గొంతెండుతోంది…

Sampadakiyam రాష్ట్రం గొంతెండుతున్నది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. ఇటు తాగు, అటు సాగునీటికి కటకటే. నీటి కరువు జనాలకే కాదు భూములకునూ. రిజర్వాయర్లల్లో తగినంత నీరుందని సర్కారు చెబుతున్నా, ఏప్రిల్‌, మే నెలల్లో పరిస్థితులు తారుమారయ్యే ప్రమాదం లేకపోలేదు. నీటికోసమే రాష్ట్రం ఆవిర్భవించినా, గత పదేండ్లల్లో ఆ ఉద్యమ కృషి నీటి వనరుల అభివృద్ధిలో కనిపించలేదు. రూ. వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా కలగానే మిగలడం ఆందోళన కలిగించేదే. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాగు,తాగునీటి ప్రాజెక్టులు నిర్మించినా, ప్రస్తుత క్షేత్రస్థాయి పరిణామాలు ఫలితాలు రాలేదడాన్ని నిరూపిస్తున్నా యి. సాక్ష్యంగా నిలుస్తున్నాయి. 2014తో పోల్చుకుంటే, 2022-23 నాటికి భూగర్భజలాలు భారీగా పెరిగాయ నేది సర్కారు కామెంట్‌. దీన్ని ఎవరూ కాదనలేకపో యినా, ‘తెలంగాణ డైనమిక్‌ గ్రౌండ్‌ వాటర్‌ రిసోర్సెస్‌ కంప్యూటెడ్‌’ అనే సంస్థ నివేదిక చెప్పింది. కాగా కొన్ని నెలల్లోనే పరిస్థితులు దిగజారాయి. దీనికి సరైన నీటి విధా నాలు అనుసరించకపోవడం, అమలు చేయకపోవడమే కారణం.
గతేడాది సెప్టెంబరులో ఆశించిన మేరకు వానలు పడలేదు. దీంతో అది భూగర్భజలాలపై తీవ్ర ప్రభావమే చూపింది. తాగునీటి ఎద్దడికీ దారితీసింది. అలాగే వ్యవసాయ సాగును దెబ్బతీసింది. దానికితోడు కేసీఆర్‌ పెట్‌ ప్రాజెక్టు దాదాపు రూ. లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో చోటుచేసుకున్న పగుళ్లు, సీపేజీల మూలంగా నీటిని పూర్తిగా వదిలేయాల్సి వచ్చింది. దీంతో భూగర్భజలాలు మళ్లీ యధాస్థితికి చేరాయి. మిషన్‌ భగీరథ ప్రాజెక్టు 2045 నాటి ప్రజావసరాలకుగాను రూ.38 వేల కోట్లతో నిర్మించారు. ఎద్దును కొని పగ్గాన్ని మరిచినట్టు తెలంగాణలో నీటి పంపిణీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వైచిత్రి. లీకేజీలు, నిర్వహణా సమస్యలతో 44 డిగ్రీల ఎండలో సామాన్యులను రోడ్డెక్కించే దుస్థితి.
తాగు, సాగునీటి రిజర్వాయర్లు నిండుకుంటున్న వేళ, సాధారణ ప్రజలకు హెచ్చరికనే. భూగర్భజలాలు 39.782 టీఎంసీల నుంచి 27.508 టీఎంసీలకు తగ్గాయి. రాష్ట్రంలోని 12 ప్రధాన సాగునీటి రిజర్వాయర్లల్లో నీటి నిల్వలు 438 టీఎంసీల నుంచి 283.41 టీఎంసీలకు అంటే 45 శాతం పడిపోయాయి. దీంతో యాసంగి సాగుపై ప్రభావం పడింది. 54 లక్షల ఎకరాలకుగాను 43 లక్షలు మాత్రమే సాగైంది. సుమారు 11 లక్షల ఎకరాల్లో రైతులు సాగుచేయలేకపోయారు. ఇదీ వ్యవసాయ శాఖ లెక్క. అలాగే రాష్ట్రంలో కేవలం ఆరు జిల్లాలు మినహా మిగతా అన్నీ చోట్లా వర్షాభావ పరిస్థితులే నెలకొన్నాయి. నాగర్‌కర్నూల్‌, జోగులాంబ-గద్వాల జిల్లాల్లో మరీ తక్కువ. దీంతో తెలంగాణలో పరిస్థితులు ఎంత కఠినంగా మారనున్నాయో కండ్లకు కడుతున్నది.
సాంకేతిక, ఆర్థిక, పర్యావరణ కోణాల్లో ప్రాజెక్టులు నిర్మించాలనేది సాగునీటిరంగ నిపుణుల మాట. తొందరపాటు నిర్ణయాలతో ఆర్థిక, పర్యావరణ నష్టాలు జరుగుతున్నాయనేది వారి ఆవేదన. రాజకీయ, పర్యావరణ, ఆర్థిక, సామాజిక, సాంకేతికాంశాలను మిళితం చేసే నీటి (నదులు, వాగులు, చెరువులు, ప్రాజెక్టులు) నిర్వహణ వ్యవస్థ నిర్మాణంలో వినూత్న ఆలోచనలను ప్రేరేపించే సుపరిపాలన పద్దతులు అవలంభించాలనేది సూచన. ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం పాతదే. భూవినియోగం, విస్తీర్ణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోవడం గమనార్హం. నీటికొరత పెరుగుతున్న దనడానికి ప్రస్తుత దుస్థితి, అధ్యయనాలే సాక్ష్యం. పర్యావరణ మార్పులను తట్టుకునే నీటివనరులను పెంపొందించాలి.ప్రస్తుత నీటి విధానాలను సమీక్షించు కుని ముందుకు పోవాల్సిన అవసరాన్ని గుర్తించాలి. తాజా పరిస్థితులూ ఆ వాస్తవాలను నొక్కి చెబుతున్న విషయాన్ని అంగీకరించాలి. ఆ మేరకు కార్యాచరణ ఉండాలి.
నీటిపారుదల ప్రాజెక్టుల్లో రైతుల భాగస్వామ్యం అత్యంత కీలకం. ప్రణాళిక దశనుంచే అనుకున్న లక్ష్యాల సాధనకు అడుగులు పడాలి. అందుబాటులోకి వచ్చే నీరు, విద్యుత్‌ వినియోగం సమర్థవంతంగా ఉండటానికి తగిన పంటల విధానం రూపకల్పనకు రైతులతో విస్త్రృత సంప్రదింపులు తప్పనిసరి. వాతావరణంలో మార్పులతో పుడమి వేడి పెరుగుతున్న మాట ఎవరూ కాదనలేనిది. అప్పుడు సర్కారీ పెట్టుబడులు అర్థవంతంగా, ప్రయోజన కారిగా ఉండాలనేది ఆర్థికవేత్తల అభిప్రాయం. రోజురోజుకూ అధికమవుతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికల రచన జరగాలి. అమలూ పకడ్భందిగానే ఉండాలి. రాజకీయ అవినీతి, అశ్రీతపక్ష పాతానికి ఆనవాలుగా నిలిచింది నేడు కాళేశ్వరం ప్రాజెక్టు. గత ప్రభుత్వం రీడిజైనింగ్‌, పునరుద్దరణ, సంస్కరణలు, అద్భుతాలు అంటూ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టుల్లో అధ్యయనం, లోతైన పరిశీలన, పారదర్శకత, జవాబుదారీతనం లేకపోవడమే కాళేశ్వరం విఫలమవడానికి ప్రధాన కారణంగా నిపుణుల విమర్శ. గతకాలపు అనుభవాలను గుణపాఠాలు స్వీకరించి ముందడుగు వేయడం ప్రస్తుత రేవంత్‌ సర్కారు కర్తవ్యంగా భావించాలి.