వైద్యురాలు ఆధ్వర్యంలో.. వాగు దాటి వైద్య శిబిరం నిర్వాహణ 

Under the direction of a doctor.. Running a medical camp across the streamనవతెలంగాణ – ఆళ్ళపల్లి 
ఆళ్ళపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు ఎస్.వి.సంఘమిత్ర ఆధ్వర్యంలో మండల పరిధిలోని  కర్ణగూడెం గ్రామంలో బుధవారం వైద్య సిబ్బంది ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. దీనికి గాను వైద్యురాలితో పాటు వైద్య సిబ్బంది జల్లేరు వాగు దాటి వెళ్లి మరీ ప్రజలకు వైద్య సేవలు అందించారు. అందులో భాగంగా పలువురు రోగులకు వైద్య పరీక్షలు చేసి, తగిన మందులు ఇచ్చారు. అదేవిధంగా గ్రామంలోని పాఠశాలలో సైతం విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. జ్వరం ఉన్న వారికి రక్త పరీక్షలు చేపట్టారు. మలేరియా నిర్ధారణకు ఆర్డీటీ పరీక్షలు సైతం చేశారు. అలాగే గ్రామస్తులందరికీ సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. హెల్త్ ఎడ్యుకేటర్ రమాదేవి ప్రజలకు ఆరోగ్య విద్యా బోధన చేశారు. రక్త పరీక్షల్లో అందరికీ నెగిటివ్ వచ్చాయని వైద్యురాలు తెలిపారు. అలాగే  ఆర్.ఎఫ్.ఎస్ లో భాగంగా ఇంటింటి సందర్శన నిర్వహించామన్నారు. ఈ వైద్య శిబిరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ అసిస్టెంట్ ఎం.నరేష్, ఏఎన్ఎం పి.సావిత్రి, ఆశా వర్కర్లు, బ్రీడింగ్ చెక్కర్ వూకె విశ్వనాథం పాల్గొన్నారు.