ఇవ్వాళ్ళ తెలుగునాట బాలల రచనల గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు, బాల వికాస యజ్ఞపు చరిత్ర నమోదు చేసినప్పుడు ‘కనిష్టికా కాళిదాసు’ అన్నట్టు ఎటునుంచైనా తప్పనిసరి గుర్తుకొచ్చే పేరు శ్రీమతి సబ్బతి సుమిత్రాదేవి. కొత్త గూడెంలోని సఫాయి బస్తీ ప్రాథమిక పాఠశాల కార్యక్షేత్రంగా రెండు దశాబ్దాలుగా బాలల రచనలను అచ్చువేస్తూ, తాను స్వయంగా బాల సాహిత్య సృజన చేస్తున్న బాల సాహితీవేత్త సుమిత్రాదేవి. 1 ఆగస్టు, 1968న నేటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో పుట్టారు. అమ్మానాన్నలు శ్రీమతి మంగాయమ్మ, శ్రీ రామమూర్తి.
చందమామ, బాలమిత్ర మొదలుకుని బాల్యం నుండి తనపై ప్రభావం చూపిన బాల సాహిత్యంతో సుమిత్రాదేవి ఉపాధ్యాయినిగా బాలలతో చదివించడం, రాయించడాన్ని, రంగస్థల నటనను, పాఠాలు చెప్పడంతో పాటు ప్రధాన వ్యాపకంగా చేసుకుంది. దాని ఫలితమే ఆమె సంపాదకత్వంలో వచ్చిన బాలల రచనలు సంకలనాలు. కళాశాల, పాఠశాల స్థాయిలో రచయిత్రిగా, నాటక్లాలో నటించి గుర్తింపు పొందిన వీరు తన బడి పిల్లలను ఆ దిశగా తీర్చిదిద్ది, తర్ఫీదు నిచ్చారు. బాలల రచనలను తొలుత వ్రాత పత్రికలుగా, వ్రాత పుస్తకాలుగా ప్రచురించారు సుమిత్రాదేవి. అలా వేసిన తొలి అడుగు ‘పూలతోట’ పేరుతో వెలవడింది. తెలుగునాట యివ్వాళ్ల దాదాపు 400కు పైగా పిల్లల పుస్తకాలు వచ్చినట్టు గరిపెల్లి అశోక్ రికార్డు చేశారు, తేదీలతో సహా. అయితే యిక్కడ ఒక విషయాన్ని గమనించాలి, సుమిత్రాదేవి వెలువరించిన పుస్తకాలన్నీ పన్నెండు, పదిహేనేండ్ల్ల పెద్దబడి పిల్లల రచనలు కావు, అచ్చంగా ప్రాథమిక పాఠశాల పిల్లలు రాసిన రచనలు… యిదీ యీ సబ్బతి బాల సాహిత్యానికి పట్టిన పబ్బతి. అలా వ్రాత పత్రికలతో మొదలైన బాలల రచనా యజ్ఞం తరువాత రంగురంగుల పుస్తకాల రూపంలో సింగరేణి నేలమీద బాలల రచనల గనులు తవ్వేందుకు ‘పారాపటాసౖౖె’ నిలిచింది. ఈమె బడి పిల్లలతో ఆకాశవాణి కార్యక్రమాలు నిర్వహించారు కూడా. బాలల రచనలతో తరువాత ‘చిరుదివ్వెలు’ 2012, ‘ఇంద్రధనుసు’ 2013, ‘పతంగి’ 2014, ‘కలం కలాం’ 2015, ‘గురువుగారికి వందనం’ 2016, ‘చిత్రలిపి’ 2018తో పాటు ‘నవ కవిత’ వంటి సంకలనాలు తన స్వీయ సంపాకత్వంలో తెచ్చింది. ఇందులో పిల్లలతో పాటు టీచర్ల రచనలు ఉండడం విశేషం. కేవలం రచనలు, ప్రచురణలతో ఆగిపోలేదు. రాష్ట్ర స్థాయిలో ‘బాలతేజ పురస్కారాలు’ నేలకొల్పి రవీంద్ర భారతి వేదికగా బాలలకు, బాల సాహిత్యకారులను సత్కరించింది. ఖమ్మంజిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం బాలబాట పురస్కారం, నవ్య-నాటా కవితల పోటీలో బహుమతి, గూటం తాతారావు విశిష్ట పురస్కారం, కలహంస పురస్కారం వంటివి వీరిని వరించిన అవార్డులు. ఉపాధ్యాయినిగా పాఠ్యపుస్తక రచనలోనూ పాల్గొన్నారు సుమిత్రాదేవి.
సంకలనకర్తగా, సంపాదకులుగానే కాక కొత్త గూడెం చైల్డ్ వెల్ఫేర్ కమిటి మెంబర్‌గా బాల కార్మికులు, బాలల కోసం పనిచేస్తున్నారు. సుమిత్రాదేవి కవయిత్రిగా ‘నైవేద్యం’ పేర కవితా సంపుటి వెలువరించారు. ‘నాన్న కావాలి’ దీర్ఘ కవిత వీరికి కవయిత్రిగా పేరుతెచ్చిన మరో రచన. బాల వికాసకారిణిగానే కాకుండా బాల సాహితీవేత్తగా సుమిత్రాదేవి మూడు రచనలు ప్రచురించారు. వాటిలో ‘రాజహంసలు-టింగుబుర్ర’ మొదటిది. పిల్లలు రాసిన పుస్తకాలకు సంపాదకత్వం వహించి సంపాదకురాలిగా గుర్తింపు పొందిన ఈ టీచరమ్మ, మళ్ళీ వాళ్ళకు తిరిగి యివ్వాలికదా.. అందుకే తన రాజహంసలు- టింగుబుర్ర పుస్తకాన్ని పిల్లల సంపాదకత్వంలో తెచ్చింది. పిల్లల రచనలకు మనం సపాదకత్వం వహించడం సరే.. పిల్లల సంపాదకత్వంలో తన రచనలు తేవడం ఈమెకే చెల్లింది. వీరు బాలల కోసం అన్ని ప్రక్రియా రూపాల్లో రచనలు చేశారు. అలా తెచ్చిన గేయ సంపుటి ‘మువ్వన్నెలు’. యిందులో బాల గేయాల సరసన చక్కని గేయాలను కూడా చేర్చారు. పిల్లల కోసం సుమిత్రాదేవి ప్రచురించిన మూడో పుస్తకం ‘నవ సమాజం’ నాటికలు. యిందులో పదిహేను బాలల నాటికలున్నాయి. తొలి నాటిక నవసమాజం, నవసమాజానికి వారసులు, పునాదిరాళ్ళయినవాళ్లు ఎలా ఉండాలో చెబుతుంది. యిలాంటివే ‘జబ్బు-డబ్బు’ వంటి నాటికలు. యివేకాక సమాజంలోని అనేక అవకతవకలు, రుగ్మతలపైన కొరడాఝళిపించి ఆయా సమస్యలను నాటికలుగా మలిచారు రచయిత్రి. ‘రైతు-తెలివి’, ‘సోమరినక్క’ వంటివి పిల్లలకు బాగా నచ్చితే, ‘భారతమాత’ దేశభక్తి బీజాలను నాటుతుంది. ‘మువ్వన్నెల జండా’ సుమిత్రాదేవి కూర్చిన గేయాలు. ‘ఎగురుతోంది ఎగురుతోంది/ మువ్వన్నెల జండా’ అంటూ సాగిన ఈ గేయాలు ‘చిట్టిపొట్టి పాపల్లారా/ చిన్నారి బాలల్లారా/ మువ్వన్నెల కేతనాలు/ ఎగరేయగరారండి’, ‘నా దేశం నాకిష్టం/ నా రాజ్యం నాకిష్టం’, ‘తొలి వేకువ చల్లదనం/ జగమంతా కాంతి మయం/ సాగే మబ్బుల పయనం/ తెలుపును తెలుగు భాషా పరిమళం’ అంటూ చక్కగా సాగుతాయి. బాల వికాసకార్యకర్తగా, బాలసాహితీవేత్తగా, రచయిత్రిగా, యోగశిక్షకురాలిగా, ఖమ్మం గుమ్మంపై బాలల రచనలు సింగిడిజండా ఎగిరేసిన ఉపాధ్యాయురాలు సబ్బతి సుమిత్రాదేవికి కొత్తగూడెం బడి పిల్లల తరుపున ఆత్మతో ‘పబ్బతి’. జయహో! బాల సాహిత్యం.
– డా|| పత్తిపాక మోహన్
9966229548