పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపుల్లో గతంలో ఎన్నడు లేని విధంగా గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి తీవ్ర అన్యాయం జరిగిందని తెలంగాణఆదివాసీ గిరిజన సంఘం(టీఏజీఎస్)రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వికసిత్ భారత్ అంటూ ప్రచారాన్ని ఊదరగొట్టిన కేంద్ర బిజెపి ప్రభుత్వం గిరిజనులను మరింత పేదరికంలో నెట్టే విధంగా బడ్జెట్ కేటాయింపులున్నాయని విమర్శించారు. మొత్తం 50,65,345 కోట్ల బడ్జెట్లో దేశ గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారం రాజ్యాంగబద్ధంగా కేటాయింపులు చేయాల్సిన 7 శాతం ప్రకారం గిరిజన సబ్ ప్లాన్ కు 3,54,574 కోట్లు కేటాయించాల్సి ఉండగా కేవలం 1,29,249 కోట్లు మాత్రమే కేటాయించి గిరిజనులకు తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. ఇందులోనే గిరిజన వ్యవహారాల శాఖకు గత ఏడాది 13,000 కోట్లు కేటాయించగా ఈ ఏడాది బడ్జెట్లో అదనంగా కేవలం 1925 కలిపి 14,925 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుందని విమర్శించారు. గిరిజనుల అభివృద్ధికి నేరుగా ఉపయోగపడే రంగాల్లో కేటాయింపులు పూర్తిగా తగ్గించి కార్పోరేట్లు,బడా కాంట్రాక్టర్లు, ధనవంతుల ప్రయోజనాలకు లబ్ధి చేకూర్చే రంగాల్లో మాత్రం గణనీయమైన కేటాయింపులు చేసిందని అన్నారు. ఉన్నత విద్యలో గిరిజన విద్యార్థులను మరింత ప్రోత్సహించాల్సిన కేంద్ర ప్రభుత్వం గతేడాది 240 కోట్లు కేటాయించగా ఈ ఏడాది కేవలం 2 కోట్లు మాత్రమే కేటాయించడం దేనికి సంకేతమో కేంద్రం ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.