రైతుభరోసా నిధులను తక్షణమే విడుదల చేయాలి

– రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రైతుభరోసా పథకం కింద పంట పెట్టుబడి సాయం కోసం ప్రతి ఎకరాకూ ఏడాదికి రైతులకు రూ.15 వేలు అందిస్తామంటూ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. ఆ నిధులను తక్షణమే విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని గురువారం ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని కాంగ్రెస్‌ ప్రకటించిందని గుర్తు చేశారు. ఇప్పుడు ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైందనీ, అందువల్ల ఆరు గ్యారంటీల్లో ఒకటైన రైతు భరోసా నిధులను తక్షణమే అందించాలని కోరారు. ఈ సీజన్‌లో కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రైతుల ఖాతాల్లో రూ.రెండు వేల సహాయం అందిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రైతు భరోసా డబ్బుల కోసం వారు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఖరీఫ్‌ వ్యవసాయ పెట్టుబడులకు డబ్బుల్లేక రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వివరించారు. ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ చేసి, కొత్త రుణాలను అందించాలని సూచించారు. రైతు బీమా రెన్యూవల్‌, పంటల బీమా ప్రీమియాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. శుక్రవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో రైతాంగ సమస్యలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.
మద్దతు ధర నిర్ణయంలో కేంద్రం మోసం :తెలంగాణ రైతు సంఘం
వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరలను లెక్కల్లో పెంచినట్టు చూపి కేంద్రం మరోసారి రైతులను మోసం చేసిందని తెలంగాణ రైతు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పొతినేని సుదర్శన్‌రావు, టి. సాగర్‌ విమర్శించారు. ఆ రకంగా ఉత్పత్తి ఖర్చులను తగ్గించి చూపిందని తెలిపారు. ఈమేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉత్పత్తి ధరలను శాస్త్రీయంగా, వాస్తవ ఖర్చు ఆధారంగా నిర్ణయించి దానికి స్వామినాథన్‌ కమిషన్‌ చెప్పినట్టు 50శాతాన్ని జత చేసి మద్దతు ధర నిర్ణయించాలని కోరారు. 50 శాతం కలుపుతున్నట్టు పదే పదే చెబుతున్న కేంద్ర ప్రభుత్వం…ఉత్పత్తి ఖర్చును 40 శాతానికి తగ్గించి ధరలను నిర్ణయిస్తున్నదని విమర్శించారు. ధరల నిర్ణాయక కమిషన్‌ నిర్ణయించిన ఉత్పత్తి ఖర్చును పరిగణనలోకి తీసుకోలేదని విమర్శించారు.