పసిఫిక్‌ మహా సముద్రంలో రష్యా, చైనా సంయుక్త గస్తీ

మాస్కో : పసిఫిక్‌ మహా సముద్రంలోని ఈశాన్య ప్రాంతంలో రష్యా, చైనా నావికా దళాలకు చెందిన నౌకలు సంయుక్తంగా గస్తీ నిర్వహిస్తున్నాయని రష్యా మిలటరీ మంగళవారం తెలిపింది. ఈ నౌకలు జలాంతర్గాముల విధ్వంసక ఎత్తుగడలు, వ్యూహాలను అభ్యసిస్తున్నాయని పేర్కొంది. సంయుక్త సైనిక విన్యాసాల తర్వాత సంయుక్తంగా గస్తీ చర్యలు చేపట్టారు. రష్యాతో కలిసి సంయుక్త సముద్ర గస్తీ చర్యల్లో పాల్గొంటామని సెప్టెంబరు తొలినాళ్లలో చైనా తెలిపింది. రష్యా నిర్వహించే ఓషన్‌-2024 వ్యూహాత్మక విన్యాసాల్లో కూడా పాల్గొంటామని పేర్కొంది. జులైలో దక్షిణ చైనాలోని గుయాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లో ఝాన్‌జియాంగ్‌ నగరం చుట్టుపక్కలా గగనతలంలో, సముద్ర జలాల్లో రెండు దేశాలు సంయుక్త విన్యాసాలు చేపట్టాయి.
పశ్చిమ దేశాల గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా ముఖ్యంగా అంతర్జాతీయ వ్యవహారాల్లో అమెరికా ఆధిపత్యాన్ని నిరసిస్తూ ఇటీవలి సంవత్సరాల్లో రష్యా, చైనాలు ఆర్థిక, సైనిక సహకారాన్ని పెంపొందించుకుంటున్నాయి. తమ భాగస్వామ్యానికి పరిమితుల్లేవని వారు ప్రకటించారు.