– ప్రాజెక్టుల అప్పగింతపై దాగుడుమూతలు
– ముక్కున వేలేసుకుంటున్న జనం
– విమర్శల పాలవుతున్న సాగునీటి శాఖ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింత విషయంలో తెలంగాణ సాగునీటి శాఖ దాగుడుమూతలు అడుతున్నది. తెలంగాణకు చెందిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వహణ, నీటి విడుదల, ఇతర అంశాలపై కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాల మేరకు కృష్ణా నదీ యాజనమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)కి అప్పగిస్తామని అటు ఢిల్లీలో, ఇటు హైదరాబాద్‌లోని ఉన్నతాధికారుల సమావేశంలో చెప్పి, బయట మీడియాలో లేదంటూ బుకాయించడం నవ్వులపాల్జేస్తున్నది. తెలంగాణ సాగునీటి ప్రయోజనాలను కాపాడటంలో చిత్తశుద్ధి ప్రశ్నార్థకమవుతున్నది. ఉన్నతాధికారుల సమావేశాల్లో ఒకలా, బయట మరోలా వచ్చేలా మాట్లాడటాన్ని పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నది తెలిసింది. సీఎంతోపాటు సంబంధిత శాఖ మంత్రి ఉన్నతాధికారులపై ఒకింత ఆగ్రహాం వ్యక్తం చేశారనే ప్రచారం జరుగుతున్నది. సున్నితమైన అంశాల్లో అధికారులు పకడ్బందిగా వ్యవహరించకపోవడం పట్ల అధికారులను నీలదీసినట్టు తెలిసింది. సందట్లో సడేమియాలా కేంద్ర జలశక్తి శాఖ వ్యవహరిస్తున్నది. తన స్వార్థ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నది. రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలను పరిష్కరించకుండా గత పదేండ్లుగా చోద్యం చూస్తున్నది. నవంబరు నెలాఖరులో నాగార్జునసాగర్‌పై ఏపీ పోలీసులు దాడి చేసిన ఘటన నేపథ్యంలో ప్రాజెక్టు రక్షణ, నిర్వహణ, నీటి వాటాల కేటాయింపు తదితర అధికారాలను కేఆర్‌ఎంబీకి కట్టబెట్టాలని కేంద్రం తెలుగు రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తున్నది. దీన్ని ఏపీ స్వాగతించగా, తెలంగాణ ఒక సారి ఖండించినట్టు, మరోసారి అంగీకరించనట్టుగా వార్తలొస్తున్నాయి. వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకుపోవడంలో ప్రభుత్వం చొరవచూపాలని సాగునీటిరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేఆర్‌ఎంబీకి అధికారాలను కట్టబెట్టడం అంటే ఏపీకి మేలు చేయడమేననే వ్యాఖ్యానాలు వస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మద్దతుతో ఏపీ నిబంధనలకు విరుద్ధంగా సొంత అవసరాలను నెరవేర్చుకుంటుందనే ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. దీన్ని అడ్డుకోవాలనే డిమాండ్లు వస్తున్నాయి. అయితే తెలంగాణ సాగునీటి శాఖ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజలు, మీడియాలో వస్తున్న విమర్శల నేపథ్యంలో తెలంగాణ సాగునీటి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఇంజినీర్ ఇన్ ఛీఫ్ సి. మురళీధర్ శుక్రవారం స్పందించారు. రాహుల్ బొజ్జ మీడియాతో చిట్‌చాట్ చేసి పత్రికా ప్రకటన విడుదల చేయగా, మురళీధర్ విలేకర్లతో మాట్లాడారు. వివరాలు వారి మాటల్లోనే..
పత్రికల్లో వచ్చింది వాస్తవం కాదు ప్రజలు, పార్టీలు నిజాలు గ్రహించాలి : సాగునీటి శాఖ కార్యదర్శి రాహుల్ బోజ్జ
ప్రాజెక్టుల అప్పగింతపై ఢిల్లీలో జరిగిన సమావేశానికి కొనసాగింపుగానే హైదరాబాద్‌లో మరోసారి నిర్వహించారు. అప్పగింతకు కేఆర్‌ఎంబీ చైర్మెన్ ముందు అనేక షరతులు పెట్టాం. సమస్యలు పరిష్కరిస్తేనే ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించే విషయం ఆలోచిస్తాం. ఇరు రాష్ట్రాల మధ్య నీటి వాటా గతంలో 34:66 నిష్పత్తిలో ఉంది. అప్పుడు మనకు ప్రాజెక్టులు లేవు. ఇప్పుడు పెరిగిన దృష్ట్యా ఇప్పుడు దానిని 50:50 నిష్పత్తిలో చేయాలని డిమాండ్ పెట్టాం. ట్రిబ్యునల్-1 ప్రకారం స్థానిక అవసరాలకే తొలిప్రాధాన్యత ఇవ్వాలి. శ్రీశైలంకు విద్యుత్ ప్రాజెక్టుగానే ప్రణాళిక సంఘం తొలుత అనుమతి ఇచ్చింది. పోతిరెడ్డిపాడు ద్వారా కేవలం 34 టీఎంసీలను మాత్రమే తరలించడానికి ఏపీని కట్టడి చేయాలి. తాగునీటి కోసం వినియోగించే నీటిలో కేవలం 20 శాతాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి. ఒక నీటి సంవత్సరంలో దాచుకున్న నీటిని వచ్చే సంవత్సరంలో వాడుకునేలా అవకాశమివ్వాలి. కృష్ణా బేసిన్‌లో అవసరమైన దాని కంటే ఎక్కువ ప్రాజెక్టులను కడుతున్న ఏపీని అడ్డుకోవాలి. ఇరు రాష్ట్రాలకు చెందిన కామన్ ప్రాజెక్టులను మాత్రమే కేఆర్‌ఎంబీకి అనుమతిస్తామని అనాడు చెప్పాం. ఆర్థికపరమైన అవసరాలకోసం సీడ్ మనీగా రూ. 200 కోట్లను ఇచ్చేందుకు గత బడ్జెట్ ప్రతిపాదనల్లో పేర్కొన్నాం. శ్రీశైలం, సాగర్‌లోని 15 అవుట్‌లెట్లలో 10 అవుట్ లెట్ల అప్పగింతకు ప్రభుత్వ అనుమతి పొందాల్సిన అవసరం ఉందని గతంలోనే చెప్పాం. త్రిసభ్య కమిటీ నిర్ణయం మేరకు 10 అవుట్‌లెట్ల ద్వారా నీటి వాటాలు తేల్చాల్సి ఉంది. పత్రికల్లో తప్పుడు సమాచారం వస్తున్నది. ఇది సరికాదు. అప్పగింత జరగాలంటే సమస్యలు పరిష్కరించాల్సిందే. ఢిల్లీలో జరిగిన సమావేశంలో తెలంగాణ చెప్పిన అంశాలు నమోదు చేయలేదు. దీంతో గందరగోళం ఏర్పడింది. చర్చల వివరాలను ప్రభుత్వానికి చెప్పి, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పాం. సున్నితమైన అంశాల పట్ల మీడియా సమయమనం పాటించాలని విజ్ఞిప్తి చేస్తున్నాం.
సాగర్‌ను కేఆర్‌ఎంబీకి అప్పగించలేదు నీటి వాటాలు తేల్చేది త్రిసభ్య కమిటీనే : రాష్ట్ర సాగునీటి శాఖ ఈఎన్సీ మురళీధర్
సాగర్‌ను కేఆర్‌ఎంబీకి అప్పగించలేదు. నీటి వాటాలు తేల్చేది త్రిసభ్య కమిటీనే. గతంలో చెప్పినట్టు 50:50 నిష్పత్తి డిమాండ్‌ను వదులుకో లేదు. షరతులు అంగీకరిస్తేనే అప్పగించే విషయం ఆలోచిస్తాం. విద్యుత్ కేంద్రాల అప్పగింత మా చేతుల్లో లేదు. అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. గత జనవరి 17వ తేదీన దిల్లీ సమావేశంలో మేము అంగీకరించని అంశాలు కూడా కేంద్ర జలశక్తి శాఖ మినిట్స్‌లో పేర్కొన్నది. ఇది సరికాదు. ఈమేరకు ఈ విషయమై అభ్యంతరాలను తెలియజేస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా లేఖ కేంద్రానికి రాశారు. షరతులు అంగీకరించకుండా ప్రాజెక్టులు అప్పగించబోమనీ, అపెక్స్ కౌన్సిల్‌కు నివేదించాలని గతంలోనే స్పష్టంగా చెప్పాం. సీఆర్పీఎఫ్‌ను ఉపసంహరించుకోవాలని కోరాం. నీటి నిర్వహణ కష్ణా బోర్డు, రెండు రాష్ట్రాలు సంయుక్తంగా చేస్తాయి. కేటాయింపులు త్రిసభ్య కమిటీనే చేస్తుంది. గతంలో కూడా ఇదే విధానం ఉంది, కొత్తగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించారనడం దురదష్టకరం. సాగర్‌కు చెందిన పది ఔట్ లెట్లను కష్ణా బోర్డు నిర్వహిస్తుంది, రెండు రాష్ట్రాల ఇంజినీర్లు నిర్వహణలో ఉంటారు. ఇప్పుడు అప్పగింత, స్వాధీనం అంటూ ఏదీ లేదు. ఎంత మంది సిబ్బంది కావాలి, ఏం చేయాలన్న విషయమై ఇంకా కసరత్తు జరగాలి. స్పష్టత రావాలి. ఇప్పటికీ కొన్ని సమస్యలు వస్తున్నాయి, బోర్డుకు జవాబుదారీ తనం ఉండాలి. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ 34 టీఎంసీలకు మించి నీరు తీసుకోకుండా నియంత్రించాలి. ప్రాజెక్టుల అప్పగింతపై చర్చ జరుగుతోంది, ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.