ఆర్టీసీ దొంగదెబ్బ!

RTC sneaky!– డైనమిక్‌ చార్జీలంటూ టిక్కెట్‌రేట్ల పెంపు
– సూపర్‌లగ్జరీ, డీలక్స్‌ బస్సులకూ వర్తింపు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) ప్రయాణీకులపై దొంగదెబ్బ తీసింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సూపర్‌ లగ్జరీ, డీలక్స్‌ బస్సు చార్జీలను పెంచేసింది. దీనితో ప్రయాణీకులు భగ్గుమంటున్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్పి, పురుషుల నుంచి అధిక చార్జీలు వసూలు చేయడం ఏంటని ప్రశ్నింస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్‌ నుంచి వరంగల్‌కు సూపర్‌ లగ్జరీ బస్సులో సాధారణ టిక్కెట్‌ చార్జీ రూ.245 మాత్రమే. కానీ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ముగియగానే ప్రజలు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సుల్లో వస్తారని అంచనా వేసిన టీఎస్‌ఆర్టీసీ, ఇప్పటి వరకు బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం వంటి అంతర్రాష్ట్ర సర్వీసుల్లో అమలు చేసే ‘డైనమిక్‌ టిక్కెట్‌’ విధానాన్ని సప్పుడు లేకుండా సూపర్‌ లగ్జరీ బస్సుల్లో అమల్లోకి తెచ్చారు. దీనితో హైదరాబాద్‌ నుంచి హన్మకొండకు వెళ్లే బస్సు టిక్కెట్‌ ధర ఏకంగా రూ.350కి పెరిగింది. ప్రయాణీకులు ఈ టిక్కెట్లను సోషల్‌ మీడియాలో పెట్టి ‘ఇదీ గుంపు మేస్త్రి దోపిడీ’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డిని ట్రోల్‌ చేస్తున్నారు. దీనికి ప్రతిపక్షాల విమర్శలు తోడై, ఇప్పుడీ అంశం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఆర్టీసీ అధికారులు వివరణ ఇచ్చేందుకు నిరాకరించారు. అయితే డైనమిక్‌ బస్సు చార్జీలు అమలు చేస్తామని గతంలో టీజీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ ప్రకటించారు. అయితే వాటిని సూపర్‌ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సులకు వర్తించవని చెప్పారు. వోల్వో, గరుడ, రాజధాని వంటి దూరప్రాంత బస్సుల్లోనే అమల్లో ఉంటాయని తెలిపారు. డైనమిక్‌ చార్జీలు అంటే… రద్దీని బట్టి విమాన టిక్కెట్ల రేట్లను ఎలాగైతే పెంచుతారో, అదే విధానాన్ని ఆర్టీసీ బస్సుల్లోనూ అమలు చేయడం. రద్దీ లేని సమయంలో టిక్కెట్‌ రేట్లను తగ్గిస్తారు. గతంలో సంక్రాంతి సెలవుల్లో మాత్రమే ఆర్టీసీ బస్సుల్లో ఒకటిన్నర రెట్లు చార్జీ వసూలు చేసేవారు. ఆ తర్వాత దాన్ని ఎత్తేసి, సెలవురోజుల్లోనూ పాత టిక్కెట్‌ చార్జీలే వసూలు చేస్తామని ప్రకటించారు. తాజాగా ‘మహాలక్ష్మి’ పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి తెచ్చారు. దీనితో ఆర్టీసీ బస్సుల్లో రోజువారీ కలెక్షన్లు తగ్గిపోయాయి. కొన్ని చోట్ల డీజిల్‌ చార్జీలు కూడా వసూలు కావట్లేదని కండక్టర్లు మొత్తుకుంటున్నారు. దీనితో బస్సెక్కే పురుషుల నుంచే టిక్కెట్‌ రేట్లు పెంచి వసూలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించినట్టు ఉందనే చర్చ ప్రయాణీకుల్లో జరుగుతుంది.