– సంపద పున:పంపిణీకి పోరాటాలు ఉధృతమవ్వాలి
– పదేండ్లలో అదానీ ఆస్తి రూ.16 లక్షల కోట్లకు ఎలా పెరిగింది?
– కార్మికులు, ప్రజల నుంచి కొల్లగొట్టింది కాదా?
– కార్పొరేట్ల సంపదపై పన్నులేసి ప్రజలకు మేలు చేయాలి : మేడే దినోత్సవంలో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు
హక్కుల సాధనకై నిప్పు కణికలై… ఊరూవాడా కదం తొక్కింది కార్మికలోకం. తమ బతుకులను హరిస్తున్న కాషాయ రక్కసిపై కన్నెర్ర చేసింది. కార్పొరేట్లకు ఎర్రతివాచీ పరుస్తూ.. తమ శ్రమను మరింతగా దోపిడీ చేసేందుకు కుట్రలు పన్నుతున్న పాలకవర్గాలపై భగభగలాడే సూరీడితో కలిసి భగ్గున మండింది. అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా సరికొత్త సమసమాజాన్ని స్థాపిస్తామంటూ ప్రతినబూనింది. తమ లక్ష్యాలు, ఆశయాలకు అడ్డుగా ఉన్న వారికి లోక్‌సభ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించింది. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన అరుణపతాకం అజరామరమంటూ నినదించింది.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దోపిడీకి వ్యతిరేకంగా, సంపద పున:పంపిణీ కోసం పోరాటాలు ఉధృతం చేయాలని కార్మికవర్గానికి సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.వీరయ్య అధ్యక్షతన మేడే దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీవీ.రాఘవులు అరుణ పతాకాన్ని ఎగురవేసి మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా దోపిడీ, జాతి, మత, కుల అణచివేతలకు వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతమవుతున్న తీరును వివరించారు. నేడు విశ్వవిద్యాలయాలు పూర్తిగా స్తంభించిపోయి ఉన్నాయని చెప్పారు. పాలస్తీనాలో ప్రజలపై ఇజ్రాయిల్ దాడులను వ్యతిరేకిస్తూ అమెరికాలోని విశ్వవిద్యాలయాల విద్యార్థులు తమ చదువులను పక్కనబెట్టి పోరాటాల్లోకి వస్తున్నారన్నారు. వారి పోరాటాలను అణచివేయడానికి కాల్పుల వరకు వెళ్తున్న పాలకుల తీరును ఎండగట్టారు. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు తమ హక్కుల కోసం రోడ్లమీదకొచ్చి పాలకులపై పోరాటాలు చేస్తున్నారని అన్నారు. మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, ఫెడరలిజాన్ని, సామాజిక న్యాయాన్ని ధ్వంసం చేయడానికీ, రాజ్యాంగం మూల సూత్రాలను తూడ్చివేయడానికి కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రయత్నిస్తోన్నదని విమర్శించారు. మోడీ సర్కారు విధానాలపై అలుపెరుగని పోరాటాలు చేసి నల్లచట్టాలను అడ్డుకోవటం రైతుల విజయమేనన్నారు. పౌరచట్ట సవరణలు చేయించడంలోనూ, ఐదేండ్లుగా దానికి విధివిధానాలను రూపొందించకుండా అడ్డుకోవడంలోనూ ప్రజలు సక్సెస్ అయ్యారన్నారు. కార్మిక సంఘాలు ఐక్యంగా 19 సార్వత్రిక సమ్మెలు చేశాయని గుర్తుచేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా పోరాటం ఉధృతంగా సాగుతోందని చెప్పారు. దేశంలో దోపిడీ తీవ్రత పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల జీతభత్యాలకు, పెరుగుతున్న ధరలకు చాలా అంతరం ఉందన్నారు. కార్మికుల జీతాలను తగ్గిస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వారసత్వ సంపదను అందరికీ పంపిణీ చేయాలంటు న్నారని మోడీ, బీజేపీ నేతలు చేస్తున్న విషప్రచారాన్ని ఎండగట్టారు. పదేండ్ల కాలంలో అదానీ ఆస్తి రూ.60 వేల కోట్ల నుంచి రూ.16 లక్షల కోట్లకు ఎలా పెరిగింది? ఇది ప్రజలను కొల్లగొట్టి సంపాదించిన ఆస్తికాదా? అని ప్రశ్నించారు. మోడీ ప్రధాని అయినప్పుడు దేశంలో వెయ్యి కోట్ల రూపాయల ఆస్తి ఉన్నవాళ్లు 221 మంది ఉంటే వారి సంఖ్య 2,500కి పెరిగిందనీ, ఇదంతా వారసత్వ ఆస్తేనా? అని నిలదీశారు. ఇది కార్మికులు, ప్రజల పొట్టగొట్టి సంపాదించిన ఆస్తేనని నొక్కి చెప్పారు. అలాంటి ఆస్తిపై పన్నులేసి ప్రజలకు ఖర్చుపెట్టాలని డిమాండ్ చేశారు. కార్మిక కోడ్‌లకు అనేక రాష్ట్రాల్లో విధివిధానాలను రూపొందించకుండా అడ్డుకోవడంలో కార్మిక సంఘాలు విజయవంతం అయ్యాయన్నారు. కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాకుండా, రాజ్యాంగాన్ని రక్షించు కోవడానికి కార్మికోద్యమం మరింత ఉధృతం కావాల్సిన అవసరముందని నొక్కిచెప్పారు. కార్మికుల జీవనప్రమాణాలు పెంచుకునేందుకు, లౌకిక, ప్రజాస్వామ్య, రాజ్యాంగ రక్షణ కోసం కార్మికులు పోరాటాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య మాట్లాడుతూ..మోడీకి ప్రజల కష్టాలు పట్టట్లేదన్నారు. నిత్యావసర ధరల పెరుగుదల, కార్మికుల వేతనాల పెంపు కోసం జరుగుతున్న పోరాటాలు ప్రస్తుతం చిన్నస్థాయిలో కనిపించవచ్చుగానీ రానున్న రోజుల్లో అవి తీవ్రస్థాయికి చేరుకుంటాయని హెచ్చరించారు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పోరాటాలకు సంఘీభావం తెలపాలని కార్మికవర్గానికి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి.సాగర్, నాయకులు జంగారెడ్డి, ఎంవీ.రమణ, జె.బాబూరావు, బి.ప్రసాద్, ఎస్వీ.రమ, అరుణజ్యోతి, టి.నాగరాజు, మూర్తి, ప్రజాసంఘాలు, రాష్ట్ర కేంద్రం నాయకులు పాల్గొన్నారు.