రూరల్‌లో పోటెత్తిన ఓటర్లు

రూరల్‌లో పోటెత్తిన ఓటర్లు– అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు
– రాజకీయ పార్టీల మధ్య ఘర్షణ
– చెదరగొట్టిన పోలీసులు
– సమస్యలపై పోలింగ్‌ను బహిష్కరించిన పలు గ్రామాలు
– సర్దిచెప్పిన అధికారులు
– నిబంధనలు ఉల్లంఘించిన నేతలు
– విచారించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు
– మొదటిసారి ఓటేసిన చెంచులు
నవతెలంగాణ – విలేకరులు
హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల సమరం చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించగా.. వాటిని మార్చారు. ఉదయం పోలింగ్‌ కాస్త మొందకొండిగా సాగినా సాయంత్రానికి కేంద్రాల వద్ద గంటల తరబడి బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాలుగు గంటల వరకు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్‌ ముగిసింది. ఐదు గంటల వరకు అందిన సమాచారం మేరకు 63.94 శాతం పోలింగ్‌ నమోదైంది. ఆ సమయానికి కేంద్రాల్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఉంది. పోలింగ్‌ శాతం పూర్తి వివరాలు రావడానికి సమయం పడుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు. రూరల్‌ ప్రాంతాల్లో ఓటేసేందుకు ఉదయం నుంచే బారులుతీరారు. నగరంలో మాత్రం ఆలస్యంగా స్పందించారు. పోలింగ్‌ సందర్భంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీఎస్పీ నాయకుల మధ్య ఘర్షణలు జరిగాయి. పోలీసులు సర్దిచెప్పి.. చెదరగొట్టారు. ఇబ్రహీంపట్నంలో లాఠీచార్జి చేశారు. ఏజెన్సీ, మారుమూల గ్రామాల్లో కొన్నిచోట్ల పోలింగ్‌ను బహిష్కరించారు. ఏండ్ల తరబడి సమస్యలను పట్టించుకోవడం లేదంటూ ఓటు వేయడానికి నిరాకరించారు. అధికారులు సర్దిచెప్పి పంపించారు. ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదివాసుల సమస్య పరిష్కారానికి బాధ్యత తనదేనంటూ తహసీల్దార్‌తో రాతపూర్వకంగా రాయించుకున్నారు. నల్లమలలో చెంచులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. హిజ్రాలూ తొలిసారి ఓటు వేశారు. మొదటి గంటలోనే ముఖ్య నేతలు, ఉన్నతాధికారులు, ప్రముఖులు ఓటేవారు. ఆదిలాబాద్‌లో ఇద్దరు, పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్‌లో 248 పోలింగ్‌ కేంద్రంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సుధాకర్‌(48) తెల్లవారుజామున మాక్‌ పోలింగ్‌కు ఏర్పాట్లు చేస్తూ అస్వస్థతకు గురై మరణించారు.
డబ్బులు ఇవ్వలేదని ….
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం నల్లమల పరిధిలోనీ మున్నూరులో కాంగ్రెస్‌,బీ ఆర్‌ఎస్‌లకు మధ్య ఘర్షణ జరిగింది. నల్లమల్లలోని మల్లాపూర్‌ అలహాబాద్‌ పరిధిలోని చెంచుపేటలో చెంచులు మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కొన్నిచోట్ల రాజకీయ పార్టీలు డబ్బులు ఇవ్వలేదని ఓటర్లు ఓటు వేయబోమని మొండికేశారు. ద్వితీయ శ్రేణి నాయకులు వాళ్లను బతిమలాడి ఎంతోకొంత ఇచ్చి పోలింగ్‌ కేంద్రాలకు వచ్చేటట్టు చేశారు. సాయంత్రానికి ఎక్కువ మంది ఓటర్లు కేంద్రాలకు చేరుకోవడంతో రాత్రి ఏడు గంటల వరకు పోలింగ్‌ సాగింది. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలోని పోలింగ్‌బూత్‌లో ఈవీఎం 30 నిమిషాలపాటు మొరాయించింది. బేతవోలు గ్రామంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. మోతె మండలంలోని సిరికొండలో పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించేందుకు బీఆర్‌ఎస్‌ కోదాడ మాజీ ఇన్‌చార్జి కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి రాగా కాంగ్రెస్‌ నాయకులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఘర్షణ జరిగింది. నకిరేకల్‌ నియోజకవర్గంలో 20 నుంచి 30 పోలింగ్‌ కేంద్రాల్లో రాత్రి 8 గంటల వరకు పోలింగ్‌ జరిగే అవకాశం ఉంది.
రోడ్డు కోసం నిలదీత…
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పోలింగ్‌ కేంద్రం లోపల ఉన్న ఓటర్లను చివరి వరకు అనుమతించడంతో రాత్రి 8గంటల వరకు కొనసాగింది. కొన్నిచోట్ల మరింత ఎక్కువ సమయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో పొలం పనులకు వెళ్లే వారు ఉదయమే పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. పట్టణ ప్రాంతాల్లో మాత్రం మధ్యాహ్నం నుంచి పోలింగ్‌ శాతం పెరుగుతూ వచ్చింది. ఖానాపూర్‌ మండలంలోని గుమ్మెన, ఎంగ్లాపూర్‌, నాయకపుగూడలో కరెంట్‌, రోడ్డు సౌకర్యం కల్పించాలని మధ్యాహ్నం వరకు నిరసన తెలి పారు. అధికారులు వారిని సముదాయించడంతో పోలింగ్‌లో పాల్గొన్నారు. కాగజ్‌నగర్‌ పట్టణంలోని 90వ పోలింగ్‌ కేంద్రం బీఆర్‌ఎస్‌, బీఎస్పీ మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. చెప్పులు, రాళ్లు విసురుకోవడంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.
రంగారెడ్డి జిల్లాలో..
రంగారెడ్డి జిల్లాలోని 8 నియోజకవర్గాలో సుమారు 57శాతం ఓటింగ్‌ నమోదైంది. గత ఎన్నికల్లో 62శాతం ఓటింగ్‌ నమోదు కాగా ఈసారి సుమారు 5శాతం ఓటింగ్‌ తగ్గింది. వికారాబాద్‌ జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో మొత్తం.69.79శాతం ఓటింగ్‌ జరిగింది. రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో 44.3శాతం మాత్రమే శాతం ఓటింగ్‌ జరిగింది. మైలార్‌దేవ్‌పల్లిలో మాజీ సీఎస్‌ సోమేష్‌కుమార్‌ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చేవెళ్ల మండలంలోని ఆలూరు ఊరెళ్ళ, రేగడిగానాపూర్‌ తదితర గ్రామాలలో రాత్రి 7:30 వరకు పోలింగ్‌ కొనసాగింది. ఇబ్రహీంపట్నంలోని ఆదిభట్ల మున్సిపల్‌ పరిధిలోని రాత్రి వరకు ఓటింగ్‌ కొనసాగింది.
మహేశ్వరం నియోజకవర్గంలో ఉదయం నుంచి 58శాతం ఓటింగ్‌ జరగక ఉదయం నుంచి ఓటర్లు ఓటింగ్‌ వేసేందుకు బారులు తీరారు. కొన్ని చోట్ల రాత్రి వరకు ఓటింగ్‌ సాగింది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఉదయం 9గంటల వరకు వేగంగా జరిగిన పోలింగ్‌ మధ్నాహ్యం, సాయంత్రానికి ఒక్కసారిగా పడిపోయింది. వికారాబాద్‌ జిల్లా పరిగిలో ఉదయం 9గంటల వరకు పోలింగ్‌ మందకోడిగా జరిగింది. అనంతరం వేగంగా పుంజుకుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అర్బన్‌ ప్రాంతంలో ఓటింగ్‌ తగ్గగా.. గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్‌ పెరిగింది.
మానకొండూర్‌లో ఈవీఎంల మొరాయింపు
కరీంనగర్‌ జిల్లాలో 69.22శాతం, జగిత్యాల జిల్లాలో 74.87, పెద్దపల్లి జిల్లాలో 69.83, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 71.87శాతం ఓట్లు పడ్డాయి. రాజన్నసిరిసిల్ల జిల్లాలో 144 పోలింగ్‌ కేంద్రంలో మాక్‌పోలింగ్‌ నిర్వహించే సమయంలో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. కరీంనగర్‌ జిల్లా మానకొంండూర్‌ నియోజకవర్గంలోని గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్‌ 247 బూత్‌లో ఈవీఎం మొరాయించడంతో గంట పోలింగ్‌ ఆలస్యమైంది. చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండల కేంద్రంలోని 86వ పోలింగ్‌ కేంద్రంలో వెయ్యికి పైగా ఓటర్లకు సరిపడా సిబ్బంది లేక ఒకటే ఈవీఎం మిషన్‌ పెట్టడంతో ఓటర్లు చాలా ఇబ్బందులకు గురయ్యారు.
సంగారెడ్డిలో జగ్గారెడ్డి, దుబ్బాకలో రఘునందన్‌రావు నిరసన
సంగారెడ్డిలో పలువురు కాంగ్రెస్‌ నాయకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్‌ అభ్యర్థి జగ్గారెడ్డి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళన చేశారు. దుబ్బాకలో రఘునందన్‌రావు కూడా స్టేషన్‌ ముందు ఆందోళన చేశారు. పలు చోట్ల పోలీస్‌లు చెదరగొట్టేందుకు లాఠీలకు పనిచెప్పారు. సిద్దిపేట జిల్లాలోని చింతమడకలో సీఎం కేసీఆర్‌ దంపతులు, మంత్రి హరీశ్‌రావు దంపతులు సిద్దిపేట పట్టణంలోని భారత్‌ నగర్‌లోని పోలింగ్‌ బూత్‌ నంబరు 114లో ఓటేశారు. సంగారెడ్డి జిల్లాలో సాయంత్రం 5 గంటల వరకు 73.83 శాతం పోలింగ్‌ నమోదైంది. మెదక్‌ జిల్లాలో 80.28 శాతం, సిద్దిపేట జిల్లాలో 73.03 శాతం పోలింగ్‌ నమోదైంది. తొలిసారి ఓటు హక్కు వచ్చిన యువత పెద్ద ఎత్తున ఓటు వేశారు. తూప్రాన్‌ పరిధిలోని కొల్చారంలో పోలీసులు బీఆర్‌ఎస్‌ నాయకుల్ని కొట్టడాన్ని నిరసిస్తూ వాళ్లు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళన చేశారు.
ఓటేసిన ట్రాన్స్‌జెండర్స్‌..
వేములవాడ నియోజకవర్గంలో ట్రాన్స్‌జెండర్లు మొదటి సారి ఓటు హక్కును వినియోగించు కున్నారు. వేములవాడ నియోజకవర్గం కథలాపూర్‌ మండలం బొమ్మెన గ్రామంలో ఏనుగు రాజవ్వ ఓటరు, ఆధార్‌ కార్డులో పేరు వేరుగా ఉందని ఓటు వెయ్యనివ్వకపోవడంతో ఏడ్చింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి బాలకిషన్‌ గులాబీ చొక్కాతో పోలింగ్‌ బూత్‌ వద్ద కారు గుర్తుకు ఓటు వేయాలని అడిగారని మహిళలు ఆరోపించారు. దీంతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఉద్రిక్తతకు దారి తీసింది. కామారెడ్డిలో రేవంత్‌రెడ్డి తమ్ముడు.. మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఓటర్లను ప్రభావితం చేస్తున్నాడని బీఆర్‌ఎస్‌ నాయకులు బైటాయించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కలగజేసుకొని సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది.