– సీఐసీ నియామకంపై రాష్ట్రపతికి కేంద్ర ఎనర్జీ శాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ లేఖ
న్యూఢిల్లీ : చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (సీఐసీ)గా హీరాలాల్ సమరియా నియామకం వివాదం రేపింది. లోక్‌సభ ప్రతిపక్ష నేతకు తెలియకుండా సీఐసీని నియమించటం సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ప్రాథమిక ఉల్లంఘన అని ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ ఆరోపించారు. ఈ మేరకు ఆయన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఇది సెక్షన్ 12(3)ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సభ్యుడు, ప్రధాని నేతృత్వంలోని హైపవర్ సెలక్షన్ కమిటీలో భాగమైన అధిర్ రంజన్ చౌదరి తనను ”పూర్తిగా చీకటిలో ఉంచారు” అని ఆరోపిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాసిన తర్వాత.. ఈఏఎస్ శర్మ లేఖ పంపటం గమనార్హం. సోమవారం ప్రధాని మోడీ సమక్షంలో సమాచార కమిషనర్ సమరియా సీఐసీగా ముర్ము చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ”కేంద్ర సమాచార కమిషనర్, సమాచార కమిషనర్ల ఎంపిక విషయంలో అన్ని ప్రజాస్వామ్య నిబంధనలు, ఆచారాలు, విధానాలు గాలికి విడిచిపెట్టారు. నేను మీ దృష్టికి తీసుకువస్తున్నాను” అంటూ అదే రోజు అధిర్ రంజన్ చౌదరి ముర్ముకు లేఖ రాశారు.