బలి

Sacrificeమూడురోజులనుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ఆ రోజు రాత్రే కాస్త గెరువిచ్చాయి. వర్షాల మూలంగా ఎక్కడి యంత్రాలు అక్కడే ఆగిపోయి ఫస్టు షిఫ్టు ఆపరేటర్లు పనుల్లేక రెస్టు రూంలో బాతాఖాని కొడుతున్నారు. కొందరు బయట గుంపులు గుంపులుగా మాట్లాడుకుంటూ అటూ ఇటూ తిరుగుతున్నారు. మరికొందరు మస్టర్లు పడే మ్యాన్‌ వే ఆఫీసు ముందు ఎత్తుగా పెరిగిన జామాయిల్‌ చెట్లకింద చుట్టూరా కట్టిన సిమెంటు గద్దెల మీద కూర్చొని వర్షంనీటితో నిండిపోయిన పనిస్థలాల గురించి మాట్లాడుకుంటున్నారు. వారికి కొద్ది దూరంలో ఎప్పుడూ చెవులు చిల్లులు పడేలాగ రణగొణ ధ్వనులు చేసే డంపర్లన్నీ నిశ్శబ్దంగా పార్కంగ్‌ యార్డులో యుద్ధానికి సిద్దంగా ఉన్న సైనికుల్లాగా వరుసగా నిలిచి ఉన్నాయి. దూరంగా ఓపన్‌ కాస్టు గనిలోపల షావల్స్‌, డ్రిల్సు, సురక్షిత ప్రాంతాల్లో మౌన మునుల్లా ఏకాంత ధ్యానంలో మునిగిపోయినట్లు కనిపిస్తున్నాయి. వాటి చుట్టూ వర్షపు నీళ్లు చేరి ధ్యానాన్ని భగం చేయాలని ప్రయత్నించి, సాధ్యంకాక వాటి ట్రాకులవద్ద మోకరిల్లి పాదాభివందనం చేస్తున్నట్లు గోచరిస్తున్నాయి. నల్లని బొగ్గుపొరలన్ని వర్షపునీరుతో కప్పబడి వెండి పూతలా తళతళా మెరుస్తున్నాయి.
గనిలోకి వెళ్లే మట్టి హాల్‌ రోడ్లపై పేరుకుపోయి మేటవేసిన బురదను క్లీన్‌ చేయడానికి అత్యవసర సైనికుల్లాగ గ్రేడర్లు, డోజర్లు మాత్రమే పనిచేస్తున్నాయి. గని మొత్తం యుద్ధ విరామ సమయంలో ప్రశాంత క్షేత్రంలా, మేఘావృతమైన ఆకాశం నీడలో నిశ్ఛలంగా నిర్జనంగా ప్రకృతితో మమేకమై విశ్రమిస్తుంది. రోజుకు పదివేల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగే ఓపన్‌ కాస్టు గనిలో వర్కింగ్‌ ప్లేసులన్నీ నీళ్లతో నిండి పోవడం, రోడ్లన్నీ బురదమయం కావడంతో మొత్తం ఆపరేషన్‌ బందయింది. ఒక బొగ్గు పెళ్ల కూడా లోపలినుండి పైకి రాకపోవడంతో మైనింగ్‌ అధికారులు కొంపలు మునిగిపోయినట్లు తెగ బాధ పడుతున్నారు.
నేను మ్యాన్‌ వేలో మస్టర్‌ చెప్పి ఓవర్‌ మెన్‌ ల రూంకు వెళ్లి నా చేతిలోని వైర్‌లెస్‌ సెట్‌ సౌండ్‌ తగ్గించి టేబుల్‌పై పెట్టి కుర్చీలో కూర్చున్నాను. ఓవర్‌ మెన్‌ షిఫ్టు రిపోర్టు బుక్కు తీసుకొని షావల్సు, డ్రిల్సు, డోజర్సుకు సంబంధించిన నైట్‌ షిఫ్టు రిపోర్టులేమైనా ఉన్నాయా అని పరిశీలనగా చూస్తున్నాను. నేను, మా ఇంజినీర్‌ ఈ మిషన్లకు సంబంధించిన బాధ్యులం. డంపర్లు, లోడర్లు, గ్రేడర్లకు సంబంధించి వేరే ఇంజినీర్‌, ఫోర్‌ మెన్‌ బాధ్యులు. రూంలో ఎవరూ లేక నిశ్శబ్దంగా ఉంది. వైర్‌లెస్‌ సెట్లో మైనింగ్‌ వాళ్ల మాటలు వినబడుతుంటే వైర్‌లెస్‌ సెట్‌ వర్క్‌షాపు చానల్‌ కు మార్చాను. ఒక్కొక్క సెక్షన్‌కు ఒక్కో చానల్‌ కమ్యూనికేషన్‌ సిస్టం ఏర్పాటు చేశారు.
అప్పుడే మా ఇంజనీర్‌ నన్ను రెస్పాండ్‌ చేస్తూ వైర్‌లెస్‌ సెట్‌ లో పిలుస్తున్నాడు. వైర్‌లెస్‌ సెట్‌ బటన్‌ నొక్కి ”రెస్పాండింగ్‌ సార్‌” అన్నాను నేను.
”ఎంతసేపటినుండి మొత్తుకుంటున్నా రెస్పాండ్‌ కావడంలేదు. సెట్‌ బందు చేసి పెట్టుకున్నవా ఏంది?” అన్నాడు కాస్త కోపంగా ఇంజినీర్‌.
”లేదు సార్‌. సెట్‌ ఆపరేషన్‌ చానల్‌లో ఉండడం వల్ల మీరు మాట్లాడింది రాలేదు. చెప్పండి సార్‌” అన్నాను నేను.
”నేను ప్రాజెక్టు ఇంజినీర్‌ ఆఫీసులో ఉన్నాను. వచ్చేసరికి లేటవుతుంది. రిపోర్టులేం లేవు కదా. ఎట్లాగూ ఆపరేషన్‌ బందే. మిషన్లు నడువవు, వోల్వో షావల్‌ మేంటనెన్సు డ్యూ ఉంది కదా! చేస్తామని మేనేజర్‌కు చెప్పి, ఆ పని ఓ ఫిట్టర్‌కు అలాట్‌ చెయ్యి” చెప్పాడు.
”అట్లాగే సర్‌” అన్నాను.
అప్పుడే లోపలికి వచ్చిన ఓవర్‌ మెన్‌ నన్ను చూసి ”వర్షాలకు ఎక్కడి మిషన్లు అక్కడే ఉన్నయి. పనులేం నడువలేదు. ఇంకా రిపోర్టులెక్కడుంటయి” అంటూ పరిస్థితి వివరించాడు.
భారీ యంత్రాలకు సంబంధించిన మేంటనెన్సు, రిపేర్లు, యోగక్షేమాలు చూస్తూ బొగ్గు తీయడానికి ఎప్పుడూ బ్రేక్‌డౌన్‌ లేకుండా అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత వర్కుషాపు వాళ్లది. అంటే ఫోర్‌ మెన్లది, ఇంజినీర్లది. యంత్రాల ద్వారా గనిలోనుండి బొగ్గు బయటకు తీయాల్సిన బాధ్యత మైనింగ్‌ వాళ్లది. అంటే ఓవర్‌ మెన్‌లది, అండర్‌ మేనేజర్లది, మేనేజర్‌ ది.
నేను ఓవర్‌ మెన్‌ల రూంలో నుండి పక్కనే ఉన్న షిఫ్టు అండర్‌ మేనేజర్ల రూంలోకి వచ్చి విష్‌ చేసి వారి ముందు కుర్చీలో కూర్చున్నాను, ఇంకేమైనా రిపోర్టులున్నాయేమో తెలుసుకుందామని. అప్పటికే నైట్‌ షిఫ్టు ఓవర్‌మెన్‌లు, అండర్‌ మేనేజర్లు ఫస్టు షిఫ్టు అండర్‌ మేనేజర్లకు గనిలోపలి పరిస్థితుల గురించి చార్జీ ఇస్తున్నారు.
”లోపల రెండవ సీమ్‌ వర్కింగ్‌ ప్లేసులో సంపులో నిండిన నీళ్లు పైకి పంపిస్తే తప్ప బొగ్గు తీయలేం. నీళ్ల లెవల్‌ గంటగంటకు పెరుగుతూ ఎత్తుపైన ఉన్న నీటి పంపులు కూడా మునిగేట్లున్నాయి. అందులో ఒక పంపు రాత్రినుండి పనిచేయడంలేదు” అని నైట్‌ షిఫ్టు అండర్‌ మేనేజర్‌ ఫస్టు షిఫ్టు అండర్‌ మేనేజర్‌తో చెప్పాడు. తర్వాత నావైపు చూసి ”ఇంకేంది, మిషన్లే నడుస్తలేవు కదా రిపోర్టులేముంటై. మీ వర్కుషాపోల్లందరు రెండు మూడు రోజులనుండి పనీ పాటలేక వట్టిగనే కూసుండి పోతున్నరు. ఇయ్యాల్ల కూడా గట్లనే పోండి” అంటు దెప్పిపొడుస్తూ అదో విధమైన నవ్వు నవ్వాడు.
”మీరు, మీ ఆపరేటర్లంతా పెద్దగా ఏదో పని చేస్తున్నట్లు మాట్లాడవడితివి” అన్నాను కొద్దిగా ఆయన మాటలకు రెచ్చిపోయి. నేను వర్కుషాపు ఫోర్‌మెన్‌ను కదా! వర్కుషాపు వాళ్లను అంటే ఊరుకుంటానా మరి.
”సరే నువ్వెప్పుడు గిట్లనే మాట్లాడుతావు కాని, వర్షం పడకుంటే హాలేజీ రోడ్లపై బురద గ్రేడింగ్‌ చేసి క్లియర్‌ చేసేసరికి లంచ్‌ టైం పట్టవచ్చు. అప్పటి వరకు లోపల షావల్సుకు ఏమైనా మేంటనెన్సు పనులుంటే పెట్టుకొండి” అన్నాడు అండర్‌ మేనేజర్‌.
”లోపలంతా బురద కదా. మిషన్ల దగ్గరిదాక కన్వీయెన్సు వెహికిల్సు పోతయా మరి?” అడిగాను అనుమానంగా.
”రోడ్లు గ్రేడింగవుతున్నయి కదా, మా పోవచ్చు. ఆ… చెప్పడం మరచిపోయినా. త్రీ నంబర్‌ డోజర్‌ గేర్లు పడుతలేవట. ట్రాన్స్‌మిషన్‌ ఆయిల్‌ లీకవుతుందట. ఆపరేటర్‌ బ్రేక్‌ డౌన్‌ పెట్టిండు. చూడండి” అన్నాడు.
”ఎక్కడినుండి లీకేజో నైట్‌ షిఫ్టు ఫిట్టర్‌ చెక్‌ చేసిండా” అడిగాను.
”ఇరాం లేకుంట వర్షమే పడుతుంది. తడ్చుకుంట పనెట్లా చేస్తం అని నైట్‌ షిఫ్టు ఫిట్టర్‌ అసలు పనే ముట్టుకోలేదు. చార్జ్‌ షీట్‌ ఇప్పించుమంటవా ఫిట్టర్‌కు” అన్నాడు అండర్‌ మేనేజర్‌.
”తప్పంతా మీ దగ్గర పెట్టుకొని ఇంకా ఫిట్టర్‌కు చార్జ్‌ షీట్‌ ఇప్పిస్తారా? తడవకుండా సేఫ్టీ కోసం రెయిన్‌ కోట్లు ఇయ్యమంటే టైంకు ఇయ్యరైతిరి. ఇస్తే రాత్రి వర్షంలో పని అటెండ్‌ చేసెటోళ్లు కదా. సరే మేం ఆ రిపోర్టు చూస్తాం లెండి” అన్నాను నేను.
”మాదేముంది. పైనుంచి రెయిన్‌ కోట్లు వస్తే కదా ఇచ్చేది. మీ యూనినోళ్లు గట్టిగ అడిగితే కదా వచ్చేది” అంటూ నెపం యూనియన్‌ మీదికి నెట్టేశాడు అండర్‌ మేనేజర్‌, నేను గుర్తింపు యూనియన్‌ లీడరునని.
దాంతో నాకు సుర్రున కాలింది. ”యూనియన్‌ వర్షాకాలానికన్నా ముందునుండే ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నా మేనేజ్‌మెంటు ఇంతవరకు ఇయ్యలేదు. కేవలం వందల్లో ఖరీదుచేసే రెయిన్‌ కోరులు ఇయ్యకపోవడం వల్ల రాత్రంతా మిషన్‌ బ్రేక్‌ డౌన్‌ పెట్టుకున్నారు కదా. కంపెనీకి వేల రూపాయిల నష్టం కాదా ఇది. అది ఆలోచించరు” అన్నాను కాస్త కోపంగా.
ఈలోగా మేనేజర్‌ రమేశ్‌ బొలేరో జీప్‌ దిగి అండర్‌ మేనేజర్‌ రూంలోకి వచ్చాడు. అందరు గుడ్‌ మార్నింగ్‌ సార్‌ అంటూ లేచి విష్‌ చేశారు. ఆయన అందరికీ గుడ్‌ మార్నింగ్‌ చెప్పి చేతిలోని వైర్‌లెస్‌ సెట్‌ టేబుల్‌పై పెట్టి కుర్చీలో కూచున్నాడు. అందరూ కూర్చున్నాక ”ఏంటి ఈరోజు ప్రొడక్షన్‌ వస్తుందా?” అడిగాడు అండర్‌ మేనేజర్ల వంక చూస్తూ.
నేను వెళ్లిపోవాలనే తొందరలో మేనేజర్‌ మాటలను బ్రేక్‌ చేస్తూ ”సార్‌… వోల్వో షావల్‌ మేంటనెన్సు డ్యూ ఉంది. టేకప్‌ చేస్తాం” అంటూ మేనేజర్‌ తో చెప్పి లేచి నిలబడ్డాను.
”సరే టేకప్‌ చేయండి. కాని లంచ్‌ వరకు నాకు మిషన్లన్నీ కండిషన్లో ఉండాలి. మీ డంపర్‌ సెక్షన్‌ ఫోర్‌మెన్‌కు కూడా చెప్పు, డంపర్ల మేంటనెన్సు తొందరగా ముగించమని” అంటూ చిన్నపాటి ఆర్డర్‌ వేశాడు మేనేజర్‌ నావంక చూస్తూ.
ఈ లోగా వైర్‌లెస్‌ సెట్‌ లో ”మేనేజర్‌ రెస్పాండ్‌. మేనేజర్‌ రెస్పాండ్‌” అంటూ ఏజిఎం సుబ్బారావు పిలుస్తుంటే ”రెస్పాండింగ్‌ సార్‌” అంటూ మేనేజర్‌ దృష్టి ఏజిఎం మాటలపై పెట్టాడు.
”వర్షం లేదు కదా, రోడ్లు క్లియర్‌ చేసి ప్రొడక్షన్‌ షురూ చేయండి” అంటూ ఏజిఎం ఆర్డర్‌ వేశాడు.
”ఇప్పుడే రోడ్లపైన బురద క్లీన్‌ అవుతుంది సార్‌. రోడ్లు కాస్త డ్రై కావాలి. లేకుంటే డంపర్ల టైర్లు స్కిడ్డై ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. లంచ్‌ వరకు ఆపరేషన్‌ స్టార్టు చేస్తాం” అంటూ మేనేజర్‌ వాస్తవ పరిస్థితి వివరించాడు.
”ప్రమాదమని భయపడుతూ కూచుంటే ఏ పని చేయలేం. ఇది కోల్‌ ఇండిస్టీ. ఎప్పుడు ప్రమాదాలుండేటివే. ఇప్పటికే విపరీతంగా బొగ్గు ఉత్పత్తికి నష్టం జరిగింది. ఇట్లైతే ఈ నెల టార్గెట్‌ సాధించలేం. పనులు స్పీడప్‌ చేయండి” ఆదేశించాడు.
”రెండు బొగ్గు ఫేసుల్లో రెండవ సీంలో ఒకఫేసు మొత్తం నీళ్లతో నిండి పోయింది సార్‌. రెండు వాటర్‌ పంపుల్లో ఒకే పంపు పనిచేస్తలేదట. నీళ్లు ఖాళీ ఐతే తప్ప ఆ సీములో బొగ్గు తీయలేం. ఒక సీములో ట్రై చేస్తాం సార్‌” అన్నాడు మేనేజర్‌.
”నా కవ్వన్ని చెప్పద్దు. ఏంచేస్తరో ఏమో కాని ఇంజనీర్‌తో మాట్లాడి పనిచేయని పంపు అర్జంటుగా ఓకే చేయాలి. వర్కింగ్‌ ప్లేసులో నీళ్లు ఖాళీ కావాలె. లంచ్‌ టైం వరకు రెండు సీముల్లో ప్రొడక్షన్‌ రావాలె. లేకుంటే అందరికీ బ్యాడ్‌ రిమార్కే. జనరల్‌ మేనేజర్‌ పైనుంచి బాగా ఒత్తిడి చేస్తుండు” అంటూ తనపై జీఎం ఒత్తిడిని మేనేజర్‌ కు బదిలీ చేశాడు ఏజీఎం.
పై బాసు మాటలకు కాదనలేక ”సరే సర్‌” అంటూ మేనేజర్‌ నిస్సహాయంగా ఫస్టు షిఫ్టు అండర్‌ మేనేజర్‌ వంక చూశాడు. అండర్‌ మేనేజర్‌ ఓవర్‌మెన్‌ వంక చూశాడు. అప్పటికి మిషన్లు నడిచే పరిస్థితి లేకపోయినా ఓవర్‌మెన్‌ డిస్ట్రిబూషన్‌ బుక్‌ పట్టుకొని బాధ్యతగా ఆపరేటర్లకు పనులు అలాట్‌ చేయడానికి రూం నుండి బయటకు నడిచాడు. నేను వర్కుషాపు వైపు కదిలాను.
ష ష ష
వర్కుషాపులో నా రూంలో కుర్చీపై కూచొని టేబుల్‌పై దుమ్మును గుడ్డతో నీట్‌గా తుడుచుకున్నాను. పక్కకు జరిగిన ఫోర్‌మెన్‌ అని నల్లక్షరాలతో రాసిన నా నేంప్లేట్‌ ను దాని స్థానంలోకి జరిపాను. పక్కన ర్యాక్‌లో ఉన్న వర్కు డిస్ట్రిబూషన్‌ బుక్కు తీసుకొని ఏ పని ఎంతవరకు పూర్తయిందో మరోసారి పరిశీలిస్తున్నాను. వర్షం పడడం వల్ల గని లోపల రన్నింగ్‌ రిపోర్టులు ఉండకపోయినా వర్కుషాపులో మేజర్‌ రిపేరులో ఉన్న కొన్ని మిషన్లు ఏ ఫిట్టర్‌కు అలాట్‌ చేస్తే తొందరగా పని చేస్తాడో అని ఆలోచిస్తున్నాను.
ఎదురుగా ర్యాకుల్లో మిషన్లకు సంబంధించిన సర్వీసు మ్యానువల్సు, పార్ట్సు మ్యానువల్స్‌ నిక్షిప్త విజ్ఞాన వివరాలతో మౌనంగా నిరీక్షిస్తున్నాయి.
”ఏం సారు. అందరు ఖాళీగా కూచుంటే మీరేమో బాగా బుక్కులు మర్లేయబడితిరి” అంటూ చేతిలో టీ ప్లాస్కు టేబుల్‌ పై పెట్టింది లక్ష్మి. అప్పుడే క్యాంటీన్‌ నుండి స్పెషల్‌ చాయ తీసుకు వచ్చినట్లుంది.
నేను తలెత్తి ఆమె వంక చూశాను.ఆమె చిన్నగా నవ్వుతూ పక్కనే ఉన్న ఇంజినీర్‌ రూంలోకి వెళ్లింది.
లక్ష్మీ మరీ అందగత్తె కాకపోయినా అందంగా ఉండడానికి మంచి చీర, మ్యాచింగ్‌ బ్లాజుతో నీట్‌గా తయారై వస్తుంది. నలబై సంవత్సరాల పైనే వయసుంటుంది. భర్తలేకపోయినా ఆ విషాదం ఎప్పుడూ ఆమె ముఖంలో కనిపించదు. భర్త ప్రమాదంలో చనిపోతే ఆయన స్థానంలో ఆమెకు ఉద్యోగం ఇచ్చి కొంతకాలం అండర్‌ గ్రౌండ్‌ గనుల్లో బొగ్గు బ్లాస్టింగ్‌కు ఉపయోగించే డైనమేట్లను ప్యాక్‌ చేసే మట్టి గుటకలు తయారు చేసే పనిలో పెట్టారు. ఆతర్వాత అధునాతన బ్లాస్టింగ్‌ విధానాలు రావడంతో మట్టి గుట్కల అవసరం తీరిపోయింది. దానివల్ల గుట్కల షెడ్డులో పనిచేసే ఆడవాళ్లను ఆఫీసుల్లో స్వీపింగ్‌ మజ్దూర్లుగా వేశారు. ఆమెతో పాటు ముగ్గురు ఆడవాళ్లను వర్కుషాపులో మూడు సెక్షన్లలో స్వీపింగ్‌ కోసం వేశారు. మరికొందరిని క్యాంటీన్లో, సైట్‌ ఆఫీసులో, ఏజీఎం ఆఫీసులో వేశారు. ఆమె వర్కుషాపులో ఎలక్ట్రికల్‌ సెక్షన్‌లో ఇంతవరకు పనిచేసేది. ఆ సెక్షన్‌లో జూనియర్‌ ఇంజినీర్‌తో ఎందుకో గొడవ పడితే ఈ మధ్యే మాసెక్షన్‌లో ఆమెను వేసి మా దగ్గర పనిచేసే ఆమెను తన ప్లేసులో వేశారు. కాస్త పొగరుగా, దురుసుగా ఉంటుందని, మగవాళ్లు ఎవరూ ఆమె జోలికి పోరు. అందుకే నేను కూడా ఆమెతో పని విషయం తప్ప వేరే విషయాలు మాట్లాడను.
లోపలినుండి కప్పు కడిగి తీసుకు వచ్చి టీ పోసి ఇచ్చింది.
నేను టీ తాగుతూంటే ”చాయ పోసి పోతామంటే ఇంజనీరు సారు ఇంకా రాలేదేంది సారు” అడిగింది అనుమానంగా.
”సారు లేటుగస్తడు. ప్లాస్కు ఇంజనీర్‌ టేబుల్‌ మీద పెట్టు. వచ్చినంక పోస్తువులే. ఈలోగా నీ స్వీపింగ్‌ పనిచేసుకో” అన్నాను.
నేను టీ తాగుతుంటే ”సారు మీతో ఓ విషయం చెప్పాలే. కానీ మీరేమనుకుంటరో”అంటూ ఆగిపోయింది.
”చెప్పాలనిపిస్తేనే చెప్పు. నేను ఏమీ అనుకోను” అంటూ టీ తాగిన కప్పు టేబుల్‌ పైన పెట్టి ఆమె ముఖంలోకి పరిశీలనగా చూశాను.
”మీరు ఫోర్‌మెన్‌ అనికాదు కాని, యూనియన్‌ లీడరని అర్థం చేసుకుంటారని మీ చెవిలో ఈ విషయం వేస్తున్నాను” అన్నది.
అప్పుడే ”నమస్తే సార్‌” అంటూ కనకయ్య కుంటుకుంటూ రూం స్టెప్పులెక్కి లోపలికి వచ్చి లక్ష్మి పక్కన నిల్చున్నాడు.
కనకయ్య రోజు శ్రీరాంపూర్‌ నుండి బస్సులో వచ్చి గోదావరిఖని గంగానగర్‌లో దిగి అక్కడి నుండి ఎవరైనా కలిస్తే బైక్‌ మీద, లేకుంటే బొగ్గు ట్రాన్స్‌పోర్టు లారీలో మేడిపల్లి ఓపన్‌కాస్టుకు క్రమం తప్పకుండా వచ్చి డ్యూటీ చేస్తాడు.
”ఏం కనకయ్య… ఈ వర్షంలో బురదలో కుంటుకుంటా బాధపడుతూ ఓ రోజు డ్యూటీకి రాకపోతే ఏమైతది?” అన్నాను ఆయన బాధ చూసి.
”మా అసొంటోళ్లకు డ్యూటీ చేసుకుంటెనే బతుకు కదా సారు. శ్రీరాంపూర్‌లో సివిల్‌ డిపార్టుమెంటులో నాలుగవ క్యాటగిరి ఆపరేటర్‌ గా చేసెటోన్ని. ఆక్సిడెంటులో కాలిరిగిందని అన్‌ఫిట్‌ చేసి జీతం తగ్గించి ఒకటవ క్యాటగిరిలో మజ్దూర్‌గా ఈ ఓపెన్‌ కాస్టుకు ట్రాన్స్‌ఫర్‌ చేసిరి. ఇద్దరు కొడుకులు పనీపాటలేక గాలికి తిరుగుతుంటే నాజీతమే కదా సార్‌ దిక్కు” అన్నాడు బాధపడుతూ.
ఆయన బాధలో, ఆవేదనలో న్యాయముందనిపించింది. ఆయనే కాదు ఆయనలాంటి వారింకెందరికో ఇలాంటి అన్యాయమే జరుగుతుంది.
బాగున్నంత కాలం యాజమాన్యం పని చేయించుకొని, కంపెనీలో ఆక్సిడెంటు జరిగితే అన్‌ఫిట్‌ చేసి తక్కవ క్యాటగిరి ఎందుకియ్యాలి? తొంబై శాతం ప్రమాదాలన్నీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే జరుగుతున్నాయి. ఎందుకో ఇది సహేతుకమనిపించలేదు.
”ఇది అన్యాయమే కనకయ్య. ఆక్సిడెంటైతే అన్‌ఫిట్‌ చేసి జీతం తగ్గించి తక్కువ క్యాటగిరి ఇవ్వడం” అన్నాను.
కనకయ్య నా పక్కనే ఉండడంతో ఏమనుకుందో ఏమో ”నేం తర్వాత మాట్లాడుతా సారు” అంటూ లక్ష్మీ తాగిన టీ కప్పు తీసుకొని రూంలో వాష్‌ బేసిన్‌ దగ్గర కడిగి లోపల పెట్టి బయటకు వెళ్లి షెడ్డు ఊడ్వడం మొదలు పెట్టింది.
”కనకయ్య. ఆ ర్యాక్‌ లో షావల్‌ పార్ట్సు మానువల్‌ ఇటివ్వు” అన్నాను వేలుపెట్టి చూపిస్తూ.
ఆయన ఇవ్వగానే ఆరోజు షావల్‌ మేంటనెన్సుకు కావాల్సిన ఆయిల్లు, ఫిల్టర్లు, కూలెంట్లు, ఇంకా ఇతర పార్టుల కోడ్‌ నంబర్లు రాసి ఇండెంటు కనకయ్యకు ఇచ్చి స్టోర్‌లో డ్రా చేయిమని చెప్పాను.
కనకయ్యను వాస్తవంగా ఫిట్టర్‌ దగ్గర హెల్పర్‌గా పనిచేయడానికి ఇవ్వాలి. కాని కుంటుకుంటూ పని చేయలేడని మానవతా దక్పథంతో ఆఫీసుబారుగా వాడుకుంటున్నాం. చాలా సిన్సియర్‌గా చెప్పిన పనిచేస్తాడు.
”సార్‌… లక్ష్మీ చాలా డేంజర్‌. జాగ్రత్తగా ఉండుండ్రి. బట్ట కాల్చి మీదేసి బదునాం చేసే బాపతు” అని మెల్లగా నా చెవిలో చెప్పి కుంటుకుంటూ ఇండెంటు పట్టుకొని స్టోర్‌ వైపు వెళ్లాడు కనకయ్య.
ఆమె గురించి ఇట్లెందుకంటుండు కనకయ్య అని నాలో నేనే అనుకున్నాను. అప్పటికే ఆలస్యం అవుతుందని పనులు డిస్ట్రిబ్యూషన్‌ చేయడానికి సెక్షన్‌లోకి వెళ్లాను.
సెక్షన్‌లో అందరు నన్ను చూడగానే నమస్తే సార్‌ అంటూ విష్‌ చేసి దగ్గరకు వచ్చి చుట్టూ నిలబడ్డారు. నేను చిన్నగా నవ్వుతూ అందరికి విష్‌ చేసి ఎవరెవరు వచ్చారో అందరి ముఖాలు ఓ సారి చూసి లెక్క పెట్టుకున్నాను పనులు చెప్పడానికి.
”లోపలకు కన్వీయెన్సు ఏది పోయేటట్టు లేదు. వర్కు డిస్ట్రిబ్యూషన్‌ ఇప్పుడెందుకు సార్‌” అన్నాడు ఫిట్టర్‌ రాములు.
”రోడ్లు క్లియర్‌ చేస్తున్నరు. కన్వీయెన్సు పోతేనే లోపలికి పోండి. ఎవరు ఏపని చేయాలో చేప్తే మీరు రడీగా ఉంటరు కదా. మిషన్లు అన్ని వర్షపు నీటితో తడిగా ఉంటాయి. ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కాళ్లు జారి ప్రమాదాలు జరుగుతాయి జాగ్రత్త. మీకు ప్రమాదం జరిగితే మా మెడకు సుట్టకస్తది” హెచ్చరించాను.
”అందుకే సార్‌ ప్రమాదాలు జరుగొద్దని రేపు మన సెక్షనోళ్లం అందరం మైసమ్మకు చేసుకోవాలనుకున్నాం. అందరం అమ్మవారికి మొక్కుదాం. రెండు మేకలు తీసుకొస్తం. కొంత మటన్‌ ఇక్కడ వండుకొని దావత్‌ చేసుకుందాం. మిగతాది ఇళ్లకు తీసుకు పోదాం” అన్నాడు మరో ఫిట్టర్‌ భాస్కర్‌.
”మీ నమ్మకం గాని మనం మైసమ్మకు మొక్కితే ప్రమాదాలాగుతాయా? మన జాగ్రత్తల మనముండాలె గాని” అన్నాన్నేను.
”మరి అన్ని బాయిల మీద ఎందుకు చేస్తున్నారు సార్‌” అడిగాడు మజ్దూర్‌ రామస్వామి.
”మేనేజిమెంటు సేఫ్టీ పట్టించుకోకున్నా, మనం సేఫ్టీ పాటించకున్నా జరిగిన ప్రమాదాలను మైసమ్మ దయచూడకపోవడం వల్ల జరుగుతున్నాయని మనలను భ్రమింప చేయడానికి వేసిన ఎత్తుగడ. అందుకే మేనేజ్‌మెంటే మైసమ్మకు చేసుకొమ్మని ప్రోత్సహిస్తుంది. మనం కూడా ఆ ట్రాపులో పడిపోయి ప్రతీ సంవత్సరం చేసుకుంటున్నాం” అన్నాను.
”సరే, మీరు నమ్మరు గాని అరేంజిమెంటుకు రేపైతే నలుగురికి డ్యూటీలో పర్మిషన్‌ ఇవ్వండి. మేకలకు, మందుకు, కూల్‌ డ్రింకులకు మనిషికి ఎంతపడుతదో లెక్కచేసి చెప్పుతాం” అన్నాడు భాస్కర్‌.
”నాకిష్టం లేకున్నా నలుగురితోని నారాయణ. తప్పుతుందా కానీయండి” అని ఏ ఫిట్టర్‌ ఏ మిషన్‌ రిపోర్టు అటెండు చేయాల్నో చెప్పాను. ఒక్కొక్కరికి ఇద్దరు చొప్పున మజ్దూర్లను హెల్పర్లుగా ఇచ్చాను. వెల్డర్‌కు షావల్‌ బకెట్‌ పెండింగ్‌ వెల్డింగ్‌ పని పూర్తి చేయమన్నాను. టర్నర్‌కు ఏమీ పని లేకపోవడంతో తర్వాత పని చెపుతాను అని నా రూంలోకి వెళ్లిపోయాను.
యాబై మందికి పనులు చెప్పి, ఏమేమి చేయాలో వివరించే సరికి తల ప్రాణం తోకకు వచ్చింది. ఇంతమంది మ్యాన్‌ పవర్‌, ఇన్ని మిషన్లు మెయింటెన్‌ చేయడం నా ఒక్కడితో కాదు, ఇంకో ఫోర్‌మెన్‌ ను ఇవ్వమని ఎన్నిసార్లు మేనేజ్‌మెంటుతో చెప్పినా ఇస్తామంటారు తప్ప ఇవ్వరు. ఇంత పనిభారం ఒత్తిడి ఎంత కాలమని భరించుడో.. నాలో నేను మదనపడుతూ డిస్ట్రిబ్యూషన్‌ బుక్కు టేబుల్‌ పై పెట్టి కుర్చీలో కాస్త రిలీఫ్‌గా కూచున్నాను.
నేను వెళ్లే సరికి లక్ష్మి నాకోసం రూంలో నిలబడి ఎదురుచూస్తుంది.
”సారు మీకు టైం ఉందా, బాయి లోపలికి పోతారా?” అడిగింది.
”ఇప్పుడు లోపలికి పోనులే. అందరు లోపలికి వెళ్లినంక కొంతసేపు ఆగి పోతాను. ఏదో చెప్పాలన్నావు కదా చెప్పు వింటాను” అన్నాను.
”సార్‌ ఇంతకు ముందు నేను పనిచేసిన సెక్షన్లో కొత్తగా వచ్చిన రాజు ఇంజనీర్‌ సార్‌ అందరికి ఇచ్చినట్లు నాకు వీక్లీ ఆఫ్‌ రోజు ప్లేడేలు ఇయ్యకుండా చాలా రోజులనుండి సతాయించిండు. ప్లేడే చేస్తే రెండు మస్టర్లు కదా. ఇయ్యకుంటే ఎవరికైనా బాధే కదా సార్‌. అందుకే కోపమొచ్చి గట్టిగ అడిగిన. అందుకాయన నన్ను తిట్టిందని, ప్రవర్తన మంచిది కాదని బదునాంచేసి మీ సెక్షన్లో వేయించిండు” అన్నది.
”రాజు బాగానే ఉంటాడు కదా. ఈ మధ్యనే ఫోర్‌మెన్‌ నుండి ఇంజినీర్‌గా ప్రమోషన్‌ పొంది ఇక్కడికి వచ్చిండు” అన్నాను.
”ఏం మంచోడు సార్‌. మనసులో ఏదో పెట్టుకొని ఎప్పుడు అదో విధంగా చూస్తాడు” అన్నది.
ఆమె ఎందుకట్ల అంటుందో నాకర్థం కాలేదు. ఒక అధికారి సాధ్యమైనంత వరకు డ్యూటీలో ఆడవాళ్లతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడుతాడు. లేకుంటే తన కింది వారిముందు తలెత్తకోలేడు. ప్లేడేల కోసం బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ ఆమే కావాలని ఇట్లా చెపుతుందేమో అనే అనుమానం కలిగి ఆలోచించసాగాను.
”నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను. రాత్రి పూట వచ్చి ఇంటి ముందు అటీటు ఎందుకు తిరుగాలె. మా సారే కదా. ఏమైనా అడగాలని ఉంటే డైరక్టుగా ఇంట్లోకొచ్చి అడుగొచ్చుగదా” అని మల్లీ తనే అన్నది.
”భయపడ్డాడేమో” అన్నాన్నేను.
”భయపడితే ప్రయత్నం మానుకోవాలె. డ్యూటీలో కావాలని బదునాం చేసుడెందుకు. వేధించుడెందుకు? పనిచేసే ఆడోళ్లంటే అంత చులకనెందుకు సార్‌. భర్తలు లేకుంటే బజారు మనుషులమా సార్‌. వయసులో ఉన్నోళ్లం. ఉప్పు కారం తింటున్నం. మాకు కోరికలుంటయి. ఇష్టాయిష్టాలుంటయి. ఆకలైనంత మాత్రాన ఎక్కడపడితే అక్కడ తినం కదా సార్‌. మాకు ఎవరో ఒకరు పర్మనెంటు ఉంటరు కదా” అంటూ తన మనసులో గూడుకట్టుకున్న ఆవేదనను బయట పెట్టింది.
”నిజమే ఎవరి కోరికలు వారికుంటాయి. ఎవరి అవసరాలు వారికుంటాయి. కాదనలేం. కాని ఇలాంటి విషయాలు బయట పెట్టుకుంటే పరువుపోతుంది కదా!” అన్నాను సముదాయించే ధోరణిలో.
”అందుకే కదా సార్‌, ఎవరికీ చెప్పకుండా యూనియన్‌ లీడరని మీకు చెపుతున్న. అయిందేదో అయింది. ఇంకోసారి ఆయన నాదిక్కు చూడకుండా చేయండి” అన్నది.
”సరే మంచిది మాట్లాడుతాలే. ఆయనేం చెపుతాడో మరి” అంటూ కాళ్ల చెప్పులు టేబుల్‌ క్రింద విడిచి మైనింగ్‌ షూస్‌ వేసుకొన్నాను. బీరువాలో నుండి హెల్మెట్టు తీసుకొని తలపై పెట్టుకొని వైర్లెస్‌ సెట్‌ ఎడమ చేతిలో పట్టుకొని బయటకు నడిచాను. కార్మికులందరూ అప్పటికే ఎవరి పనులు వారు చేయడానికి గని లోపలికి వెళ్లిపోయారు. కన్వీయెన్సు జీపులో ఎక్కి ముందు సీట్లో కూచొని టూ సీమ్‌ షావల్‌ దగ్గరికి పోనీ అని డ్రైవర్‌కు చెప్పాను. జీపు వర్కుషాపు నుండి గని లోపలి వైపు కదిలింది.
ష ష ష
కన్వీయెన్సు జీపు బురద గుంటలు తప్పించుకుంటూ ముందుకు నడుస్తుంది. వైర్లెస్‌ సెట్‌ సౌండ్‌ పెంచి గనిలో రిపోర్టులకు సంబంధించిన సంభాషణలు వింటున్నాను.
”డేవిడ్‌ ఇంజినీర్‌ రెస్పాండ్‌. పంప్‌ సెక్షన్‌ ఇంజినీర్‌ రెస్పాండ్‌” అంటూ మేనేజర్‌ గొంతు వైర్లెస్‌ సెట్‌ లో మారుమోగుతుంది.
డేవిడ్‌ ఇంజినీర్‌ లైన్‌ లోకి వచ్చి రెస్పాండ్‌ సార్‌ అన్నాడు.
”వర్కింగ్‌ ఫేసులో మొత్తం నీళ్లు నిండినై. నీళ్లు ఖాళీ ఐతే తప్ప బొగ్గు తీయలేం. అందులో టూ సీములో రెండు పంపుల్లో ఒకటి రాత్రి నుండి పనిచేయడంలేదని రిపోర్టుంది కదా. ఆ పంపు పని అర్జంటుగా మొదలు పెట్టండి” అంటూ ఆదేశించాడు.
”బురదతో నిండి పంపు సెక్షన్‌ పైపు ఫుట్‌వాల్వు జామైనట్లుంది సార్‌. నీళ్లలో మునిగి పనిచేయాలంటే డేంజర్‌ సార్‌. పని చేయించడానికి చార్జ్‌ హాండ్‌ కూడా లేడు” అన్నాడు ఇంజినీర్‌.
”ఫిట్టర్‌కే చార్జెండ్‌ ఆక్టింగ్‌ రాయి. పనిచేసే టీమ్‌కు ఒ.టి. రాస్తామని చెప్పు. వాళ్లు ఈతకొట్టుకుంటా నీళ్లల్లో మునిగి పనిచేస్తరు” అంటూ పురమాయించాడు ఇంజనీర్‌.
”నీళ్లు బాగా లోతుగా ఉన్నై సార్‌. ఏమన్నా ఐతే ప్రాబ్లం సార్‌” అంటూ భయాన్ని వ్యక్తపరిచాడు ఇంజనీర్‌.
”ఏమన్నా ఐతదని చేతులు ముడుచుకొని కూచుంటవా. ఏంకాదు చేయించు. ఇట్లయితే నిన్ను అండర్‌ గ్రౌండ్‌ బాయిలకు ట్రాన్స్‌ఫర్‌ చేయించి ఇంకో ఇంజినీర్‌ను తెచ్చుకుంటం” అంటూ మేనేజర్‌ బెదిరించాడు.
అసలే పైరవీ చేయించుకొని ఓపెన్‌ కాస్టుకు వచ్చిండు. చేసేది లేక భయంతో ”సరే, మంచిది సార్‌. పని ఎలాగైనా అటెండ్‌ చేస్తాం” అన్నాడు ఇంజినీర్‌.
జీపులో షావల్‌ దగ్గరకు వెళ్లి ఫిట్టర్‌ చేసే మేంటనెన్సు పనులను చెక్‌ చేశాను. అక్కడి నుండి డోజర్‌ దగ్గరకు వెళ్లి గేర్లు ఎందుకు పడటంలేదో చూసి అక్కడ పనచేసే ఫిట్టర్‌ కు కొన్ని సూచనలు చేసి నాపని కాకపోయినా లోపల రెండవ సీములో నీటితో నిండిన సంపు దగ్గరకు వెళ్లాను చూద్దామని. అప్పటికే ఫిట్టర్‌ కం ఆక్ట్‌ంగ్‌ చార్జహాండ్‌ కరుణాకర్‌, హెల్పర్లు బాలయ్య, కొంరయ్యలు పని ఎట్లా చెయ్యాలని తర్జనభర్జన పడుతున్నారు. హెల్పర్లు బాలయ్య, కొంరయ్యలు డ్రెస్సులు విప్పి నీళ్లలోకి దిగడానికి డ్రాయర్‌ మీద సిద్ధంగా ఉన్నారు. నన్ను చూసి నమస్తే సార్‌ అన్నారు వాళ్లు. వాళ్లకు నమస్కారం చేసి పంపుల దగ్గరకు వెళ్లి చూశాను. రెండు పంపుల్లో ఒక పంపే నడుస్తుంది. ఎత్తుగడ్డ మీద ఉన్న పంపులకు ఒక ఫీటు కింది వరకు నీళ్లు నిండాయి. ఇంకా కొద్దిసేపు పంపు నడవకపోతే పైనుండి వచ్చే వరదనీటితో పంపులు మునిగేట్లున్నాయి.
”అంత లోతు నీళ్లల్లో పనెట్ల చేస్తరు కరుణాకర్‌?” అడిగాను ఫిట్టర్‌ ను.
”ఇదో పెద్ద పనా సార్‌. నీళ్లల్లో ఈత కొట్టుకుంటా మునిగి మట్టి కప్పుకుపోయిన సక్షన్‌ పైపు ఫుట్‌ వాల్వు కొద్దిగ పైకి లేపితే చాలు పంపు నీళ్లు గుంజి పైకి పంపింగ్‌ చేస్తది. ఇసొంటి పనులు ఎన్ని చేయలేదు” అన్నాడు ధైర్యంగా హెల్పర్‌ బాలయ్య.
”పైన పంపు దగ్గర సక్షన్‌ పైపు విప్పుకొని ఎస్కార్టు క్రేనుతోని నీళ్లనుండి బయటకు లాగి ఫుట్‌వాల్వు బురద మట్టి తీసేసి మల్లి పంపుకు బిగించవచ్చు కదా” అని నాకు తోచిన సలహా ఇచ్చాను.
”అట్ల చేస్తే సగం షిఫ్టు పడుతది. పంపులు మునిగి పోతయి. మొత్తం ప్రొడక్షన్‌ బందైంది. మేనేజర్‌ ఇంజినీర్‌ను అర్జంట్‌గా పని కావాలని ఇష్టం వచ్చినట్లు మాటలంటూ మీద కూసుండి ఒత్తిడి చేస్తుండు. ఇంజినీరేమో పని చేయకుంటే యాక్షన్‌ తీసుకుంటాం అని మమ్మల్ని బెదిరిస్తుంటే ఏంచేస్తాం. చేయక తప్పేది లేదని హెల్పర్లు కూడా నీళ్లలోపలికెళ్లి పనిచేయడానికి రెడీ అయ్యిండ్రు” నిస్సహాయంగా అన్నాడు కరుణాకర్‌.
”ఎంత ఈత వచ్చినా నీళ్లలో మునిగి ఎంత సేపని శ్వాస బిగపట్టి పనిచేస్తారు. ఇది చేసే పద్ధతి కాదు కదా. ఒకవేళ అర్జంటని చేసినా ఆక్సిజన్‌ కిట్లు తగిలించుకొని నీళ్లలో మునిగి పనిచేయాలి. అదీ కాకుండా ఇలాంటి డేంజర్‌ పని జరిగేటప్పుడు మైనింగ్‌ స్టాచ్యుటరీ ఓవర్‌మెన్‌ ఉండాలె కదా, సేఫ్టీ చూసేందుకు. ఆయన పర్యవేక్షణలో పని జరగాలి.ఆయన ఎందుకు రాలేదు” అడిగాను.
”పని దగ్గరికి ఎవ్వరు రారు. మా చావు మేం చావాలె” అన్నాడు కరుణాకర్‌.
అప్పటికి తొమ్మిదవుతుంది. నా సెక్షన్‌ కాదు, నాపని కాదుకదా అని అక్కడినుండి బయల్దేరి కన్వీయన్స్‌ జీపులో వర్కుషాపుకు వచ్చేసరికి సమయం తొమ్మిదిన్నర అవుతుంది. అప్పటికే క్యాంటీన్‌ నుండి టిఫిన్‌, చాయ వచ్చింది. వర్కుషాపు కార్మికులందరూ టిఫిన్‌ తిని చాయలు తాగి తిరిగి ఎవరి పనులకు వాళ్లు వెళ్లిపోతున్నారు. నేను నా రూంలోకి వెళ్లి ఆ రోజు కార్మికులకు చెప్పిన పనులు అలకేషన్‌ లాగ్‌ బుక్‌లో రాయడంలో మునిగిపోయాను.
ష ష ష
పావుగంట తర్వాత వైర్‌లెస్‌లో షిఫ్టు అండర్‌ మేనేజర్‌ మేనేజర్‌ను రెస్పాండ్‌ చేస్తూ ”పంపుల దగ్గర నీటిలో మునిగి పనిచేస్తున్న బాలయ్య బైటికి రాలేదు సార్‌. మీరు అర్జంటుగా రావాలి” అంటూ ఆందోళనగా చెప్పాడు.
”ఏమైంది. నేను అర్జంటుగా వస్తున్నాను. గజ ఈతగాడు ఎల్జీ వాన్‌ డ్రైవర్‌ రంగయ్య లోపలనే ఉన్నడు. ఆయన్ను వెంటనే రప్పించి గాలించండి” అంటూ ఆదేశించాడు.
మిన్ను విరిగి మీద పడ్డట్టు పెద్ద షాక్‌కు గురయ్యాను.
ఈ వార్త దావానలంలా ఓపన్‌ కాస్టంతా క్షణాల్లో పాకింది. రాస్తున్న వర్కు అలకేషన్‌ బుక్‌ పక్కన పెట్టి కన్వీయెన్సు పిలిచి ఎక్కి కూచున్నాను. నాతోపాటు మరికొందరు కార్మికులు జీపు ఎక్కారు. అప్పటికి ఇంకా ఆపరేషన్‌ స్టార్టు కాకపోవడంతో ఆపరేటర్లు కూడా కన్వీయెన్సు లారీల్లో లోపలికి వేగంగా పోతున్నారు.
లోపలికి పోతుంటే నా మనసంతా అంతకుముందు మాట్లాడిన బాలయ్య చుట్టే తిరుగుతుంది. ఏమైంది బాలయ్యకు. లోపల మునిగిన వాడు ఈదుకుంటా బయటకెందుకు రాలేదు. ఏమైనా లోపల బురదలో కాళ్లు దిగబడిపోయినాయా? లేక నీటిలో మునిగిన తర్వాత లేచేటప్పుడు సక్షన్‌ పైపు కింద ఏమైనా చిక్కుకొని లేవలేక పోయాడా. లేక శ్వాస ఆడక స్పృహ కోల్పోయి అలాగే మునిగి పోయాడా… రకరకాల అనుమానాలు నా మెదడును తొలిచేస్తున్నాయి.
నేను వెళ్లేసరికి అప్పటికే కార్మికులు చుట్టూ గుమిగూడారు. ‘ఏమైంది, ఎట్లైంది’ రకరకాల ప్రశ్నలు. కాని ఎవరికి ఎవరూ జవాబు చెప్పలేని హృదయవిదారక పరిస్థితి. నేను వాళ్లను జరుపుకుంటూ ముందుకు పోయే సరికి బాలయ్యను నీటిలోనుండి తీసుకు వచ్చి గడ్డమీద వేశారు. కళ్లు మూసుకొని నీటితడి ఆరని శరీరంతో నిశ్చలంగా నిర్జీవంగా కనిపిస్తున్నాడు. ‘ఇసోంటి పనులు ఎన్నిచేయలేదు’ పావుగంట కింద ధైర్యంగా అన్న బాలయ్య మాటలే మనసులో చెక్కర్లు కొట్టసాగాయి. నిమిషాల్లో నిండు ప్రాణం నీళ్లలో కలుస్తుందనుకోలేదు.
దీనికి కారకులెవరు? జి.ఎం.? ఏజీఎం? మేనేజర్‌? ఇంజనీర్‌? భద్రతను, రక్షణను గాలికొదిలి ఉత్పత్తి దాహానికి బాలయ్యను బలి ఇచ్చిన హంతకులెవరు? పైనుండి కిందివరకు అందరూ హంతకులే! కోపం, ఆక్రోశం ఉప్పెనలా నాతోపాటు కార్మికులందరిలో సుళ్లు తిరుగుతుంది. అప్పటికే పరిస్థితిని పసిగట్టిన మేనేజర్‌ ఆదేశించడంతో బాలయ్యను జీపులో ఎక్కించారు. ఆలస్యం చేస్తే బాయిమీద కార్మికులు గొడవచేస్తే లేనిపోని తలనొప్పవుతుందని భావించి క్షణంకూడా ఆగలేదు. చలనం లేని నిర్జీవుడైన బాలయ్యను ఆఘమేఘాలమీద సింగరేణి ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. వెనకాలే మేనేజర్‌ జీపు కార్మికులపై బురదను చిమ్ముకుంటూ పరుగు పెట్టింది. అప్పడే ఆగిపోయిన పంపు నీల్లను పైకి చిమ్ముతూ పంపింగ్‌ చేయడం ప్రారంభించింది.

– వేల్పుల నారాయణ, 9440433475