భూమిని కాటం మల్లేశం, ఆరీఫుద్దీన్‌్ అనే ఇద్దరు వ్యక్తుల పేరిట భూమి రిజిస్ట్రేషన్ జరిగింది. ఆమెకు ఇంగ్లీష్ రాకపోవడంతో డాక్యుమెంట్‌లో ఏం రాశారో చూడలేదు. ఫోర్జరీ సర్టిఫికెట్ గురించి కొన్నాళ్ల తర్వాత తెలుసుకున్న నజీమున్నీసాబేగం 2018 జూన్‌లో జిల్లా కలెక్టర్‌కు ఒక డిక్లరేషన్ ఇచ్చారు. ఆరీపొద్దీన్ తమ భూమిని కాకుండా మద్దికుంటలో ఉన్న వేరొకరి భూమిని కొనుగోలు చేసినట్టు తప్పుడు రిజిస్ట్రేషన్ చేసున్నట్టు మాకు తెల్వదని, మాకున్న కంబాలపల్లిలోని భూమిని మాత్రమే రిజిస్ట్రేషన్ చేశామంటూ ఆమె కలెక్టర్‌కు రాతపూర్వంగా సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చారు.
ప్రకాశ్‌రావు పేరిట భూమాయ
రాజమ్మ భర్త చెన్న బసప్ప పేరును తొలగించి ఎంఆర్‌ఓ ప్రొసీడింగ్ బీ/3585/95 ద్వారా 1995లో వ్యాపారి మహ్మద్ ఖాజా పేరును చేర్చారు. సర్వే నెంబర్ 88, 55లో రెండెకరాల భూమిని పట్టా మార్పిడి చేశారు. సదాశివపేట మండలంలోని మద్దికుంట గ్రామంలో 88 సర్వే నెంబర్‌లో 95 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. అందులోంచి 19 సెప్టెంబర్ 1975లో ప్రొసీడింగ్ నెంబర్ ఎ5/6987/7 ద్వారా 81 ఎకరాల ప్రభుత్వ భూమిని సదాశివపేట మండలంలోని మద్దికుంట గ్రామానికి చెందిన 41 మంది పేదలకు పంచారు. అదే సర్వేనెంబర్‌లో ఉన్న భూమిలోంచి 10 ఎకరాలను ప్రొసీడింగ్ నెంబర్ బీ/3585/93 ద్వారా ఇండ్లు లేని, నైపుణ్యంలేని నిరుపేద కార్మికులకు ఇండ్ల స్థలాల కోసం పంపిణీ చేశారు. మరో 4 ఎకరాలు జాతీయ రహదారికి, మద్దికుంట రోడ్డుకు రెండున్నర ఎకరాలు పోయింది. ఎకరం మాజీ సైనికుడి కుటుంబానికి చెందిన అమీనాబికి పంపిణీ చేశారు. 20 గుంటలు మాత్రమే కారిజ్ ఖాతాగా ఉన్నది. 88 సర్వే నెంబర్‌లో భూమి మిగల్లేదు. పాత ప్రొసీడింగ్ పేరిటనే సింగరాయపాలెంకు చెందిన జీవీఎస్‌ఎస్ ప్రకాశ్‌రావు మాజీ సైనికుడి పేర 88 సర్వే నెంబర్‌లో 5 ఎకరాల్ని అదే రోజున పట్టా సర్టిఫికెట్ ఇచ్చినట్టు ఫోర్జరీ పట్టా సృష్టించారు. ప్రకాశ్‌రావుకు భూమి కేటాయించినట్టు రెవెన్యూ రికార్డుల్లో ఏ పత్రాలూ లేవు.
రూ.40 కోట్ల భూమి కాజేసిన తంతు
ఫోర్జరీ సర్టిఫికెట్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న మొత్తం 10 ఎకరాల భూముల విలువ రూ.40 కోట్లపైనే ఉంటుంది. ముంబయి హైవే పక్కన ఉన్న భూములు కావడంతో అధిక ధరకు విక్రయాలు సాగాయి. చేతులు మారాక ప్రస్తుతం ప్లాటింగ్ చేసి గజం భూమిని రూ.20 వేల నుంచి రూ.25 వేలకు విక్రయిస్తున్నారు. భూ కబ్జా గురించి అప్పటి తహసీల్దార్ ఆశాజ్యోతి, ఆర్‌ఐ వీరేశంకు ఫిర్యాదులు వెళ్లాయి. అయినప్పటికీ భూముల కబ్జా వ్యవహారం గురించి వాళ్లు పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి.మద్దికుంటలోని 88 సర్వే నెంబర్‌లో ప్రకాశ్‌రావు పేరిట ఐదు ఎకరాలు, మహముద్ పేరిట మరో 5 ఎకరాలను అక్రమ పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జాయింట్ రిజిస్ట్రేషన్ ఉన్న భూమిని ఆరీఫుద్దీన్‌్ ఒక్కడే ఢిల్లీకి చెందిన లతాగుప్తకు విక్రయించారు. ఆమె సదాశివ ఎన్‌క్లేవ్ డెవలప్‌మెంట్ సంస్థకు అప్పజెప్పి ప్లాట్స్ చేసి అమ్ముతున్నట్టు తెలిసింది.
విచారణకు ఆదేశించిన కలెక్టర్
మద్దికుంట భూ కబ్జా గురించి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతికి జనవరి 19న ఫిర్యాదు అందింది. భూమి గోల్‌మాల్ జరిగిన లోగుట్టుకు సంబంధించిన ఆధార పత్రాల్ని కలెక్టర్‌కు ఇచ్చారు.స్పందించిన కలెక్టర్ మూడ్రోజుల్లో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆర్డీఓకు రాశారు. 16 రోజులైనా ఎలాంటి విచారణ జరగలేదు. కలెక్టర్ ఆదేశాల్ని రెవెన్యూ అధికారులు ఖాతరు చేయకపోవడం గమనార్హం.