దమ్ము చక్రాలతో పాడవుతున్న పల్లె రోడ్లు

Khammam,Navatelangana,Telugu News,Telangana.– పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
వ్యవసాయ సీజన్‌ ప్రారంభమైంది. రైతులు దమ్ము దుక్కులను చేసేందుకు ట్రాక్టర్లకు దమ్ము చక్రాలు అమర్చి పల్లె రహదారులను పాడు చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ సైతం కొరబడడంతో పల్లె రహదారులు దమ్ము చక్రాల ట్రాక్టర్లు, కట్టేసిన గేదెలు, పశువులతో పాడవుతున్నాయి. ఒకప్పుడు వ్యవసాయ పనులు చేయాలంటే రైతులు దుక్కిటెద్దులకు నాగళ్ళు కట్టి, పొడి దుక్కులు, దమ్ము దుక్కులు దున్నేవారు. ఇప్పుడు వ్యవసాయంలో సాంకేతిక మార్పులు రావడంతో వ్యవసాయం మొత్తం యాంత్రికరణతోనే సాగుతోంది. పత్తి దుక్కులు మొదలు, వరి నాట్లు వేసే యంత్రాలు, వరి కోత యంత్రాలు, కుప్పనూర్పుడి వంటి యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. రైతులు వరి నాట్ల కోసం దమ్ము చేసేందుకు ట్రాక్టర్లకు దమ్ము చక్రాలు, ఆఫ్‌ వీల్స్‌ చక్రాలతో పాటు పట్లర్లను ఉపయోగిస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా రహదారులపై దమ్ము చక్రాలు
ట్రాక్టర్‌ యజమానులు నిబంధనలకు విరుద్ధంగా దమ్ము చక్రాలతో రహదారులపై తిరిగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ అధికారులు హెచ్చరికలు చేయడంతో పాటు పలుచోట్ల హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ ట్రాక్టర్‌ యజమానులు అవేమీ తమకి పట్టనట్లుగా పల్లె రహదారులపై యధేచ్చగా దుమ్ము చక్రాలతో తిరుగుతున్నారు. దీంతో లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పల్లె రహదారులతో పాటు బీటీ రహదారులు పాడై పోతున్నాయి. ఫుల్‌ వీల్స్‌ దమ్ము చక్రాలకు కనీసం పట్టాలు కూడా వేయకుండా తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు మండల ప్రజల నుండి వినిపిస్తున్నాయి.
రహదారులపైనే గేదెలు, పశువులు
మండల వ్యాప్తంగా ఆయా గ్రామాలలో రైతులు తమ పశువులను, పాడి గేదెలను రహదారులపైనే కడుతున్నారు. దీనివలన రహదారులకు ఇబ్బందులతో పాటు పారిశుధ్యం పూర్తిగా లోపిస్తుంది. పర్యవేక్షించాల్సిన పంచాయతీ కార్యదర్శులు సైతం ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో గ్రామాలలో పారిశుద్ధ్యం లోపించి, సీజనల్‌ వ్యాధులు ప్రభలే అవకాశం ఉంది. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు అడ్డు అదుపు లేకుండా తిరుగుతున్న దమ్ము చక్రాల నియంత్రణ, రహదారుల పై లోపిస్తున్న పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టిసారించాలని మండల వాసులు కోరుతున్నారు.