– ఎన్నికల కోడ్ రాకముందే ప్రక్రియ ప్రారంభిస్తాం
– పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
– ఆర్టీసీ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం: ఎండీ వీసీ సజ్జనార్
– ఘనంగా గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్ అవార్డుల ప్రదానోత్సవం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆర్టీసీకి రథచక్రాలు, పునాదులు సిబ్బందేననీ, వారిని నిరంతరం ప్రోత్సహించడంలోనూ, సంక్షేమం విషయంలోనూ తమ ప్రభుత్వం ముందు వరుసలో ఉంటుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసానిచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని టీఎస్‌ఆర్టీసీ కళాభవన్‌లో గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్‌తో పాటు మేడారం జాతరలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఉద్యోగులకు, దసరా లక్కీ డ్రా విజేతలకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన పొన్నం ప్రభాకర్, టీఎస్‌ఆర్టీసీ ఎమ్‌డీ వీసీ సజ్జనార్‌తో కలిసి 157 మంది ఉత్తమ ఉద్యోగులకు అవార్డులను అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ..ప్రతి ఏటా అత్యుత్తమ విధులు నిర్వహించే మహిళా ఉద్యోగులకు కూడా మహాలక్ష్మి స్కీమ్ పేరుతో అవార్డులు ఇవ్వాలని ఆర్టీసీ ఎమ్‌డీ సజ్జనార్‌కు సూచించారు. 2013 బాండ్స్ పూర్తిచేస్తామని సీఎం ప్రకటించారని తెలిపారు. రేపటి నుంచే బాండ్స్ పేమెంట్లను ఉద్యోగులకు ఇస్తామన్నారు. ఎన్నికల కోడ్ వచ్చేలోపే పేమెంట్ చెల్లింపు ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు. పీఆర్సీపై సీఎంతో చర్చించి న్యాయం చేస్తానని హామీనిచ్చారు. పెండింగ్ బకాయిల చెల్లింపు ప్రభుత్వం దృష్టిలో ఉందనీ, వాటన్నింటినీ పరిష్కరిస్తామని భరోసానిచ్చారు. పీఎఫ్, సీసీఎస్ తదితరాలు కార్మికులకు అందేలా చూస్తామన్నారు. అవార్డులు పొందిన వారిని ఆదర్శంగా తీసుకుని మిగతా ఉద్యోగులు పనిచేయాలని పిలుపునిచ్చారు. మహిళలకు ఇస్తున్న జీరో టికెట్‌కు సంబంధించిన రీయింబర్స్‌మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. మహాలక్ష్మి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని 24 కోట్ల మహిళలు ఇప్పటివరకు వినియోగించుకున్నారన్నారు. ఆర్టీసీలో త్వరలోనే నియామకాలు చేపట్టబోతున్నామనీ, కొత్త బస్సులు కూడా రాబోతున్నాయని ప్రకటించారు. సంస్థ బాగుకోసం ఉద్యోగుల నుంచి సలహాలు, సూచనలను స్వీకరిస్తామన్నారు. వీసీ సజ్జనార్ మాట్లాడుతూ..ఆర్టీసీ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని కొనియాడారు. మేడారం మహాజాతరలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది అద్బుతంగా పనిచేశారని ప్రశంసించారు.
మహాలక్ష్మి స్కీం అమలు తర్వాత సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగిందనీ, అయినా, సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని చెప్పారు. సిబ్బంది నిజాయతీతో ఉత్తమ సేవలందించడం వల్లే జాతీయస్థాయిలో సంస్థకు గుర్తింపు లభిస్తోందన్నారు. ఇటీవల ఏఎస్‌ఆర్‌టీయూ ప్రతి ఏటా ప్రకటించే ప్రతిష్టాత్మక ఐదు నేషనల్ పబ్లిక్ బస్ ట్రాన్స్‌పోర్ట్ ఎక్స్‌లెన్స్ అవార్డులను టీఎస్‌ఆర్టీసీ గెలుచుకుందని గుర్తు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో ఉద్యోగుల పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరించేలా కృషిచేస్తానని హామీనిచ్చారు. రెండు వేల కొత్త బస్సుల కొనుగోలుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో టీఎస్‌ఆర్టీసీ సీవోవో డాక్టర్ వి.రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, పురుషోత్తం, కృష్ణకాంత్, వెంకటేశ్వర్లు, ఫైనాన్స్ అడ్వయిజర్ విజయ పుష్ఫ, సీఎంఈ రఘునాథరావు, తదితరులు పాల్గొన్నారు.
అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రీజియన్లు ఇవే..
మహాలక్ష్మి పథకం అమలుకు ముందు : ఫస్ట్ బెస్ట్ రీజియన్ కరీంనగర్, సెకండ్ బెస్ట్ రీజియన్ మహబూబ్‌నగర్, థర్డ్ బెస్ట్ రీజియన్ నిజామాబాద్ నిలిచాయి.
మహాలక్ష్మి పథకం అమలు తర్వాత: ఫస్ట్ బెస్ట్ రీజియన్ హైదరాబాద్, సెకండ్ బెస్ట్ రీజియన్ సికింద్రాబాద్, థర్డ్ బెస్ట్ రీజియన్ వరంగల్ నిలిచాయి.