– కేంద్రం వైఖరికి నిరసనగా…ఎమ్‌డీకి సమ్మె నోటీసు ఇచ్చిన ఆరు కార్మిక సంఘాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దేశంలోని ఆర్టీసీల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి మారాలని డిమాండ్ చేస్తూ ఈనెల 16న జరిగే దేశవ్యాప్త సమ్మెలో తామూ భాగస్వాములం అవుతున్నట్టు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)లోని ఆరు కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఈ మేరకు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్‌కు సమ్మె నోటీసు అందచేశాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భారత న్యాయ సంహితలోని సెక్షన్ 106 (హిట్ అండ్ రన్) రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్రం అమల్లోకి తెచ్చిన మోటార్ వాహన చట్టం-2019ని సవరించాలని కోరారు. టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్), ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఎస్‌డబ్ల్యూయూ), బహుజన వర్కర్స్ యూనియన్ (బీడబ్ల్యూయూ), బహుజన కార్మిక యూనియన్ (బీకేయూ), కార్మిక పరిషత్ (కేపీ) సంఘాలు ఎమ్‌డీకి సమ్మె నోటీసు ఇచ్చాయి. సంస్థలోని కార్మిక సంఘాలు కూడా సమ్మె నిర్ణయం తీసుకొని, కార్మిక ఐక్యతను చాటాలని విజ్ఞప్తి చేశాయి. కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు, రవాణా రంగ ఫెడరేషన్లు ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. దానిలో భాగంగానే రవాణా రంగాన్ని, ఆర్టీసీలను రక్షించుకోవాలని, డ్రైవర్లను జైళ్లకు పంపే భారత న్యాయ సంహిత సెక్షన్ 106 (1,2) రద్దుచేయాలనే డిమాండ్లతో సమ్మెలోకి వెళ్తున్నామన్నారు. ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు, కోశాధికారి గంగాధర్, ఈయూ ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న, బీడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి సుద్దాల సురేష్, బీకేయూ ప్రధాన కార్యదర్శి కత్తుల యాదయ్య, కేపీ ప్రధాన కార్యదర్శి బీ యాదగిరి సమ్మె నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా 22 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమ్మె నోటీసులకు జతచేశారు. మరికొన్ని సంఘాలు కూడా త్వరలో సమ్మె నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయని వారు తెలిపారు. విద్యుత్ బస్సులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలను ఆర్టీసీలకూ ఇవ్వాలని డిమాండ్ చేశారు.