అమెరికా రాకెట్లను రష్యా జామ్‌ చేస్తోంది!

– ఉక్రెయిన్‌ రక్షణ మంత్రి
కీవ్‌: హైమార్స్‌ వంటి అమెరికా రాకెట్‌ లాంచర్ల నుంచి ప్రయోగించబడుతున్న జీపీఎస్‌ నిర్దేశిత రాకెట్లను, ఇతర మందు గుండ్లను తప్పుదోవ పట్టించే పద్ధతిని రష్యా ఉపయోగిస్తోందని ఉక్రెయిన్‌ రక్షణ మంత్రి, అలెక్సే రెజ్నికోవ్‌ అన్నారు. గత సంవత్సరం ఈ రాకెట్‌ లాంచర్లను ఉక్రెయిన్‌ ప్రయోగించినప్పుడు అవి నేరుగా లక్ష్యాలను ఛేదించేవని ఆయన ఫైనాన్షియల్‌ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే తనకు బలమైన రేడియో-ఎలక్ట్రానిక్‌ వ్యవస్థలు ఉండటంవల్ల జీపీఎస్‌ నిర్దేశిత ఆర్టిల్లరీ షెల్స్‌ను, హైమార్స్‌ రాకెట్లను జామ్‌ చేసే పద్ధతిని రష్యా రూపొందించిందని ఆయన చెప్పాడు.
రష్యా, పశ్చిమ దేశాల ఆయుధాల పనితీరును పరీక్షించే ప్రయోగశాలగా ఉక్రెయిన్‌ మారింది. 85కిలోమీటర్ల రేంజ్‌ గల హై మొబిలిటీ ఆర్టిల్లరీ రాకెట్‌ సిస్టెమ్స్‌(హైమార్స్‌)ను అమెరికా ఉక్రెయిన్‌కు గత సంవత్సరం జూన్‌ నుంచి సరఫరా చేస్తున్నది. యుద్ధం తీరునే మార్చగల సత్తా వీటికుందని పశ్చిమ దేశాలు గొప్పలు చెప్పాయి. రష్యా సైన్యం ఉపయోగిస్తున్న జామర్స్‌ కారణంగా ఈ బహుళ రాకెట్‌ వ్యవస్థ చాలావరకు నిర్వీర్యం అయిపోయిందని అమెరికా, బ్రిటన్‌, ఉక్రెయిన్‌లోని నిష్ణాతులు ఇచ్చిన సమాచారాన్ని సీఎన్‌ఎన్‌ రిపోర్ట్‌ చేసింది. యుద్ధ క్షేత్రంలో హైమార్స్‌ వ్యవస్థలను కామికాజీ డ్రోన్లతోను, ఫిరంగి గుండ్లతోని నాశనం చేశామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే ఈ ప్రకటనను అమెరికా, ఉక్రెయిన్‌ కొట్టిపారేశాయి.
అమెరికా, నాటో దేశాలు ఉక్రెయిన్‌కు అత్యంత ఆధునిక ఆయుధాలను సరఫరా చేయటంవల్ల యుద్ధం తీవ్రతరమౌతుందేగాని ఫలితంలో మార్పు ఉండదని రష్యా పదేపదే చెబుతోంది. ఆయుధాల సరఫరాతోను, ఇంటెలిజెన్స్‌ను అందించటంతోను, ఉక్రెయిన్‌ సైన్యానికి మిలిటరీ శిక్షణ ఇవ్వటంతోను పశ్చిమ దేశాలు ఇప్పటికే యుద్ధంలో భాగమయ్యాయని రష్యా ప్రకటించింది.