– వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్‌కు 60 స్పెషల్ బస్సులు
– నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్- ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య పోరు
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ నగరంలో నేటి నుంచి ఐపీఎల్ సందడి మొదలుకానుంది. బుధవారం సాయంత్రం ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్-ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్ సొంతగడ్డపై తొలి మ్యాచ్ కావడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రికెట్ ప్రియులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు నగరంలోని వివిద ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లోని 24 డిపోల పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి స్టేడియానికి 60 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ అవకాశాన్ని క్రికెట్ అభిమానులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు ఇదే విషయాన్ని ఎక్స్(ట్వీట్టర్) వేదికగా టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సైతం ప్రకటించారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు నగరంలోని వివిధ డిపోల నుంచి బస్సులు ప్రారంభమై.. తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి బయలుదేరుతాయి. వచ్చే నెల 5వ తేదీన జరిగే మ్యాచ్‌కు సైతం ఇవే సర్వీసులను యథావిధిగా నడపనున్నారు. ఆర్టీసీ బస్సుల్లో క్షేమంగా, సురక్షితంగా ఉప్పల్ స్టేడియానికి చేరుకోవాలని, ప్రయివేట్ వాహనాల్లో ప్రయాణించి ట్రాఫిక్, పార్కింగ్ ఇబ్బందుల్లో పడొద్దని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు.
మ్యాచ్ అనంతరం క్రికెట్ వీక్షకులకు అవసరమైన సూచనలు చేయడానికి స్టేడియం వద్ద ఉప్పల్, బడంగ్‌పేట్, హయత్‌నగర్-1కు చెందిన డిపో మేనేజర్లను ఇన్‌చార్జీలుగా నియమించారు. ఇతర ఎదైనా సమాచారం కోసం కోఠి, రైతిఫైల్‌లో ప్రత్యేక సహాయ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు.
మెట్రో అదనపు సర్వీసులు..
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ను దృష్టిలో పెట్టుకుని మెట్రో రైళ్లను అర్ధరాత్రి వరకు నడపనున్నారని సమాచారం. రాత్రి 7.30 గంటలకు మొదలయ్యే మ్యాచ్‌ను చూసేందుకు మధ్యాహ్నం నుంచే ప్రేక్షకులు స్టేడియం వద్దకు చేరుకునే అవకాశం ఉంది. మ్యాచ్‌కు 3 గంటల ముందు నుంచే ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతి ఇవ్వనున్నట్టు పోలీసులు చెబుతున్నారు. దీంతో మధ్యాహ్నం 12.30 నుంచే రైళ్ల ఫ్రీక్వెన్సీని మెట్రో అధికారులు పెంచనున్నారు. ఎప్పటిలాగే నాగోల్-అమీర్‌పేట మార్గంలో ఎక్కువ సంఖ్యలో రైళ్లను నడుపనున్నారు. అయితే దీనిపై మెట్రో అధికారులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.