పాలకులు, అధికారులు ప్రజలకు సేవకులుగా ఉండాలి

– జవాబుదారీతనం అవసరం : ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి మోహన్‌కందా
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
‘పాలనలో జవాబుదారీతనం అనేది మాజీ ప్రధాని పీవీ పాలనలో బాగా కనిపించింది. పాలకులు, అధికారులు ప్రజల సేవకులుగా ఉండాలి. ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. పై స్థాయిలో ఉన్న అధికారులు అధికార దర్పం కంటే సామాన్య ప్రజలకు ఎంత మేరకు సేవ చేయగలుగుతున్నామో ఆలోచించుకోవాలి’ అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి మోహన్‌ కందా అన్నారు. హైదరాబాద్‌లోని అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో మంగళవారం ‘పాలన-విలువలు’ అనే అంశంపై ఆయన స్మారకోపన్యాసం చేశారు. ఒక వైపు ప్రపంచంలోని ఇతర దేశాలతో అభివద్ధిలో పోటీ పడుతున్నామని మన నేతలు చెప్పుతున్నారని, మరో వైపు ఇప్పటికీ భిక్షాటన చేస్తున్న వారు దేశంలో అనేక మంది ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ అంశాలను అటు పాలకులు ఇటు అధికారులు గుర్తు ఉంచుకోవాలని అన్నారు. చిన్న పిల్లలను అమ్ముకోవడాలు, మానభంగాలు, ఆత్మహత్యలు, పేదరికం, వరకట్న వేధింపులు, మత వైషమ్యాలు, దోపిడీలు, దాడులు అనేవి దేశాభివృద్ధిని దెబ్బతీస్తాయని, వీటిని పరిష్కరించాలని పాల కులకు ఆయన సూచించారు. దేశ అంతర్గత భద్రత, వ్యక్తిగత భద్రత, ప్రజాస్వామ్య విలువలను కాపాడినప్పుడే పాలనలో పారదర్శకత, విలు వలతో కూడిన నాణ్యమైన పాలన ప్రజలకు అందించినట్టుగా అవుతుందని అన్నారు. వీటిపై దృష్టిసారించాలని సూచించారు . ఈ కార్యక్రమానికి విశ్వ విద్యాలయ ఉపకులపతి ఆచార్య. కె. సీతారామరావు అధ్యక్షత వహించి ప్రసంగించారు. తెలంగాణ వైతాళికుల జీవిత విశేషాలు, సమాజానికి వారు చేసిన సేవలను భవిష్యత్‌ తరాలకు అందించాలనే లక్ష్యంతోనే విశ్వవిద్యాల యంలో క్రమం తప్పకుండా స్మారకోపన్యాసాలు నిర్వహిస్తున్నామని వివరించారు. మాజీ ప్రధాని పీవీ హయాంలో తెచ్చిన ఆర్ధిక సంస్కరణలు దేశ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేశాయని, పాలనా సంస్కరణలు ఆయన హయంలోనే వచ్చాయని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఇంచార్జ్‌ అకాడమిక్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సుధారాణి, యూజీసీ-డీఈబీ అఫైర్స్‌ ఇంచార్జ్‌ డైరెక్టర్‌ డా.పల్లవి కాబ్డే, సికా డైరెక్టర్‌ పి.మధుసూదన్‌రెడ్డి, డీన్‌లు షకీలా ఖానం,.వడ్డానం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.