నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
నూతన సంవత్సరం సందర్భంగా టీఎస్‌ఆర్టీసీలోని కార్మిక సంఘాలు గెట్ టు గెదర్ నిర్వహించాయి. బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమం టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) అధ్యక్షులు వీరాంజనేయులు అధ్యక్షతన జరిగింది. ఆ సంఘం ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు, ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న, కార్మిక పరిషత్ ప్రధాన కార్యదర్శి యాదగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత ప్రయాణం పథకం విజయవంతం అయ్యిందనీ, ఆర్టీసీలకు పూర్వ వైభవం వస్తున్నదని అభిప్రాయపడ్డారు. అయితే కార్మికుల సమస్యలు మాత్రం ఇంకా పరిష్కారం కాలేదనీ, ప్రభుత్వం వాటిపై దృష్టి పెట్టాలని కోరారు. నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ఎస్‌డబ్ల్యూఎఫ్ ప్రచార కార్యదర్శి పీ రవీందర్‌రెడ్డి, కోశాధికారి గంగాధర్, రాష్ట్ర కార్యదర్శులు ఏవీ రావు, కేబీ గౌడ్, ఎస్ కృష్ణ, చంద్రప్రకాష్. ఈయూ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకన్న గౌడ్, జోనల్ కార్యదర్శి రాఘవులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ స్థలాలు లీజుకు ఇవ్వొద్దు-ఎస్‌డబ్ల్యూఎఫ్
ఆర్టీసీకి చెందిన ఖాళీ స్థలాలను ప్రయివేటు సంస్థలు, వ్యక్తులకు లీజుకు ఇవ్వొద్దని టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు, వీఎస్ రావు డిమాండ్ చేశారు. ఆ స్థలాలను ఆర్టీసీ విస్తరణ కోసమే వినియోగించాలని కోరారు. ఈ స్థలాలన్నీ కీలక ప్రాంతాల్లో ఉన్నాయనీ, గత అనుభవాలను పరిగణనలోకి తీసుకొని, లీజు వంటి ప్రతిపాదనలు ఏవైనా ఉంటే ప్రభుత్వం తక్షణం వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో లీజుకు తీసుకున్న సంస్థలు, వ్యక్తులు ఆర్టీసీకి కోట్ల రూపాయలు బకాయి పడ్డారని గుర్తుచేశారు. మహాలక్షి పథకం వల్ల ఆర్టీసీలో ప్రయాణీకుల సంఖ్య పెరిగిందనీ, దీనివల్ల బస్టాండ్లు, డిపోలు విస్తరించాల్సి ఉందన్నారు. ఆర్టీసీ స్థలాల వినియోగానికి ప్రభుత్వమే ఒక సంస్థను లేదా కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, దానిద్వారా నిధులు సమీకరించుకోవచ్చనీ, దీనివల్ల ఆర్టీసీ స్థలాలు ఆర్టీసీ ఆధీనంలోనే ఉంటాయనీ, ఆదాయం కూడా పెరుగుతుందని సూచించారు.