ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ  ఉద్యోగులకంటే ఎక్కువ వేతనాలు ఇవ్వాలి

– విలీన కమిటీ చైర్మెన్‌కు టీఎస్‌ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్‌ లేఖ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఆర్టీసీ కార్మికులకు ఎక్కువ జీతాలు ఉండేలా చూడాలని టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూఎఫ్‌) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆర్టీసీ విలీన కమిటీ చైర్మెన్‌, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు లేఖ రాసినట్టు ఫెడరేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు, వీఎస్‌ రావు తెలిపారు. ఇప్పటి వరకు ఆర్టీసి కార్మికులు పారిశ్రామిక కార్మికులుగా ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పని,ఆర్టీసి కార్మికుల పని పరిస్థితులకు పూర్తి తేడా వుంటుందని తెలిపారు.. ఆర్టీసీ కార్మికులకు స్థిరమైన పద్ధతిలో పని దినం వుండదనీ, ఒక రోజు తెల్లవారుఝామున వెళితే, మరో రోజు మరో సమయంలో డ్యూటీకి వెళ్ళవలసి వస్తుందనీ, ఇంటి భోజనం తినడం అనేది దాదాపు అసాధ్యమైన విషయమని వివరించారు. బయట హౌటళ్లలోనే భోజనం చేయాలనీ, ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా ధైర్యంగా పని చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఎదుటివారి తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాల్లో కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారనీ, తమ ప్రాణానికి ముప్పు ఏర్పడిందని తెలుస్తున్న సందర్భాల్లో ప్రయాణీకులను సురక్షితంగా వుండేలా చూసి, స్టీరింగ్‌ పైనే తమ ప్రాణాలను విడిచిన ఘటనలు ఉన్నాయ న్నారు. కార్మికుల క్రమ శిక్షణ, అంకిత భావానికి ఇవి నిదర్శనాలని వివరించారు. అలాంటి ఆర్టీసీ కార్మికుల వేతనాలు ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువగా వుండాలని సూచించారు. వారికి రావల్సిన 2017, 2021 సంవత్సరాల వేతన ఒప్పందాలను అమలు చేయాలని కోరారు. అలాగే అనేక కార్మికోద్యమాల ద్వారా సాధించుకున్న ఇతర అలవెన్సులు, సౌకర్యాలను కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.
ఇస్రో శాస్త్రవేత్తలకుసజ్జనార్‌ శుభాకాంక్షలు
చంద్రయాన్‌-3ని విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో సందేశం రాసారు.”భారతదేశ చరిత్రలో ఇది మరుపురాని రోజు. 140 కోట్ల మంది కలల్ని, ఆశయా ల్ని, నమ్మకాన్ని మోసుకెళ్లిన చంద్రయాన్‌-3 విజయ వంతంగా జాబిల్లిపై ల్యాండవడం మనకెంతో గర్వకా రణం. ఈ విజయం కోసం నిరంతరం శ్రమించిన ఇస్రో బృందానికి, శాస్త్రవేత్తలకు అభినందనలు. తరతరాలు గుర్తుంచుకునే అద్భుతమైన అంతరిక్ష చరిత్రను లిఖించారు.