రైతుబంధు అనుమతి తెచ్చారు…సరే

– దళిత, బీసీ,మైనార్టీ బంధు ఎందుకు తేలేదు
– సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కెేంద్రం నుంచి రైతు బంధు డబ్బులను రైతు ఖాతాల్లో జమ చేసేందుకు అనుమతి తెచ్చారు…సరే దళిత, బీసీ, మైనార్టీ బంధుకు ఎందుకు తీసుకరాలేదని టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన విలేకర్లతో ఇష్టాగోష్టిలో మాట్లాడారు. 2023 ఎన్నికల నేపథ్యంలో నవంబర్‌ 15లోగా రైతు బంధు వేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పథకాన్ని దుర్వినియోగం చేయకుండా చూడాలని కోరినట్టు తెలిపారు. కానీ పోలింగ్‌ నాలుగు రోజులు ఉండగా రైతు బంధు విడుదలకు కేంద్రం గ్రీన్‌ సిగల్‌ ఇవ్వడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఈ పరిణామాలను ప్రజలు గమనించాలని కోరారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రసంగాలకు, జరుగుతున్న తతంగాలకు పోలిక లేదన్నారు. కాంగ్రెస్‌ గెలుస్తుందనే టాక్‌ నేపథ్యంలోనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.
డబ్బు సంచులతో కేసీఆర్‌ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌, మోడీ మధ్య ఫెవికాల్‌ బంధం మరోసారి బయటపడిందన్నారు.