హమాస్‌ను అణచే సాకుతో పశ్చిమ దేశాల మద్దతు ఉన్న ఇజ్రాయిల్ గాజాలోని పాలస్తీనియన్ల మీద ప్రారంభించిన మారణకాండకు నెల దాటింది. అవే పశ్చిమ దేశాల అండ చూసుకొని రష్యాను దెబ్బతీస్తామని బీరాలు పలికిన ఉక్రెయిన్ సంక్షోభం ప్రారంభమై 622 రోజులు అవుతున్నది. ఇంతకాలం గడచినా సాధించ లేనిది ముందు రోజుల్లో రష్యాను వెనక్కు కొడతా రంటే ఎలా నమ్మాలనే సందేహాలు మొదలయ్యాయి. మరోసారి శాంతి చర్చలను తెరమీదకు తెచ్చారు. హమాస్ సాయుధులను అణచివేసేందుకు నిరవధి కంగా గాజా రక్షణ బాధ్యత తీసుకుంటామని ఇజ్రా యిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటిం చాడు. ”మేము అక్కడ లేకపోతే ఏమి జరిగిందో చూశారు. హమాస్ తీవ్రవాదం ఇంత పెద్దఎత్తున ఉంటుందని మేము ఊహించలేదు. నిరవధికంగా గాజా రక్షణ బాధ్యత తీసుకోవాలని అనుకుంటున్నాము” అన్నాడు. ఇజ్రాయిల్ మారణకాండలో మంగళవారం ఉదయానికి అందిన సమా చారం మేరకు గాజాలో 4,100 మంది పిల్లలతో సహా 10,022 మంది మరణించగా 25,408 మంది గాయపడ్డారు. పశ్చిమ గట్టు ప్రాంతంలో మరణించిన వారు 163 కాగా 2,100 మంది గాయపడ్డారు. గాజాలో ఉన్న 35 ఆసుపత్రులలో పదహారింటిని పనికి రాకుండా చేశారు. అదే విధంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు 72కు గాను 51 మూతపడ్డాయి. ఇజ్రాయిల్ మిలిటరీ బాంబులు, క్షిపణులతో దాడులు జరుపుతూ గాజా జనాభా 23 లక్షలకు గాను 16.1లక్షల మందిని నివాసాల నుంచి తరిమి వేశారు. మారణకాండను నిరసిస్తూ బహరెయిన్, ఛాద్, చిలీ, కొలంబియా, హొండురాస్, జోర్డాన్, దక్షిణాఫ్రికా, టర్కీ ఇజ్రా యిల్‌లోని తమ దౌత్యవేత్తలను వెనక్కు రప్పించాయి. బొలీ వియా అన్ని రకాల సంబంధాలను తెగతెంపులు చేసుకున్నది. వందల కోట్ల డాలర్ల విలువగల మారణాయుధాలను అందిస్తున్న అమెరికా గతంలో ఎర్ర సముద్ర ప్రాంతానికి రెండు విమాన వాహక యుద్ధ నౌకలు, క్షిపణి ప్రయోగ యుద్ధ నౌకలను పంపగా ఇప్పుడు ఒక జలాంతర్గామిని ఆ ప్రాంతానికి పంపి ఆ ప్రాంత దేశాలను బెదిరిస్తున్నది. .
తాము అంచనా వేసిన విధంగా రష్యా సేనలను ఎదుర్కో వటంలో ఉక్రెయిన్ విఫలం కావటంతో పశ్చిమ దేశాలు పునరా లోచనలో పడటమే గాక, ఏదో విధంగా రాజీ చేసుకోవాలంటూ ఒత్తిడికి శ్రీకారం చుట్టినట్లు వార్తలు వచ్చాయి. రష్యా సైనిక చర్య ప్రారంభమై ఇరవై నెలలు దాటింది. తమ ప్రాంతాల్లోకి చొచ్చుకు వచ్చిన పుతిన్ సేనలను వెనక్కు కొట్టేందుకు ప్రతిదాడులను ప్రారంభించినట్లు ప్రకటించి ఐదు నెలలు గడుస్తున్నప్పటికీ రష్యా సేనలు ఖాళీ చేసిన ఒకటి రెండు గ్రామాలు, ప్రాం తాలు తప్ప చెప్పుకోదగిన పరిణామాలేవీ లేవు. రష్యా మందుపాతరలను ఏర్పాటు చేసినందున వాటిని తొలగించేందుకు చాలా సమయం పడు తున్నదని ఉక్రెయిన్ చెప్పుకుంటున్నది. నిజానికి అదే వాస్తవమైతే ప్రతిదాడులతో ఆ ప్రాంతాల న్నింటినీ స్వాధీనం చేసుకోవటమే తరువాయి అన్నట్లుగా మే, జూన్ మాసాలలో మీడియాలో కథనాలను ప్రచురించారు. పశ్చిమ దేశాలన్నీ మధ్య ప్రాచ్యం, ఇజ్రాయిల్ మీద కేంద్రీకరించటం, భవిష్యత్‌లో సాయం కొనసాగదేమో అన్న సందేహాలు తలెత్తటం, మరోవైపు రష్యా వైమానిక దాడులు నిరంతరం కొనసాగుతుండటం, చలికాలం ముందుంటంతో ఉక్రెయిన్ మిలిటరీ, పాలకులకు దిక్కుతోచటం లేదు. నవంబరు ఐదవ తేదీన ఉక్రెయిన్ మిలి టరీ అవార్డుల సభ మీద జరిగిన దాడిలో కనీసం 20 మంది సైనికులు మరణించటంతో జెలెన్‌స్కీ కలవరపడ్డాడు. యుద్ధం సాగుతున్న పుడు ఆ ప్రాంతంలో అలాంటి కార్యక్రమం నిర్వహించటం ఏమిటని సామాజిక మాధ్యమంలో జనాలు ప్రభుత్వం మీద తీవ్ర విమ ర్శలు చేస్తున్నారు.
రష్యాతో చర్చలకు ఉక్రెయిన్‌ను ఒప్పిం చేందుకు పశ్చిమ దేశాలు పూనుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇన్ని నెలల తరు వాత రాజీ పడితే అసలు ఇంతకాలం ఎందుకు ఆ పని చేయలేదనే ప్రశ్నలు తలెత్తుతాయి. ముందు మీరు రాజీకి అంగీకరిస్తే గౌరవ ప్రదంగా బయట పడటం గురించి మార్గాన్ని చూద్దామని నాటో కూటమి దేశాల ప్రతినిధులు అంటున్నారు. అందువలన అమెరికా కూటమి ముందుగా ఒక స్పష్టమైన వైఖరికి వస్తేనే చర్చలకు దారి ఏర్పడు తుంది. గత నెలలో జరిగిన ఒక సర్వేలో శాంతి కోసం కొంత భూ భాగాన్ని వదులుకోవచ్చా అన్న ప్రశ్నకు ససేమిరా అంగీకరించం అని 74శాతం మంది చెప్పినట్లు తేలింది. వచ్చే ఏడాది ఉక్రెయిన్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది, అవి జరుగుతాయా లేదా అన్నది ఒకటైతే ఒకవేళ రాజీపడితే జెలెన్‌స్కీ ఇంటిదారి పట్టాల్సిందే. బహుశా అందుకనే యుద్ధంలో ఉన్నందున అసలు వచ్చే ఏడాదైనా ఎన్నికలేంటి అనేపల్లవిని ఎత్తుకు న్నాడు. ఇప్పటికిప్పుడు కాకున్నా కొన్ని నెలల తరువాతైనా జెలెన్‌స్కీ చర్చలకు దిగిరాక తప్పదనే భావం రోజు రోజుకూ పెరుగు తున్నది. జెలెన్‌స్కీ ముందుకు తెచ్చిన పది అంశాల శాంతి పధకం గురించి మాల్టాలో జరిగిన సమావేశానికి చైనా హాజరుకాలేదు. ఈ పరి ణామం ఉక్రెయిన్ కోరుకున్న శాంతి ప్రతిపాదనకు పెద్ద ఎదురుదెబ్బ.
రష్యాను కొద్ది వారాల్లో వెనక్కు నెట్టవచ్చన్న పశ్చిమ దేశాల అంచనాలు తలకిందులయ్యాయి. అక్కడ విజయం సాధించారు, ఇక్కడ ముందుకుపోయారు అంటూ పశ్చిమ దేశాల మీడియా చూపిన దృశ్యాలు, ఇచ్చిన వార్తలు వాస్తవం కాదని తేలిపో యింది. ఇప్పటికీ మద్దతు ఇస్తామని చెబుతున్నప్పటికీ కొనసాగు తుందన్న హామీ లేదు. 2022 మే నెలలో 400 కోట్ల డాలర్ల సాయం అందించాలన్న అమెరికా నిర్ణయానికి పార్లమెంటులో 368 అనుకూల, 57 వ్యతిరేక ఓట్లు వచ్చాయి. ఈ సెప్టెం బరులో జరిగిన 30కోట్ల డాలర్ల బిల్లు ఆమోదం పొందినప్పటికీ వ్యతిరేకించిన వారు 117 మంది ఉన్నారు. ప్రస్తుతం ప్రతిపక్ష రిపబ్లికన్లు పార్లమెంటులో మెజారిటీ ఉన్నారు. వచ్చే ఏడాది ఎన్నికల్లో జోబైడెన్‌ను ఓడించాలని చూస్తున్నవారు ప్రతి ప్రతిపాదనను అడ్డుకొనేందుకు, ఎన్నికల్లో లబ్ది పొందేందుకు చూస్తారు. జాతీయ భద్రతా సహాయ నిధి పేరుతో అమెరికా పక్కన పెట్టిన 105 బిలియన్ డాలర్లలో ఉక్రెయిన్ ఒక్కదానికే 60బి.డాలర్లు ఇస్తామని చెప్పారు. అంత మొత్తం ఇచ్చేందుకు రిపబ్లికన్ పార్టీ సిద్దంగా లేదు. ఆ పార్టీ పార్లమెంటులో మెజా రిటీగా ఉన్నందున వారి మద్దతు లేకుండా ఒక్క డాలరు కూడా జో బైడెన్ విడుదల చేయలేడు. అది లేకుండా ఉక్రెయిన్ ఎంత కాలం నిలబడుతుందన్నది సమస్య. ఇప్పుడు ఇజ్రాయిల్- పామాస్ పోరు ముందుకు రావటంతో అమెరికా దృష్టి అటువైపు మళ్లింది. భారీఎత్తున ఇజ్రాయిల్‌కు నిధులు, ఆయుధాలు సమ కూరుస్తోంది. ఇది కూడా ఉక్రెయిన్‌కు ఎదురుదెబ్బే. పశ్చిమ దేశాల మీడియా అంతటా నెల రోజుల క్రితం వరకు ఉక్రెయిన్ విజయగాధలతో ఉండేవి. ఇప్పుడు వాటి స్థానాన్ని ఇజ్రాయిల్ హమాస్ దాడులు, మధ్యప్రాచ్య పరిణామాలు ఆక్రమించాయి. ఐరోపా యూనియన్ అక్టోబరు నెలలో వచ్చే నాలుగు సంవత్స రాల బడ్జెట్ గురించి బ్రసెల్స్‌లో జరిపిన సంప్రదింపులలో ఉక్రెయిన్‌కు మరింత సాయం చేయకూడదంటూ పోలాండ్, హంగరీ, స్లోవేకియా అడ్డం తిరిగాయి. ఉక్రెయిన్ తక్కువ ధర లకు ఆహార ధాన్యాల ఎగుమతి తమ రైతాంగానికి నష్టం కలిగి స్తున్నదంటూ పోలాండ్ అభ్యంతరం తెలుపుతున్నది. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతున్నందున పోలాండ్ ప్రధాని మోరా విక్కీ తన గెలుపు గురించి ఆందోళన చెందుతున్నాడు, ధాన్య ధరలు తన పతనానికి కారణం అవుతాయోమనని భయ పడుతున్నాడు.
పశ్చిమ దేశాలు ఇప్పటికే తమ వద్ద ఉన్న ఆధునిక విమా నాలు తప్ప అన్ని రకాల ఆయుధాలను ఉక్రెయిన్‌కు అంద చేశాయి. వాటినే ఇంకా సరఫరా చేయటం తప్ప అంతకు మించి మరో అడుగువేయలేని స్థితి. జెలెన్‌స్కీని ముందుకు నెట్టటం తప్ప నేరుగా నాటో కూటమి దేశాలు రంగంలోకి దిగే అవకా శాలు ప్రస్తుతానికి కనిపించటం లేదు. ప్రస్తుతం ఎలాంటి స్థంభన లేదంటూ బింకాలు పలుకుతున్నప్పటికీ ఎంతకాలం అన్న ప్రశ్న ముందుకు వస్తున్నది.
రష్యాతో శాంతి చర్చలకు ఉన్న అవకాశాలేమిటి అంటూ అమెరికా, ఐరోపా సమాఖ్య ప్రతినిధులు ఉక్రెయిన్ అధికారులను అడిగినట్లు అమెరికా ఎన్‌బిసి టీవి పేర్కొన్నది. ఉక్రెయిన్‌కు మద్ద తునిస్తున్న 50కిపైగా దేశాల ప్రతినిధులతో అక్టోబరు నెలలో బ్రసెల్స్‌లో జరిగిన సమావేశం సందర్భంగా ఈ మేరకు కది లించి చూసినట్లు అది వెల్లడించింది. దీని గురించి జెలెన్‌స్కీ స్పందిస్తూ చర్చలకు ఇది తరుణం కాదని, అందుకోసం పశ్చిమ దేశాల నేతలెవరూ తనను ఒత్తిడి చేయటం లేదని చెప్పుకు న్నాడు. రష్యాతో తమ పోరు కదలిక లేని, ఘర్షణపూర్వక బల హీన స్థితి ఉండే దశలోకి ప్రవేశిస్తున్నదని, ఇలాంటి పరిస్థితి రష్యా తనమిలిటరీ శక్తిని తిరిగి సమకూర్చుకొనేందుకు వీలు కల్పి స్తుందని ఉక్రెయిన్ దళాధిపతి జనరల్ వాలెరీ జలుఝని ఎకాన మిస్ట్ పత్రికలో రాసిన వ్యాసంలో పేర్కొన్నాడు. ఆ తరు వాతే ఎన్‌బిసి వార్త, దాని మీద జెలెన్‌స్కీ స్పందన వెలువడింది. ”కాలం గడిచింది జనాలు అలసిపోయారు, కానీ ఇది ప్రతి ష్టంబన కాదు” అని కూడా అన్నాడు. 2014లో రష్యా విలీనం చేసుకున్న క్రిమియా ద్వీపంతో పాటు గత ఏడాది నుంచి ఉక్రె యిన్లో స్వాధీనం చేసుకున్న ప్రాంతాలన్నింటినీ తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఉక్రెయిన్ చెబుతున్నది. ప్రస్తుతం ఉక్రెయిన్లో స్వాతంత్య్రం ప్రకటించుకున్న రెండు రిపబ్లిక్‌లను రష్యా గుర్తిం చింది. వాటితో సహా అంతర్జాతీయంగా గుర్తించిన ఉక్రెయిన్‌లో 17.5శాతం ప్రాంతం రష్యా దళాల అదుపులో ఉంది. ఉక్రెయిన్ నాటోలో చేరబోనని, పశ్చిమ దేశాలతో కలసి తమ భద్రతకు ముపు కలిగించబోమని హామీ ఇస్తే క్రిమియా మినహా తమ స్వాధీనంలో ఉన్న వాటిని వెంటనే అప్పగిస్తామని పుతిన్ మొదటి నుంచీ చెబుతున్నాడు. పశ్చిమ దేశాలు దాన్ని పడనివ్వకుండా అడ్డుపడటమే కాదు, ఫిన్లండ్, స్వీడన్‌లను నాటోలో చేర్చుకొని మరో వైపు నుంచి రష్యాను దెబ్బతీసేందుకు పూనుకున్నాయి.
ప్రస్తుతానికి పశ్చిమ దేశాల సాయం నిలిచిపోతుందని చెప్ప లేము గానీ వచ్చే ఏడాది నుంచి జరగవచ్చని ఐరోపా విశ్లేషకులు చెబుతున్నారు. రానున్న పద్దెనిమిది నెలలు ప్రస్తుత పోరులో కీలకంగా మారనున్నాయని, 2025 వసంత రుతువుకు ముందు రష్యన్లు విజయవంతమైన ఎదురుదాడి చేయలేరని, వచ్చే ఏడాది ఉక్రెయిన్ పెద్ద ముందడుగు వేయవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. తాము కోల్పోయిన ప్రాంతాలన్నింటినీ తిరిగి ఇస్తే తప్ప చర్చలు లేవని ఉక్రెయిన్ చెబుతుండగా, తమ ఆధీనంలోకి వచ్చిన ప్రాంతాలను వదిలేదని రష్యా చెబుతున్నందున రెండు దేశాల మధ్య చర్చలకు ప్రస్తుతం ప్రాతిపదిక లేదనే పద్ధతిలో విశ్లేషణలు సాగుతున్నాయి. రష్యా మమ్మల్నందరినీ చంపిన తరువాత వారు నాటో దేశాల మీద దాడి చేస్తారు, అప్పుడు గాని మీ కొడుకులూ, కుమార్తెలను పోరాటానికి పంపరా అని జెలె నెస్కీ ఒక అమెరికా టీవీ ఎన్‌బిసి ఇంటర్వ్యూలో నాటో కూటమి మీద అసహనాన్ని వెళ్లగక్కాడు. ఒకసారి డోనాల్డ్ ట్రంప్ తమ దేశానికి వస్తే కేవలం 24 నిమిషాల్లో అంతా వివరిస్తానని గెలిస్తే 24 గంటల్లో యుద్ధాన్ని అంతం చేస్తాడని అన్నాడు. మొత్తం మీద ఉక్రెయిన్ సంక్షోభం మరో మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ఎం కోటేశ్వరరావు
8331013288