కోవిడ్‌లో రూ. 40 వేల కోట్ల స్కామ్‌

In covid Rs. 40 thousand crore scam– యడ్యూరప్పపై బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు
బెంగళూరు : కోవిడ్‌ మహమ్మారి సమయంలో వైరస్‌ను ఎదుర్కొనే పేరుతో అప్పటి ముఖ్యమంత్రి బిఎస్‌ యడ్యూరప్ప రూ. 40 వేల కోట్ల స్కామ్‌కు పాల్పడ్డారని బీజేపీకే చెందిన ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాల్‌ తాజాగా ఆరోపించారు. ‘ కోవిడ్‌ సమయంలో ఎన్ని వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందో మీకు తెలుసా.? కోవిడ్‌ పేరు చెప్పి రూ 40 వేల కోట్లు కొల్లగొట్టారు’ అని యత్నాల్‌ శుక్రవారం ఇక్కడ విలేకరులకు తెలిపారు. ‘రూ. 45 ఖరీదు ఉండే మాస్కును కోవిడ్‌ సమయంలో రూ.485 ఖరీదుతో అప్పటి ప్రభుత్వం కొనుగోలు చేసింది’ అని విజయపుర నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎన్నికైన యత్నాల్‌ ఆరోపించారు. అలాగే, ‘బెంగళూరులో 10 వేల పడకలతో ఆస్పత్రి ఏర్పాటు చేశామని అప్పటి బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పడకలు (బెడ్లు) అన్ని అద్దెకు తీసుకొన్నవే. ఒక పడకను అద్దెకు తీసుకున్న ధరతో రెండు పడకలను కొనుగోలు చేయవచ్చును. ఒక పడకకు రోజుకు రూ 20 వేల అద్దె చెల్లించారు. రూ 20 వేలతో సెలైన్‌ స్టాండ్లు ఉన్న రెండు మంచాలు కొనుగోలు చేయవచ్చు’ అని యత్నాల్‌ తెలిపారు. దేశంలో కరోనా విజృంభణ సమయంలో అంటే 2019 జులై నుంచి 2021 జులై వరకూ కర్నాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప పదవిలో ఉన్నారు. కాగా, బీజేపీ ఎమ్మెల్యే యత్నాల్‌ చేసిన ఆరోపణలపై ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. కోవిడ్‌ సమయంలో భారీ అవినీతి జరిగిందనడానికి యత్నాల్‌ వ్యాఖ్యలే రుజువులు అని అన్నారు. అలాగే, యడ్యూరప్ప ప్రభుత్వం రూ. 4 వేల కోట్ల స్కామ్‌కు పాల్పడిందని కాంగ్రెస్‌ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే ఆరోపించిన విషయాన్ని సిద్ధరామయ్య గుర్తు చేశారు.