అక్రమ దాడులను ఆపాలి: గ్రామీణ వైద్యుల ధర్నా

నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నల్లగొండ జిల్లాలో గ్రామీణ వైద్యుల క్లినిక్లపై జరుగుతున్న అక్రమ దాడులు తక్షణమే ఆపి వేయాలని  సుశృత  గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు, జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరాజు  డిమాండ్ చేశారు. అక్రమ దాడులను, గ్రామీణ వైద్యులపై వేధింపులను ఆపాలని కోరుతూ సుశృత  గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి వారు మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో జి.ఓ.నెం. 1273, 428, 429  ప్రకారం కమ్యూనిటి పారామెడిక్స్ కోర్స్ ట్రైనింగ్, జిల్లా ప్రభుత్వ వైద్యశాల, నల్లగొండలో ట్రైనింగ్ పూర్తి చేసినట్లు తెలిపారు.ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైయస్. రాజశేఖర్ రెడ్డి  2009 లో పారామెడిక్ కోర్సును  జి.ఓ. 428 ప్రకారం ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ట్రైనింగ్ క్లాసులను  నల్లగొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ప్రారంభించినారని, గుర్తు చేశారు.  70 శాతం  గ్రామీణ వైద్యులు 1000 గంటల కోర్సు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఐఎమ్ఏ డాక్టర్స్ సర్వీసెస్ ఇవ్వలేనటువంటి మారుమూల ప్రాంతాలైన తండాలు, గూడాలు, అర్బన్ ఏరియాస్, మురికివాడలలో డబ్బులు ఇచ్చినా, ఇవ్వకున్నా 24 గంటలు  అందుబాటులో ఉండి పేద ప్రజలకు గ్రామీణ వైద్యలు వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. అలాంటి గ్రామీణ వైద్యులపై ఐ ఎం ఎ  వారికి సంబందించిన ఎన్ఎంసీ , హెచ్ ఆర్ డి ఏ, టి ఎస్ ఎం సి, కౌన్సిల్ నుండి విజిలెన్స్ అధికారులము అని చెప్పి గ్రామీణ వైద్యుల దగ్గరికి వచ్చి మీరు ఏవిదంగా వైద్యం చేస్తున్నారు అని ప్రశ్నిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయించి, పోలీసుల ద్వారా ఇన్వెస్టిగేషన్ పేరుతో తమ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లను, మెడికల్ షాప్ లలోని మందులను తీసుకొని  భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన చెందారు. ఇలాంటి దాడులు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవని ఇప్పటికైనా తమపై దాడులను ఆపాలని, గ్రామీణ వైద్యులకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో ఆ సంఘం నాయకులు డియస్ ఎన్.చారి, జి.నరసింహ రెడ్డి, మునీర్, సిహెచ్ దశరథ, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.