– కార్మికులకు, సంస్థకూ నష్టమే…
– బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్‌లు కొనసాగించాలి: ఆ స్థానంలో ప్రయివేటు సిమ్‌లు వద్దు
– టీఎస్‌ఆర్టీసీ చైర్మెన్,
– ఎమ్‌డీకి ఎస్‌డబ్ల్యూఎఫ్ వినతి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో అక్కౌంట్స్ విభాగాన్ని పునర్వవస్థీకరణ పేరుతో కేంద్రీకరించవద్దని టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) కోరింది. దీనివల్ల కార్మికులకు, సంస్థకూ నష్టమేనని విశ్లేషించింది. అలాగే సంస్థ తరఫున కార్మికులకు ఇచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్ కార్డుల స్థానంలో ప్రయివేటు సంస్థ ఎయిర్‌టెల్ సిమ్‌లు తీసుకోవాలని ఇచ్చిన ఉత్తర్వులను కూడా వెనక్కి తీసుకోవాలని కోరింది. ఈ మేరకు ఆ సంస్థ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్‌కు వినతిపత్రాలు సమర్పించినట్టు ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్ల అక్కౌంట్స్ ఆఫీసుల్ని జోనల్ స్థాయిలో ఒకే చోటకి కేంద్రీకరిస్తూ టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఈనెల 6వ తేదీ ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. దానిలో పైలట్ ప్రాజెక్ట్ అని పేర్కొన్నా, మిగిలిన రీజియన్లను జోనల్ పరిధిలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారని చెప్పారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాలు, చిన్న రెవెన్యూ డివిజన్లు, చిన్న మండలాలను ఏర్పాటు చేసి, అక్కడ పనిచేసేందుకు ఉద్యోగులను రిక్రూట్ చేస్తుంటే, ఆర్టీసీలో అందుకు భిన్నంగా వికేంద్రీకరణలో ఉన్న విభాగాలను కేంద్రీకరించడం ఏంటని ప్రశ్నించారు. దీనివల్ల ఆర్టీసీ కార్మికులు ప్రతి చిన్న సమస్య పరిష్కారానికీ జోనల్ స్థాయికి వెళ్లాల్సి వస్తుందనీ, ఫైళ్లు అక్కడికీ, ఇక్కడికీ తిప్పడం వల్ల కాలయాపన జరిగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికార కేంద్రీకరణ జరిపి, గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో క్లర్కులు, సూపర్‌వైజర్లు అదనంగా ఉన్నట్టు తేల్చారనీ, మిగిలిన జోన్లలోనూ ఇదే తరహాలో మిగులు సిబ్బంది అంటూ యాజమాన్యం కార్మికుల ఉద్యోగ భద్రతను హరించే అవకాశాలు లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. యాజమాన్యం తక్షణం ఈ తరహా ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఎయిర్‌టెల్ వద్దు..
ప్రభుత్వరంగంలో ఉన్న టీఎస్‌ఆర్టీసీ ప్రయివేటు సంస్థ ఎయిర్‌టెల్‌ను ప్రోత్సహించడాన్ని ఎస్‌డబ్ల్యూఎఫ్ తప్పుపట్టింది. సంస్థలోని కార్మికులకు బీఎస్‌ఎన్‌ఎల్ ఇచ్చిన సిమ్స్ స్థానంలో ఎయిర్‌టెల్ సిమ్స్ తీసుకోవాలని ఇచ్చిన ఉ త్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.
ఈ మేరకు సంస్థ ఎమ్‌డీ, చైర్మెన్‌లకు వినతిపత్రాలు సమర్పించినట్టు ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు తెలిపారు. గ్రూప్ కాల్ సౌకర్యంలో భాగంగా రూ.36 లతో బీఎస్‌ఎన్‌ఎల్ ప్రతి ఆర్టీసీ కార్మికుని కుటుంబానికి యాడ్‌ఆన్‌గా ఐదు సిమ్‌కార్డులు ఇచ్చిందనీ, ఇప్పుడు వాటిని కాదని ఎయిర్ టెల్ సంస్థ ద్వారా కేవలం రెండు సిమ్‌లు ఇస్తూ, అంతకంటే ఎక్కువ టారిఫ్ చెల్లించేలా ఒప్పందం చేసుకోవడం సరికాదని పేర్కొన్నారు. 5జీ పేరుతో ఎయిర్‌టెల్ రెండు సిమ్‌లు ఇస్తే, దానికోసం 5జీ సపోర్ట్ చేసే ఫోన్లను కూడా కొనాల్సి వస్తుందని వివరించారు.
ఆర్టీసీ కార్మికుల పీఎఫ్ సహా అన్నింటికీ బీఎస్‌ఎన్‌ఎల్ నెంబర్లే యాడ్ అయ్యి ఉన్నాయనీ, దాన్ని పోర్ట్ చేసుకొనే వెసులుబాటు లేదన్నారు. కార్మికులపై ఆర్థికభారం మోపే ఇలాంటి చర్యల్ని తమ సంఘం వ్యతిరేకిస్తుందని తెలిపారు. ఆ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని కోరారు.