అక్కడ సందడైతే చాలా ఉంది గాని ఇప్పుడు చర్చించేది చిల్లర సడేమియాల గురించి కాదు. వీరు అసామాన్యులు. ఘటనాఘటన సమర్థులు. మన ప్రజల స్వేదం, రక్తం పీల్చింది చాలక ఖండాంతరాలకు విస్తరించారు. ప్రస్తుతం మన ఉప ఖండ దేశం బంగ్లాదేశ్ గురించే ఈ ముచ్చట!
ఆ దేశంలో జనం లక్షల్లో రోడ్లపైకొచ్చారు. శ్రీలంకలోలాగా తిండి కోసం కాదు. ప్రజాస్వామ్యం కోసం. పాకిస్థాన్ సైనిక నియంతృత్వంపై తిరగబడ్డ షేక్ ముజిబూర్ రెహమాన్ ‘ఖాస్’ వారసురాలిపై జరిగిన తిరుగుబాటు ఇది. ఆ తిరుగుబాటు కారణాల్లో ఒకానొక కారణం ఆమె భారతదేశ కొమ్ము కాస్తున్నారని! మాస్టర్ జీగా పేరు పొదిన సూర్యసేన్, కల్పనా దత్తా వంటి వారి నాయకత్వంలో చిట్టగాంగ్ తిరుగుబాటు జరిగిన నేల బంగ్లాదేశ్. బ్రిటిష్ బట్టల మిల్లుల వల్ల ధ్వంసమైన ఢాకా చుట్టుపక్కలుండే లక్షల మంది ‘మస్లీన్’ బట్టనేసే కార్మికులు తిరగబడ్డ నేల బంగ్లాదేశ్. 1905లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా తూర్పునున్న ముస్లింలు, పశ్చిమానున్న హిందువులు ఏకమై పోరాడి ఆ నిర్ణయాన్నుండి బ్రిటన్ వెనక్కి తగ్గేలా చేసిన సీమ అది. వీటన్నిటి పరాకాష్టగా క్విట్ ఇండియా ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిపడిన ప్రాంతం నాటి కలకత్తా ప్రెసిడెన్సీలో అంతర్భాగమైన నేటి బంగ్లాదేశ్. ఆ ప్రాంతంలో నేడు పెట్టుబడిదారులు, ముఖ్యంగా వంటనూనెలు, విద్యుత్, ఎఫ్‌ఎంసీజీలు (వాషింగ్ మెషీన్లు, టీవీలు గట్రా), ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాల్లో భారతీయ పెట్టుబడి బంగ్లాదేశ్‌లో వేళ్లూనుకుంది. ఆ దేశంలో ఎంత వ్యతిరేకత ఉన్నా షేక్ హసీనా వాటికి ఎర్రతివాచీ పరవడం వల్ల 1942 ఆగస్టులో ‘క్విట్ ఇండియా’ అంటూ మార్మోగిన 82 ఏండ్లకూ నేడు అదానీ వంటి భారతీయ కార్పొరేట్ల పుణ్యాన ”ఇండియా ఔట్” నినాదం మారుమోగుతోంది అక్కడ. భారతదేశ పరువు అలీనోద్యమ కాలం నుండి నేడేదశకు చేరిందో పరిశీలిస్తే కడుపు తరుక్కుపోతుంది.
సామ్రాజ్యవాద దాష్టీకానికి లొంగిపోయే దేశాలకు మద్దతుగా నిలిచిన భారతదేశం యొక్క స్థితి ఏ స్థాయికి దిగజారిందంటే పారిస్‌లో నివశిస్తున్న బంగ్లాదేశ్ సోషల్ మీడియా యాక్టివిస్టు పినాకి భట్టాచార్య భారతీయ సరుకుల్ని బహిష్కరించాలని పిలుపిస్తే జనం వాటికి ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నట్టు సూచనలు కన్పడుతున్నాయి. ఇంతలోతైన సంబంధాలున్న ఇరు దేశాల మధ్య అది అంత తేలికగా జరగకపోయనా, బంగ్లాదేశీయుల నిజమైన వేదనలను, ఆ దేశ రాజకీయాలలో ఆ వేదన పాత్రను భారతదేశం పట్టించుకోక పోవడంపై వెల్లువెత్తుతున్న అసంతృప్తిని ఇది తెలియజేస్తుం దని అమెరికాలోని ఇల్లినాయిస్ ప్రొఫెసర్ అలీ రియాజ్ చెప్పారు. షేక్ హసీనా నియంతృత్వ పోకడలను, చివరికి 2014, 2018 ఎన్నికల్లో ఓట్లు రిగ్గింగుకు భారతదేశం తోడ్పడిందనే ఆరోపణలు కూడా ప్రొ|| రియాజ్ చేశారు.
వెరసి, వీటన్నిటి ఫలితమే విద్యార్థుల ఉద్యమంగా ప్రారంభమై, అనేక వర్గాల ప్రజల్ని ఆకర్షించిన నేటి బంగ్లా ఉద్యమం. మోడీ సర్కార్ షేక్ హసీనాకు ఆశ్రయం కల్పిస్తూనే ఆ దేశంలో దారి తప్పిన మూక ఆ దేశ మైనారిటీలపై (ముఖ్యంగా హిందువులపై) దాడి చేస్తోందని అక్కడక్కడా దేవాలయాలపై దాడి ఘటనలను చూపి మన దేశంలో ముస్లింలపై దాడికి పిలుపివ్వడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అపూర్వానంద్ ఝా బంగ్లాదేశ్‌లో ముస్లిం మత పెద్దలు ఏ రకంగా హిందూ దేవాలయాలకు, హిందువులకు రక్షణగా నిలిచారో ప్రపం చానికి వెల్లడించేదాకా బీజేపీ ప్రచారం నిరాఘాటంగా సాగిపోయింది.
దక్షిణాసియా అమెరికా గుప్పెట్లో ఉండాలంటే పాకిస్థాన్ ఒకటే చాలదు. మోడీని లోబరుచుకుంటే కూడా చాలదు. ఈ ప్రాంతంలో ప్రజాతంత్ర ఉద్యమాన్ని నామరూపాల్లేకుండా చేయాలంటే దానికి కంట్లో నలుసులా ఉంది బంగ్లాదేశ్. అక్కడ పాదం మోపే సందు దొరికించుకోవాలని అమెరికా ప్రయత్నం.
చివరగా మరో సాంస్కృతిక అంశం మన గమనంలో ఉండాలి. పెద్దఎత్తున ప్రజా ఉద్యమాల సారథుల్ని, వారి చిహ్నాలను ధ్వంసం చేయడం చూస్తున్నాం. 1991లో మాజీ సోవియట్‌లో లెనిన్ విగ్రహాల్ని ధ్వంసం చేసి పైశాచికానందం పొందారు కొందరు. పాకిస్థాన్ దుర్మార్గాలను, దానికి వ్యతిరే కంగా షేక్ ముజిబూర్ రెహ్మాన్ చేసిన పోరాటాన్ని చూడని, అనుభవించని కుర్రకారు 2024లో ముజీబ్ విగ్రహాల్ని ధ్వంసం చేశారు. ఎప్పట్నించో ఆ దేశంలో పట్టుకోసం ప్రయత్నిస్తున్న అమెరికా కోరిక ఈ విధంగా తీరింది.
భారతదేశంలో గాంధీ వారసత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నలు బీజేపీ ఎప్పట్నించో సాగిస్తోంది. ఇప్పటికే ‘స్వచ్ఛ అభియాన్’ పేర గాంధీ కళ్ల జోడును డస్ట్ బిన్‌లపై చేర్చేశారు. కేవలం సోషల్ పుస్తకాల్లో తుడిపేసినంత తేలిగ్గా గాంధీని, ఆయన వారసత్వాన్ని తుడపలేరు. గాంధీజీ కొన్ని విలువలకు నిలబడ్డారు. ఆ విలువలకే నేలకొరిగారు. అందులో హిందూ ముస్లిం ఐక్యత ఒకటి. మతం ఆధారంగా దేశం చీలిపోవడం సరైనది కాదన్నారు. చివరికి 1947 ఆగస్టు 15 సంబురాల్లో కూడా పాలుపంచుకోలేదు. తననితాను సనాతన హిందువుగా చెప్పుకుంటూనే దళితుల అభ్యున్నతి కోసం ఆయన నిలబడ్డారు. వీటన్నిటినీ కూల్చేస్తేనే మహాత్ముని కూల్చడం సాధ్యం.