40 శాతం ఫిట్‌మెంట్‌తో రెండో పీఆర్సీ అమలు చేయండి

– తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ డిమాండ్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు 2023 జూలై 1 నుంచి రావల్సిన రెండో పీఆర్సీని 40 శాతం ఫిట్‌మెంట్‌తో ఇవ్వాలని తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు యూనియన్‌ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పీఆర్సీ కమిటీ చైర్మెన్‌ ఎన్‌ శివశంకర్‌కు సమగ్ర నివేదికను అందించినట్టు తెలిపారు. కనీస వేతనం రూ. 30,400, గరిష్ట వేతనం రూ.2,58,980గా నిర్ణయించాలని విజ్ఞప్తి చేశామని యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ ఫసియుద్దీన్‌, ప్రధాన కార్యదర్శి కే యాదనాయక్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు కే బలరాం, జె కొండలరావు, బైరపాక శ్రీనివాస్‌, సీహెచ్‌ అనిల్‌కుమార్‌, పీ శ్రీనివాస్‌ తెలిపారు. మెరుగైన వేతన సవరణతో పాటు రిస్క్‌ అలవెన్స్‌, ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీంను ప్రతి ఐదేండ్లకు ఒకసారి ఇవ్వాలని కోరారు. సీపీఎస్‌ రద్దుచేసి ఓపీఎస్‌ అమలు చేయాలని, హెచ్‌ఆర్‌ఏ ను గ్రేటర్‌ పరిధిలో 30 శాతం, జిల్లా కేంద్రాల్లో 25 శాతం, ఇతర ప్రాంతాల్లో 20శాతం ఇవ్వాలనీ, గ్రాట్యుటి రూ. 16 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచాలని కోరారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలనీ, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.