మట్టిలో మాణిక్యాలు

రచయిత తాను కథలు రాయడమే కాకుండా పిల్లల చేత కథలు రాయించడం మామూలు విషయం కాదు. పిల్లవాడి మానసిక స్థాయికి ఎదిగి, వారికి అర్థమయ్యేటటువంటి భాషలో రాసి వారిని మెప్పించడం అతిశయోక్తి కాదు. కానీ అలాంటి ప్రయత్నం చేశాడు కవి, రచయిత కందుకూరి భాస్కర్‌. వృత్తిరీత్యా తెలుగు పండితులైన ఈయన సంపాదకత్వంలో పెద్దపల్లి జిల్లా నరసింహులపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులచే 22 కథలను రాయించారు. ఆ కథల సమాహారమే ‘పల్లె పరిమళాలు’ (నరసింహులపల్లి బడి పిల్లల కథలు). ఇందులోని ప్రత్యేకత ఏంటంటే ప్రతి కథకు చక్కటి నీతిని అందించడం. ఇవి సమకాలీన సంఘటనలకు అనుగుణంగా, విద్యార్థులు కథ రాయడం అభినందనీయం. నిరంతరం వారిని ప్రోత్సహిస్తున్న రచయితకి ప్రత్యేక ధన్యవాదాలు.
బాలబాలికల్లో నైతిక ప్రవర్తనను, మంచి చెడులను పెంచే బాధ్యత ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో నానమ్మ తాతయ్యలు కథలు చెప్పడం ద్వారా నెరవేరేది. కానీ నేడు ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైన తర్వాత వేర్పాటు కుటుంబాలలో పిల్లలకు కథలు చెప్పేవారు కరువయ్యారు. పిల్లలకు చక్కటి నీతితో కూడుకున్నటువంటి కథలను చెప్పే బాధ్యతను బాల సాహిత్యకారులు తమ భుజాలపై వేసుకున్నారు. బాల సాహిత్యమే ఇప్పుడు ముందుండి పిల్లల కోసమే చక్కటి కథలు, గేయాలు, పాటలను విరివిగా ప్రాచుర్యంలోకి తెస్తుంది. పిల్లలు కథలంటే చెవి కోసుకుంటారు. మరి ఆ పిల్లలే కథల్ని రాస్తే, చదవడానికి ఎలాంటి ఆటంకం ఉండదు. చిన్న చిన్న ఊహలకు మెరుగైన ఆలోచనలు తోడైతే అద్భుతమైన కథలు వస్తాయనడంలో అతిశయోక్తి లేదు.
మనుషులంతా ఒక్కటే, కులమత బేధాలు ఉండకూడదని, ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే అన్ని కులాలవారు అవసరమని, మన దేశం బాగుపడాలంటే అందరూ ఐక్యంగా ఉండాలి. కులం మత భావాన్ని పక్కనపెట్టి ఒకరికొకరు సాయం చేసుకోవాలనే మంచి సందేశాన్ని పదవ తరగతి సిద్ధార్థ ‘ఏ కులం గొప్ప’ అనే కథలో చక్కగా తెలియజెప్పాడు.
దేశానికి రైతు, సైనికుడు రెండు కండ్లలాంటివారు. దేశ ప్రజలను కాపాడడమే సైనికుని ప్రథమ కర్తవ్యం. దేశానికి తిండి పెట్టేవాడు రైతన్న. అలాంటి ఇద్దరు కొడుకులను చూసి తల్లిదండ్రులు గర్వపడేవారు. ‘అన్నదమ్ములు’ కథలో సాత్విక చక్కటి దేశభక్తితో కూడిన కథను రాసింది.
విద్యార్థులు చదువుకోవాల్సిన సమయంలో చదువుకోవాలని లేకుంటే పరీక్షలు ఫెయిల్‌ అయి, భవిష్యత్‌ ఉండదని, ఏ సమయంలో చేయవలసిన పనులు ఆ సమయంలో వాయిదాలు వేయకుండా చేయాలని ‘సమయం విలువ’ అనే కథలో శశాంక్‌ వివరించాడు.
పేద పిల్లలు ప్రైవేట్‌ బడుల్లో ఫీజులు కట్టడం కంటే, ఉన్న ఊరిలో సర్కారు బడిలో ఉచితంగా పుస్తకాలు, బట్టలు, రాగి జావ, మధ్యాహ్నం భోజనం, వారానికి మూడు కోడిగుడ్లు ఇస్తారని సర్కారు బడులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో, ‘ప్రైవేటు బడులు వద్దు – సర్కార్‌ బడులే ముద్దు’ అంటూ గంగారపు శృతి సర్కారు బడి కథను చక్కగా నడిపించింది.
రాజ్యాన్ని పరిపాలించే రాజు ప్రజలకు ఏ ఆపద, కష్టం వచ్చినా దాన్ని తీర్చడంలో ముందుండాలి. అది కనీస ధర్మం అంటూ చక్కటి నీతితో ‘రాజ ధర్మం’ కథలో శివ నాగేశ్వరి వివరించింది. చెప్పుడు మాటలు వింటే కలిసున్న వారు విడిపోతారు. అలాంటి మాటలు వినకూడదని నేటి కాలపు విద్యార్థులకు తెలిసే విధంగా ‘చెప్పుడు మాటలు’ కథలో అభిలాష్‌ వివరించాడు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ‘పల్లె పరిమళాలు’లో విద్యార్థులు రాసిన 22 కథలు మంచి సందేశాన్ని ఇచ్చినవే. ప్రతి కథలో చక్కటి నీతి ఉంది. ఈ కథల పుస్తకం ప్రతి పాఠశాలలో, గ్రంథాలయంలో విద్యార్థుల చేతుల్లో ఉండాల్సిందే. పుస్తకం ముఖ చిత్రం చిన్నారులతో అందంగా, ఆకర్షణీయంగా ఉంది మొత్తం పేజీల సంఖ్య 56. పుస్తకం వెల 55 రూపాయలు
– యాడవరం చంద్రకాంత్‌ గౌడ్‌, 9441762105