– ఆదాయం మాత్రం అంతంతే
– ఆందోళన కలిగిస్తున్న ఆహార వ్యయం తగ్గుదల
– కుటుంబ వినియోగ వ్యయ సర్వే వెల్లడి
గత పదకొండు సంవత్సరాలలో పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాలలో వినియోగ వ్యయం బాగా పెరిగింది. అయితే ఆహారంపై వ్యయం మాత్రం తగ్గింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే ఆదాయం పెరగకపోయినా ఖర్చు మాత్రం పెరుగుతుండడంతో ప్రజలపై మోయలేని భారం పడుతోంది. గత దశాబ్ద కాలంగా దేశంలో ప్రజల ఆదాయాలలో పెద్దగా మార్పు రాలేదు. పైగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి కారణాలతో అనేక కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. అదే సమయంలో మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా వినియోగ వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఓ వైపు సరైన ఆదాయం లేకపోవడం, మరోవైపు ఖర్చులు పెరగడంతో సగటు మధ్యతరగతి ప్రజానీకం కోలుకోలేని దెబ్బ తింటోంది. కోవిడ్ కారణంగా తగిలిన దెబ్బ నుండి పేదలు, మధ్య తరగతి ప్రజలు ఇప్పటికీ కోలుకోలేదు. అదే సమయంలో కార్పొరేట్ సంస్థలు, బడా వ్యాపారులు మాత్రం లాభాలు మూటకట్టుకున్నారు.
న్యూఢిల్లీ : 2022-23 సంవత్సరానికి సంబంధించి గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ శనివారం తాజా కుటుంబ వినియోగ వ్యయ సర్వే (హెచ్‌సీఈఎస్)ను విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతంలో నివసించే వ్యక్తి 2022-23లో నెలకు సగటున రూ.3,773 ఖర్చు చేశాడు. 2011-12లో ఈ వ్యయం కేవలం రూ.1,430 మాత్రమే. అంటే 164 శాతం పెరిగిందన్న మాట. అదే పట్టణ ప్రాంతంలో నివసించే వ్యక్తి చేసిన వ్యయం ఆ కాలంలో రూ.2,630 నుండి రూ.6,459కి పెరిగినా 146 శాతం పెరుగుదల మాత్రమే కన్పిస్తోంది. కుటుంబ వినియోగ వ్యయ సర్వేలను ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. 2017 జూలై-2018 జూన్ మధ్య జరిపిన 75వ రౌండ్ సర్వే ఫలితాలను ప్రభుత్వం విడుదల చేయలేదు. వినియోగ స్థాయిలకు సంబంధించి గణనీయమైన అంతరాలు కన్పించాయని, అందుకే నివేదికను విడుదల చేయలేదని వివరణ ఇచ్చింది. అయితే బయటికి పొక్కిన సర్వే సమాచారం ప్రకారం వినియోగ వ్యయం పడిపోయింది. గ్రామీణ ప్రాంతాలలోని చివరి ఐదు శాతం జనాభా సగటు నెలసరి తలసరి వినియోగ వ్యయం (ఎంపీసీఈ) రూ.1,373 ఉండగా 2001లో పట్టణ జనాభాలో చివరి ఐదు శాతం ప్రజల ఎంపీసీఈ రూ.2,001గా నమోదైంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని జనాభాలో మొదటి ఐదు శాతం ప్రజల ఎంపీసీఈ రూ.10,501, రూ.20,824గా ఉంది. మరో మాటలో చెప్పాలంటే గ్రామీణ జనాభాలో మొదటి ఐదు శాతం ప్రజల ఎంపీసీఈ దాని చివరి ఐదు శాతం ప్రజల ఎంపీసీఈ కంటే 7.65 రెట్లు అధికంగా ఉంది. పట్టణ జనాభాలోని మొదటి ఐదు శాతం ప్రజల ఎంపీసీఈ దాని చివరి ఐదు శాతం ప్రజల ఎంపీసీఈ కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంది.
ఆహారేతర వస్తువులకే ప్రాధాన్యత
2022-23లో ప్రజలు తాము పెట్టిన ఖర్చులో ఆహారానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. గ్రామీణ ప్రాంతాలలో ఆహార వ్యయం 46 శాతం (రూ.1,750) ఉంటే పట్టణ ప్రాంతాలలో అది 39 శాతం (రూ.2,530) గానే ఉంది. 2011-12లో ఈ వ్యయం గ్రామాలలో 52.90 శాతం, పట్టణాలలో 42.62 శాతంగా నమోదైంది. దీనివల్ల ద్రవ్యోల్బణ ఆధారిత వినియోగ ధరల సూచీలో కొన్ని సమస్యలు తలెత్తాయి. గ్రామీణ ప్రాంతాలలోనూ, పట్టణ ప్రాంతాలలోనూ ఆహారేతర వ్యయం పెరగడం గమనార్హం. 2022-23లో ఆహారేతర అవసరాల కోసం గ్రామీణ ప్రజలు తమ ఆదాయంలో 54 శాతం, పట్టణ ప్రజలు 61 శాతం ఖర్చు చేశారు. 2011-12తో పోలిస్తే 2022-23లో రవాణా, వినియోగ సేవలు, నాణ్యమైన వస్తువుల కొనుగోలుపై వారు ఎక్కువ ఆసక్తి చూపారు. అదే సమయంలో ఆహారధాన్యాలు, పప్పుధాన్యాలు, కూరగాయలపై ఖర్చు ఓ మాదిరిగా పెట్టారు.
‘ఉచితాల’తో పెద్దగా తేడా లేదు
ప్రభుత్వం పంపిణీ చేసిన ఆహార ధాన్యాలు, ప్రభుత్వ పథకాల ద్వారా ఇచ్చిన ఉచిత వస్తువుల ఖర్చును కూడా పరిగణనలోకి తీసుకుంటే గ్రామీణ ప్రాంతాలలో సగటు నెలసరి వినియోగ వ్యయం రూ.3,860, పట్టణ ప్రాంతాలలో రూ.6,521గా నమోదైందని సర్వే నివేదిక తెలిపింది. ఉచిత వస్తువుల విలువను కలపని పక్షంలో వినియోగ వ్యయం గ్రామాలలో రూ.87, పట్టణ ప్రాంతాలలో రూ.62 మాత్రమే పెరిగింది. ఉచిత వస్తువుల విలువను కలిపిన పక్షంలో గ్రామీణ జనాభాలోని చివరి ఐదు శాతం ప్రజలు రూ.1,441 ఖర్చు చేశారు. కలపకపోతే పెట్టిన ఖర్చు రూ.1,373 కంటే ఇది కొంచెం మాత్రమే ఎక్కువ. పట్టణ ప్రాంతాలకు సంబంధించి ఉచిత వస్తువుల విలువను కలపకపోతే రూ.2,001, కలిపితే రూ.2,087 ఖర్చవుతుంది.
ఇది వాస్తవాల పత్రమే
వస్తువులు, సేవలపై కుటుంబాల వినియోగానికి సంబంధించి హెచ్‌సీఈసీ సమాచారం సేకరించింది. పది సంవత్సరాల సుదీర్ఘ విరామం అనంతరం ఈ సర్వే విడుదలైంది. 2017-18 సర్వే ఫలితాలు బయటకు పొక్కడంతో దానిని ప్రభుత్వం రద్దు చేసింది. కోవిడ్ కారణంగా 2020-21లో సర్వే జరగలేదు. 2022 ఆగస్టులో ప్రారంభమైన సర్వే గత జూలై వరకూ కొనసాగింది. 2022-23కు సంబంధించి ఇప్పుడు విడుదల చేసింది కేవలం వాస్తవాల పత్రం మాత్రమేనని, సవివరమైన నివేదికను త్వరలో విడుదల చేస్తానని మంత్రిత్వ శాఖ తెలిపింది.