కొత్త ఏడాదిలో రూపాయి దారెటు?

What is the rupee in the new year?28 ఫిబ్రవరి 2014న కర్నాటకలోని హుబ్లీలో జరిగిన ర్యాలీలో నరేంద్ర మోడీ ‘మన దేశ రూపాయి పతనమైంది.రూపాయి విలువ నిరంతరం పతనమవు తోంది. అటల్‌ జీ ప్రభుత్వ హయాంలో రూపాయి విలువ డాలర్‌కు 40-45 ఉంది కానీ ఈ ప్రభుత్వంలో రూపాయి 62, 65, 70 రూపాయలకు పడిపోతూనే ఉన్నది. దిగుమతులు పెరుగు తూనే ఉన్నాయి, ఎగుమతులు తగ్గుతూనే ఉన్నాయి. ఎగుమతులను పెంచడం, దిగుమతులను తగ్గించడం ఒక తెలివైన ప్రభుత్వ పని.సంక్షోభాలు వస్తాయి,కానీ సంక్షోభ సమయంలో నాయకత్వం దిక్కులేని, నిస్సహాయంగా ఉంటే, సంక్షోభం చాలా తీవ్రంగా మారుతుంది అది మన దేశానికి సంబంధించినది. ఢిల్లీ పాలకులు దేశ రక్షణ గురించి గానీ,రూపాయి విలువ పతనం గురించి గానీ ఆందోళన చెందకపోవడం దురదష్టకరం. రూపాయి డాలర్‌ను బలంగా ఎదుర్కోగలిగేలా గత మూడు నెలలుగా రూపాయి పతనమవుతున్నా ప్రభుత్వం ఏమీ చేయడం లేదు. ఒక్కసారి రూపాయి పతనం అవుతూనే ఉంటే, ప్రపంచ శక్తులు దాని పూర్తి ప్రయోజనాన్ని పొందుతాయి. దీన్ని ఆపడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది’ అంటూ నాటి ప్రభుత్వాన్ని నిందించారు.తీరా నరేంద్రమోడీ ప్రధానిగా ఏలుబడిలోకి వచ్చి పదేండ్లు దాటిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ పతనమౌతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.ప్రస్తుత క్యాలెండర్‌ సంవత్సరంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఒక శాతం క్షీణించింది. ఇదే ఒక రికార్డు కాగా, నాలుగురోజులుగా ఈ పతనం మరింత దిగ్భ్రాంతికర స్థాయికి చేరింది. రూపాయి విలువ 85.08కి పడిపోయింది. ఇది ఆ ముందు రోజుతో పోలిస్తే 14 పైసల తగ్గుదల. అంటే ఒక్క డాలర్‌కు బదులుగా 85 రూపాయల ఎనిమిది పైసలు చెల్లించాల్సి వస్తుందన్నమాట! రూపాయి విలువ ఈ స్థాయిలో పతనం కావడం గతంలో ఎన్నడూ లేదు. అందుకే ఈ పరిణామం ఆర్థిక నిపుణుల్లో కలకలం రేపింది. రిజర్వుబ్యాంకు ఆఫ్‌ ఇండియా హడావిడిగా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. దీర్ఘకాలంలో ఈ చర్యలు ఏమాత్రం సుస్థిర ఫలితాలను సాధిస్తాయో వేచి చూడాల్సిందే! రూపాయి పతనం కొంత కాలంగా కొనసాగుతూనే ఉండటమే ఈ సందేహాలకు కారణం. సెప్టెంబర్‌ నెల నుండి ఈ పతనం స్పష్టంగానే కనిపిస్తోంది. సెప్టెంబర్‌ 12న డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.83.98కి పడిపోయింది. అప్పట్లో అదో రికార్డు. ఆ స్థాయికి రూపాయి విలువ పడిపోవడం అదే మొదటిసారి కావడంతో కలకలం రేగింది. మార్కెట్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక నిపుణులు రకరకాల విశ్లేషణలు చేశారు. అయితే, ప్రజలను చీల్చి ఎన్నికల పబ్బాలను గడుపుకునే పనిలో ఉన్న మోడీ ప్రభుత్వానికి అప్పట్లో ఈ విషయమే పట్టలేదు. ఫలితంగా పతనంలో రూపాయి కొత్త రికార్డులు సష్టించడం ప్రారంభమైంది. గత పదేండ్లలో డాలర్‌తో రూపాయి మారకపు విలువ 25 శాతం పతనమైంది. అప్పట్లో 3వేల రూపాయలు ఉండే ఇంటి అద్దె ఇప్పుడు 15వేలు అయింది. ఆ లెక్కన అప్పట్లో నెలకు 10వేలు సంపాదించేవారు. ఇప్పుడు నెలకు దాదాపు 50వేలు దాకా సంపాదించాలి.ఆ స్థాయిలో సామాన్యుల వేతనాలు పెరుగుతున్నాయా? లేదు కదా! కాబట్టి రూపాయి పతనం వల్ల నష్టపోతున్నది పేదలు,మధ్య తరగతి, సామాన్యులే.పదేండ్ల కిందట ఒక డాలర్‌ కోసం మనం 63 రూపాయలు చెల్లించాల్సి వచ్చేది. మరి ఇప్పుడు 85రూపాయలు చెల్లించాల్సి వస్తోంది.అమెరికాతో పోల్చితే ఇం డియా చాలా వేగంగా వద్ధి చెందుతున్న దేశమని చెబుతున్న మోడీ సర్కార్‌, అలాంటప్పుడు రూపాయి బలపడాలి కదా? ఎందుకు పతనమవుతోంది అనే ప్రశ్నకు సమాధానం లేదు? దీనికి ప్రధాన కారణం డాలర్‌ అంతర్జాతీయ స్టాండర్డ్‌ కరెన్సీగా ఉండటమే.ప్రతీ దేశమూ విదేశాలతో వ్యాపారం చేసేందుకు డాలర్ల రూపంలో చేస్తున్నాయి. దాంతో డాలర్‌ విలువ పెరుగుతూనే ఉంది.ఆ స్థాయిలో రూపాయి విలువ పెరగట్లేదు. మనం విదేశాలతో రూపీలో వాణిజ్యం చేస్తే, రూపాయి బలపడగలదు. కానీ అమెరికా అందుకు ఒప్పుకోకపోగా ఆంక్షలు విధిస్తోంది. మోడీ నాడు బైడెన్‌, నేడు ట్రంప్‌తో బాగా స్నేహపూరితంగానే వ్యవహరిస్తున్నారు కదా! మరి అలాంటప్పుడు రూపాయి బలోపేతానికి తీసుకున్న చర్యలేంటి?
రూపాయి బలహీనపడుతోంది అనే పదం సాధారణ ప్రజలకు సూటిగా అర్థం కాదు. అందుకని, దాని ప్రభావం మనపై ఎలా పడుతుందో మనకు ప్రత్యక్షంగా తెలియదు.కానీ పరోక్షంగా ఆ ఎఫెక్ట్‌ కనిపిస్తూ ఉంటుంది.ఇదివరకు కూరగాయలు కొంటే వంద రూపాయలకి సంచి నిండేది, ఇప్పుడు 500 పెట్టినా నిండట్లేదు కదా? దీనికి కారణం రూపాయి పతనం అవుతుండటమే. ఒక్క కూరగాయలే కాదు ఉప్పులు, పప్పులు,నూనెలు, ఇంట్లో వాడే ప్రతీ నిత్యవసరాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రూపాయి విలువ పడిపోతుంటే ధరలు మరింత పెరగడం ఖాయం. దీనివల్ల వల్ల పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు కూడా బాగా పెరుగుతాయి. ఎందుకంటే.. మనం విదేశాల నుంచి చము రును ఎక్కువగా కొంటున్నాం. దాంతో భారీగా చెల్లింపులు జరుపుతున్నాం. దాంతో చమురును ఎక్కువ ధరకు కొన్నట్లు అవుతోంది.దాని నుంచి తీసే పెట్రోల్‌, డీజిల్‌,గ్యాస్‌ సహా పెట్రో ఉత్పత్తుల ధరలన్నీ పెరుగుతూనే ఉన్నాయి. ఇకపోతే ద్రవ్యోల్బణం. ఇదే మన కొంపలు ముంచుతోంది.ధరలు పెరగడమే ద్రవ్యోల్బణం.మన నెలవారీ బడ్జెట్‌ ప్రతీ నెలా పెరుగుతూనే ఉంది.కారణం ద్రవ్యోల్బణం. కోడిగుడ్డు ఒకప్పుడు 25 పైసలు తర్వాత రూపాయి అయ్యింది.గతేడాది ఐదు, ఈ ఏడాది 8 రూపాయలైంది. కారణం ద్రవ్యో ల్బణమే. కోళ్ల దాణా,కరెంటు ఖర్చు,కూలీ వేతనాలు, నిర్వ హణ ఖర్చులు,రవాణా ఖర్చులు ఇలా అన్నీ పెరుగుతూ గుడ్డు ధర కూడా పెరిగింది.మరి అన్నీ ఎందుకు పెరిగాయి? అదే ద్రవ్యోల్బణం.ఇలా ఒకదానిపై ఒకటి ఆధారపడుతూ ధరలు పెరుగుతూనే ఉన్నాయి.ఇంకా ఎన్నాళ్లు ఈ డాలర్‌ ఆధిపత్యం? ఆసియాలో రూపీ రూపంలో వాణిజ్యం జరపాలనే డిమాండ్లు ఉన్నాయి. ఈ దిశగా అడుగులు పడితే మన కష్టాలు తీరగలవు. రూపాయి విలువ బాగా పెరిగి మన ద్రవ్యోల్బణం తగ్గుతుంది.అప్పుడు అన్నీ తక్కువ ధరకే లభించే అవకాశముంది.బ్రిక్స్‌ దేశాలు ఉమ్మడి కరెన్సీని ప్రవేశపెట్టి డాలర్‌కి చెక్‌ పెట్టాల్సిన టైమ్‌ వచ్చినట్లే. కాబట్టి ఇప్పటికైనా అడుగులు పడకపోతే, నూట నలభై కోట్ల మంది భారతీయులు మరింతగా నష్టపోతారు.
అయితే ఈ నష్ట నివారణ చర్యలు జరగాలంటే రిజర్వ్‌ బ్యాంక్‌ తన చేతిలో ఉన్న ద్రవ్య పరపతి విధాన సమీక్ష ద్వారా దీన్ని కట్టడి చేయవచ్చు.ఇది సులువైన అంశం కాదు.ఆర్‌బీఐ తన వద్ద ఉన్న విదేశీ మారక ద్రవ్యాన్ని మార్కెట్‌లోకి విడుదల చేస్తే మన దగ్గర ఉన్న నిల్వలు పడిపోతాయి గనుక ఇది కూడా మంచి పరిణామం కాదు.మన ఎగుమతులను, ఉత్పాదకత, సామర్థ్యాలను పెంచుకోవాలి. ప్రభుత్వాలు ఉద్యోగ కల్పన, మౌలిక వసతుల కల్పనపై దష్టి పెట్టాలి.దీంతో ఉత్పత్తి పెరిగి ఎగుమతులు చేయడం ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఆర్జించి రూపాయిని స్థిరీకరించవచ్చు.మౌలిక వసతుల కల్పన, శాంతి భద్రతలను మెరుగుపర్చడం చేస్తే విదేశీ పర్యాటకుల సంఖ్యను పెంచవచ్చు.దేశీయంగా ఎలక్ట్రానిక్స్‌ సంస్థలు నెలకొల్పడం, ఉన్నవాటి సామర్థ్యాన్ని, ఉత్పత్తిని పెంచి దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించాలి.దిగుమతుల్లో ప్రముఖపాత్ర వహిస్తున్న ఇంధన అవసరాల కోసం దేశీయ సంస్థల్ని పురి కొల్పి, ఎక్కువ ఉత్పత్తిని సాధించేలా చేయాలి.ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ఉత్పాదకతను పెంచుకోవడం ద్వారా స్వయం సమద్ధి సాధించే అవకాశం ఉంది.దేశీయ ఉత్పత్తులపై సుంకాలను తగ్గించడం ద్వారా ఎగుమతులకు అవకాశం కల్పించాలి.
నాదెండ్ల శ్రీనివాస్‌
9676407140