సద్దితిన్న రేవు తలవాలె…

మనిషికి కృతజ్ఞతా భావం వుండాలి. ఉంటేనే ఎల్లకాలం మంచిగుంటది అంటరు. అట్లనే ‘సద్ది తిన్న రేవు తలవాలె, సచ్చెదాక బువ్వ దొరుకతి’ అంటరు. అంటే సద్ది అంటే అన్నం. అన్నం తిన్న రేవు అంటే తావును తలుచుకోవాలి. అట్లా కృతజ్ఞత మనసులోనైనా చెప్పితేనే చినిపోయేదాక బువ్వ దొరుకతది అనే ఒక పాజిటివ్‌ ఆలోచనను వ్యక్తం చేయడం. కానీ ఇయ్యాల రేపు ‘అన్నం పెట్టినోనికే సున్నం పెడుతున్నరు’. ప్రోత్సాహంతో పైకి వస్తే వాన్ని అణిచివేస్తరు చాలామంది. ఇటువంటి వాల్లను ‘నడి ఇస్తరిలో తిని కొన ఇస్తరిల ఏరుగుతరు’ అంటరు. వాల్లు సద్ది తిన్న రేవు జ్ఞాపకం చేయకపోని, తిన్న కాన్నే అంటే విస్తరిలోనే తిని అక్కన్నే మరిచేవాడి గురించి ఇలా బలంగా చెప్పిన సామెత. ఇసొంటోల్లను ఏందిర గిట్ల చేస్తన్నవు అంటే ఏదో కథలల్లుతరు. వాల్లను ‘ఏరోటి కాడ ఆ పాట పాడేటోడు’ అంటరు. అంటే ఎవని దగ్గరకి పోతే వాని పాటే కాలం ఎల్లదీస్తరు. స్వంత స్వతంత్రత వుండదు. ‘ఇటువంటి వాల్లు గాలివాటం మనుషులు’ అని కూడా అంటరు. వీల్లు మల్ల ఎట్లుంటరంటే ‘ఈతాకు ఏసి తాటాకు దొబ్బుక పోతరు’. ఇటువంటి వాళ్లు సమాజంలో ఎందరో వుంటరు. వీల్లకు ఎన్ని నీతి బోధలు చేసినా ఎక్కది. చెప్పదంతా ‘మంత్రసానికి తిన్క నేర్పినట్టు వుంటది’. వీల్లే మల్ల ఎట్లుంటరంటే మనుషులు ‘చెప్పేది చెప్పుతనే వుంటం, వాల్లు చేసేది చేస్తనే వుంటరు’. లోకం మీద రకరకాల మనుషులు, రకరకాల ఇకమానులు. కలీగం ఇట్ల అయిపోతంది ఏం చేస్తాం.
– అన్నవరం దేవేందర్‌, 9440763479