20న దేశవ్యాప్త మెడికల్‌ రిప్స్‌ సమ్మెకు రైతుసంఘం మద్దతు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మందులు, వైద్య పరికరాలపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలని సేల్స్‌, ప్రమోషన్స్‌ ఎంప్లాయిస్‌ యాక్ట్‌ను పటిష్టంగా అమలు చేయాలనే డిమాండ్లతో ఈనెల 20న దేశవ్యాప్తంగా మెడికల్‌ రిప్స్‌ తలపెట్టిన సమ్మెకు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు, ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం యజమానులకు అనుకూలంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి డిమాండ్‌ చేశారు. సేల్స్‌ ప్రమోషన్‌ ఎంప్లాయిస్‌ చట్టం-1976 పటిష్టంగా అమలు చేయాలని మెడికల్‌ రిప్స్‌ నిర్దిష్టమైన పని విధానాలను రూపొందించాలని కోరారు. అత్యవసర మందులు, వైద్య పరికరాలపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలని తెలిపారు. ఆన్‌లైన్‌లో జరుగుతున్న మందుల అమ్మకాలను ఆపాలని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ మందులను పునరుద్ధరించి వైద్య ఆరోగ్య రంగానికి జీడీపీలో ఐదు శాతం నిధులు కేటాయించాలని సూచించారు. మెడికల్‌ రిప్స్‌కు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలనీ, ఎనిమిది గంటల పనివిధానం అమలు చేయాలని కోరారు. పెరిగిన ధరలకు అనుకూలంగా టీఏ, డీఏలను పెంచాలని తెలిపారు. మెడికల్‌ రిప్స్‌పై జరుగుతున్న వేధింపులను ఆపాలని పేర్కొన్నారు.