బ్యాంక్ ఖాతాలో నుంచి రూ.65000 మాయం 

– పోలీసులను ఆశ్రయించిన బాధితుడు 
నవతెలంగాణ – కంటేశ్వర్

బ్యాంకు ఖాతాదారుడి ప్రమేయం లేకుండానే ఖాతా నుంచి..రూ.65 వేలు మాయమైన ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తున్న రత్నాకర్ ఖాతాలో నుంచి సుమారు రూ.65వేలు విత్ డ్రా అయిన‌ట్లు ఫోన్ కు మెసేజ్ రావడంతో కంగుతిన్నాడు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ.. గత రెండు రోజుల నుంచి తన ఫోనుకు పదేపదే ఓటీపీలు వస్తున్నాయని తెలిపారు. ఫోన్ కు వచ్చిన ఓటీపీలను ఎవరికీ షేర్ చేయలేదని, అంతే కాకుండా ఎలాంటి లింకు ఓపెన్ చేయలేదని తెలిపారు. కానీ త‌న ఖాతా నుంచి డబ్బులు ఎలా పోయాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయమై న్యాయం చేయాలని శివాజీ నగర్ బ్రాంచ్ లో గల యూనియన్ బ్యాంకును ఆశ్రయించగా బాధితుడి ఖాతా బ్యాంకు లావాదేవీలకు సంబంధించి స్టేట్ మెంట్ ను పరిశీలించారు. ఈ విషయమై సైబర్ క్రైమ్ ని ఆశ్రయించాలని బ్యాంకు ఉద్యోగులు బాధితుడికి సూచించినట్లు తెలిపారు. దీంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో న్యాయం చేయాలని ఫిర్యాదు చేస్తానని తెలిపారు.