– అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం
నవతెలంగానబ్యూరో-హైదరాబాద్
యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు బంధు డబ్బులను సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆర్థికశాఖ ఉన్నతాధికారుల ను ఆదేశించారు. రోజువారీగా నిధులను విడుదల చేయాలని సూచించారు. గత ప్రభుత్వం నుంచి క్లిష్టతరమైన ఆర్థిక పరిస్థితులు సంక్రమించినప్పటికి రైతు బంధును సకాలంలో అందచేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర రైతాంగం, ప్రజలు రైతు బంధు విడుదలపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరంలేదని తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో ని రాష్ట్ర సచివాలయంలో రైతు బంధు నిధుల విడుదలపై ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి, వ్యవసాయ శాఖ కార్యదర్శి, కమిషనర్‌తో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు రైతు బంధు కింద 27లక్షల మంది (40శాతం) రైతులకు వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ చేసినట్టు పేర్కొన్నారు. యాసంగి పంటల సాగు ముమ్మరంగా కొనసాగుతున్నందున త్వరతిగతిన మిగతా రైతులకు కూడా సొమ్ము జమ చేయాలని ఆదేశించారు. ఈ అంశంపై సంక్రాంతి తర్వాత మరోసారి సమీక్ష నిర్వహించనున్నట్టు మంత్రి పేర్కొన్నారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అందుకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని వెల్లడించారు.