హరీశ్‌ రావు ఆగడాల వల్లే రైతుబంధు ఆగింది..

హరీశ్‌ రావు ఆగడాల వల్లే రైతుబంధు ఆగింది..– డోర్నకల్‌ ప్రచార సభలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ-మరిపెడ
రైతు బంధును అడ్డుపెట్టుకొని ఎన్నికల్లో లబ్ది పొందాలని మామ అల్లుడు చూస్తే.. ఎన్నికల కమిషన్‌ స్పందించి దాన్ని నిలిపివేసిందని, కాంగ్రెస్‌ ఫిర్యాదు వల్లే రైతుబంధు ఆగిపోయిందని హరీశ్‌రావు, కేసీఆర్‌ ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. సోమవారం మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ నియోజకవర్గంలోని మరిపెడ మండల కేంద్రంలో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచార సభలో రేవంత్‌ మాట్లాడారు. రైతుబంధు ఇవ్వాలనుకున్నప్పుడు.. ఎన్నికల నోటిఫికేషన్‌ రాకముందే ఇవ్వొచ్చు కదా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి తెలంగాణ రైతులు ఓట్లు వేసి గెలిపిస్తే డిసెంబరు 9 తర్వాత ప్రతి రైతు ఎకౌంట్‌లో రైతుబంధు సాయం కింద రూ.15 వేలు అందిస్తామని తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా వేసినా వాటిలో లొసుగులతో రెండు లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో అడ్డుకుంటున్న అసలైన దొంగ కేసీఆర్‌ అని విమర్శించారు. ఈ రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని, మీ భవిష్యత్తును మీరే కాపాడుకోవాలని యువకులకు పిలుపు నిచ్చారు.
కేసీఆర్‌ కుటుంబ పాలన, డోర్నకల్‌లో రెడ్యా నాయక్‌ అవినీతి పాలనను అంతమొందించాలని, వచ్చే ఎన్నికల్లో డాక్టర్‌ రామచంద్రనాయక్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ డోర్నకల్‌, మహబూబాబాద్‌ అభ్యర్థులు డాక్టర్లు రామచంద్రనాయక్‌, మురళి నాయక్‌, మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్‌, మాజీ ఎంపీ సురేందర్‌ రెడ్డి, డీసీసీ జిల్లా అధ్యక్షులు జన్నారెడ్డి భరత్‌ చందర్‌ రెడ్డి, ఉపాధ్యక్షులు ఒంటికొమ్ము యుగంధర్‌ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లూరి కృష్ణారెడ్డి, జిల్లా నాయకులు వెన్నం శ్రీకాంత్‌ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయ సారథి, నాయకులు నల్లు సుధాకర్‌ రెడ్డి, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షులు రాధాబాయి, మహలోతు నెహ్రూ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. జరిగింది.