– ప్రతి మ్యాచ్‌కు రూ.67.7 కోట్లు
– సొంతం చేసుకున్న వయకామ్18
– బీసీసీఐ టెలివిజన్, డిజిటల్ మీడియా హక్కులు
ముంబయి: మీడియా హక్కుల వేలంతో బీసీసీఐ మరోసారి ఖజానా నింపుకుంది. ఐపీఎల్ మీడియా హక్కులతో రూ. 48,390 కోట్లు ఆర్జించిన భారత క్రికెట్ బోర్డు.. జాతీయ రానున్న ఐదేండ్ల కాలానికి జాతీయ జట్టు స్వదేశీ సీజన్ మ్యాచులకు మీడియా హక్కులకు ఈ వేలం నిర్వహించింది. ముఖేశ్ అంబానికి చెందిన వయకామ్18 సంస్థ రూ.5960 కోట్లకు టెలివిజన్, డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. దీంతో స్వదేశంలో జరిగే ప్రతి మ్యాచ్‌కు రూ.67.7 కోట్లను వయకామ్18 చెల్లించనుంది. గతంలో స్టార్ ఇండియా చెల్లించిన మొత్తంతో పోల్చితే ఇది రూ.7.5 కోట్లు ఎక్కువ. ఈ నెల ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌తో వయకామ్ 18 ఒప్పందం మొదలై.. 2028 మార్చిలో ముగియనుంది. ఐపీఎల్ డిజిటల్, జాతీయ జట్టు టెలివిజన్, డిజిటల్ హక్కులతో భారత క్రికెట్‌పై రిలయన్స్ గుత్తాధిపత్యం సాధించింది.