గాలిలో తేలిపోతున్నంత ఆనందంతో వచ్చిపడ్డాడు నా చిన్ననాటి స్నేహితుడు సుబ్బారావు. వాడి కండ్లలో ఆనందం తొణికిసలాడుతున్నది. రావటం రావటంతోనే ‘యురేకా’ అని అరచి కుర్చీలో కూలబడ్డాడు.
”ఏంటి సుబ్బారావు ఏమి కనిపెట్టావ్, అంత ఆనందంగా వున్నావు” అని అడిగా.
వీడు పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటినుంచి చాలా డీలా పడిపోయాడు. మోడీ మళ్లీ అధికారంలోకి వస్తాడని తెగ అశ పడ్డాడు. పాపం, ఓటర్లు, దేవుళ్ళు కలిసి వీడి ఆశలమీద నీళ్లు చల్లారు. ఏదో ఇంకో రెండు పార్టీలతో కలిసి అధికారపీఠం దక్కించుకున్నా, దెబ్బతీసిన ఫలితాల వల్ల వచ్చిన నీరసం, నిరాశ తగ్గలేదు. మోడీకి 400 సీట్లు వస్తాయని వెర్రిగా నమ్మాడు. ప్రేమలాగే భక్తి కూడా గుడ్డిదే మరి. మనవాడేమో మోడీకి, బీజేపీకి వీర భక్తుడు. ఇన్ని రోజుల తరువాత వీడు ఆనందపడటానికి కారణమేమిటో నాకు అంతు చిక్కలేదు.
”యురేకా అంటూ గావుకేక పెట్టావ్. నీ ఆనందానికి కారణమేమిటో సెలవివ్వు మైడియర్ ఆర్కమెడీస్” అని అడిగా.
”బీజేపీ ఓడిపోవడానికి అసలు సిసలు కారణం ఆర్‌ఎస్‌ఎస్ సార్ కనిపెట్టేశాడు. అహంకారం వల్ల మోడీ ఓడిపోయాడట. రాజకీయాల్లో అహంకారం వీడి, సేవకుల్లా ఉంటే ఫలితం మరో విధంగా ఉండేదట. రోగానికి కారణం తెలిసిందిగా, ఇంకా డోఖా లేదు. మళ్లీ వచ్చే ఎన్నికల్లో మోడీనే బంపర్ మెజారిటీతో గెలుస్తాడు” సుబ్బారావు ఈ మాటలంటూ ఊహల్లో ఎక్కడికో వెళ్లాడు.
”ఇదిగో సుబ్బారావు.. నీ పేరు పిచ్చి పుల్లయ్యగా మార్చుకో”
”అదేంటి,అంత మాట అన్నావ్.”
”లేకపోతే ఏంటి సుబ్బారావు , ప్రజలు నాయకుడి అహంకారాన్ని లీటర్లు మీటర్లు కొలిచి, లెక్కతీసి ఓట్లు వేస్తారా?”
”మరి అర్‌ఎస్‌ఎస్ ఎందుకన్నట్టో?”
”నిన్ను పిచ్చి పుల్లయ్య చేయడానికి అన్నాడ్లే”
”అయినా, నీకంతా వేళాకోళంగా ఉంటుంది, మేమంటే మరీను.”
”ఇదిగో సుబ్బారావు, మోడీ ఎన్ని బహిరంగ సభల్లో మాట్లాడాడు, రోడ్ షోలు చేశాడు, ఎంత వంగి వంగి నమస్కారాలు చేశాడు. ఎంత వినయం ప్రదర్శించాడు, లెక్కుందా? ప్రజలు ఎంత అభిమానంతో పూలజల్లు కురిపిం చారు, ఎన్ని గజమాలలు వేశారు? చూసావు కదా! అయినా చివరికి అయోధ్య రామాలయం ఉన్న ఫైజాబాద్‌లో కూడా ఓడిపోయింది. రామమందిర్ తనే కదా అట్టహాసంగా ప్రారంభించింది. అయినా భంగం తప్పలేదు, ఎందుకని?”
”ఎందుకని.. ఎందుకని?” తిరిగి అదే ప్రశ్న ఎదురు వేశాడు సుబ్బారావు.
”ఆలోచించు. ఇండియాకూటమి మీద, ముస్లింల మీద ఎంత ద్వేషం వెళ్లగక్కాడు. ఇదంతా ఎందుకు? ఓటర్లను ఆకట్టుకోవడానికే కదా, అయినా ఓడాడు. ఎందుకని? ఆలోచించు.”
”ప్రతిసారి ఓడాడు ఓడాడు అనవాక నాయనా? నా మనస్సు చివ్వుమంటుంది. అయినా ఇప్పటికీ కూడా ప్రధాని మోడీనే కదా.” ఓటమిని ఒప్పుకోలేని భక్తాగ్రేసరుడు మరి మా సుబ్బారావు.
”303 నుంచి 250కి పడిపోయినా గెలిచాడు అనాలా? భక్తులకు దేవుడు అవసరం ఉందో, లేదో గాని, ఇప్పుడు మాత్రం సాక్షాత్తు భగవంతుడికి భగవంతుడి అవసరం వచ్చిపడింది. టీడీపీ, జెడియూ లేకపోతే మీ భగవంతుడు ప్రధాని అవతారం చాలించాల్సి వచ్చేదే.”
” బాబ్బాబు, మోడీని మరీ అంతగా తీసివేయకు, నేను తట్టుకోలేను.”
”సుబ్బారావు, ఒక విషయం చెప్పు. ఆర్‌ఎస్‌ఎస్ సార్, ఎన్ని సుద్దులు చెప్పాడు. అందులో ఒక్కసారైనా బీజేపీ నిరుద్యోగం పెరగడంగానీ, ధరలు అందుబాటులో లేనంత ఎత్తుకు పెరుగుతున్నాయని గానీ , రైతులకు పంట మద్దతు ధర లేకపోవడం గురించి గానీ, ఫ్యాక్టరీ కార్మికుల జీతాల విషయంగానీ, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల గురించి గానీ పల్లెత్తు మాట అన్నాడా? ఇవికాదూ”
”ఆహా…ఎందుకనలేదు? మణిపూర్‌లో శాంతి కలిగించటం ప్రాధాన్యత చూడాలని అన్నాడు కదా?”
”అందుకనే నిన్ను పేరు మార్చుకోమనేది. ఎన్నికల ప్రచారం కోసం అయినా అక్కడికి వెళ్ళలేదు. ఎందుకని?
ఈయన చెబితే దానికి ప్రాధాన్యత ఇస్తాడా?”
”అయితే ఆర్‌ఎస్‌ఎస్ చెప్పినట్టు ఓటమికి అహంకారం కారణం కాదా మిత్రమా?”
ఈ ప్రశ్న విన్న నాకు సుబ్బారావు మొహంలో అమాయ కత్వం కనపడ్డది.
”కచ్చితంగా కాదు సుబ్బారావు, నీలాంటి వాళ్లందరినీ మాయలో పడేయటానికి, మోడీ కాకపోతేనో లేక అహంకా రం లేని ప్రధాని మోడీ అయితేనో 400 సీట్లు వచ్చేవని మీలాంటి భక్తులకు భ్రమలు కల్పించడానికి ఆర్‌ఎస్‌ఎస్ సార్ చేసిన మాటల గారడి ఇది. నాయకుల అహంకారాలు, వినయాల మీద ఆధారపడి ప్రజలు ఓట్లు వేయరు. తమ సమస్యల పరిష్కారం కోసం ఓటు వేస్తారు. ఇది దాచిపెట్టడానికే ఆర్‌ఎస్‌ఎస్ చేస్తున్న విన్యాస ప్రసంగం ఇది.దీన్ని పట్టుకొని టీవీల వాళ్లు, పేపర్ వాళ్లు, సోషల్ మీడియా వాళ్లు చూశారా..చూశారా… ఆర్‌ఎస్‌ఎస్ మోడీకి మొట్టికాయలు వేసిందని పెద్దగా ప్రచారం చేస్తున్నారు.”
”ఇదిగో…ఇదిగో..నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావ్ మిత్రమా” అన్నాడు నా దోస్తు సుబ్బారావు.
”కన్ఫ్యూ చేయటం లేదు సుబ్బారావు, దాన్ని పోగొడుతున్నాను. ఆర్‌ఎస్‌ఎస్ నాయకులను మనం ఒకటి అడుగుదాం. మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్, దానికున్న పిల్ల సంస్థ బీజేపీ. ఎప్పుడూ ఎన్నికల్లో పాల్గొనని ఆర్‌ఎస్‌ఎస్, జనసంఫ్‌ు అని, జనతా పార్టీ అని, బీజేపీ అని- వీటిని అడ్డం పెట్టుకొని రాజకీయ అధికారం చెలాయించడం ఎందుకోసం అని అడుగుదాం. ఇటువంటి ప్రశ్నకు ఆర్‌ఎస్‌ఎస్ నాయ కులు ఎప్పుడైనా సరైన సమాధానం చెప్పారా? ఆలోచించు మైడియర్ సుబ్బారావు.”
”నీ దగ్గరికి వచ్చినందుకు నా ఉత్సాహం అంతా తుస్సు మంది.”
”నీరసపడవాక.ఆలోచించు సుబ్బారావు ఆలోచించు. అది మాత్రమే నిన్ను నన్ను దేశాన్ని రక్షించగలదు”.
– -కర్లపాలెం