– మూడు ఫార్మాట్లలో భారత్ అజేయొం సవాల్ దీటుగా ఎదుర్కొన్న రోహిత్‌సేన
ఆసియా జట్లను ఎప్పుడూ పరీక్షించే, సవాల్ విసిరే విదేశీ పర్యటనలు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. ఆసీస్, కివీస్ సహా ఇంగ్లాండ్ గడ్డపై భారత్ టెస్టు సిరీస్ విజయాలు సాధించింది. 32 ఏండ్లుగా అందని ద్రాక్షగా కొనసాగుతుంది సఫారీపై టెస్టు సిరీస్ విజయం. రోహిత్‌సేన ఈ ప్రయత్నంలో సిరీస్ సాధించలేదు. కానీ సఫారీ పర్యటనలో అజేయ రికార్డుతో అదరగొట్టింది. వన్డే, టీ20, టెస్టు ఫార్మాట్లలో ఏ సిరీస్‌లోనూ భారత్ ఓడలేదు. టీ20, టెస్టు సిరీస్‌లు సమం కాగా.. వన్డే సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. వైట్, రెడ్ బాల్ ఫార్మాట్లలో రోహిత్‌సేన అదరగొట్టగా.. టీమ్ ఇండియా సఫారీ పర్యటన విజయవంతంగా ముగిసింది.
నవతెలంగాణ క్రీడావిభాగం
దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్ విజయం భారత్‌కు కలగానే కొనసాగుతుంది. గతంలో ఎం.ఎస్ ధోని ఇక్కడ టెస్టు సిరీస్‌ను సమం చేసుకుని ఉత్తమ ఫలితాన్ని అందుకున్నాడు. ఇప్పుడు రోహిత్ శర్మ సైతం టెస్టు సిరీస్‌ను డ్రా చేసి దిగ్గజ సారథి సరసన నిలిచాడు. సఫారీ పర్యటనలో టెస్టు సిరీస్ కోల్పోని భారత కెప్టెన్లుగా ధోని, రోహిత్ నిలిచారు. 2023 ప్రపంచకప్ బాధ నుంచి కోలుకుంటూ దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన భారత్.. అంచనాలను అందుకుంది. మూడు ఫార్మాట్లలో మెప్పించింది. సవాల్‌తో కూడిన పరిస్థితుల్లో ఎదురొడ్డి నిలిచింది. పరాజయానికి సాకులు వెతికే పని చేయకుండా, ప్రతి సవాల్ సంధించేందుకు మార్గాలు అన్వేషించింది. కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రవిడ్ ద్వయం ఈ అంశంలో విజయవంతం అయ్యారు. 2023-24 దక్షిణాఫ్రికా పర్యటనను భారత్ అత్యంత విజయవంతంగా ముగించింది. మూడు మ్యాచుల టీ20 సిరీస్ 1-1తో సమం, మూడు మ్యాచుల వన్డే సిరీస్ 2-1తో భారత్ కైవసం అయ్యాయి. గాంధీ-మండేలా టెస్టు సిరీస్‌ను ఇరు జట్లు పంచుకున్నాయి.
అసమానం : ఆధునిక క్రికెట్‌లో విదేశీ టెస్టు విజయాలు అనగానే రిషబ్ పంత్ గుర్తొస్తాడు. ఇటీవల భారత్ అందుకున్న అద్వితీయ విజయాల్లో అతడి పాత్ర మరువలేనిది. సఫారీ పర్యటనకు గేమ్ చేంజర్ రిషబ్ పంత్ లేకుండానే వెళ్లింది భారత్. సీనియర్ పేసర్ మహ్మద్ షమి సైతం గాయంతో దూరమయ్యాడు. బ్యాట్‌తో మ్యాచ్ గమనాన్ని వేగంగా మార్చగల దీరుడు పంత్, పదునైన పేస్, స్వింగ్‌తో రెండో ఇన్నింగ్స్‌లో ప్రభావం చూపే షమి దూరం కావటం టెస్టు జట్టుపై ప్రతికూల ప్రభావం చూపించింది. కెఎల్ రాహుల్ సెంచూరియన్ టెస్టులో వరుసగా రెండోసారి శతకంతో మెరిసినా.. రెండో సారి బ్యాటింగ్‌కు వచ్చిన భారత్ 131 పరుగులకే కుప్పకూలింది. రోహిత్, విరాట్, గిల్ వంటి నాణ్యమైన బ్యాటర్లతో కూడిన లైనప్ పేకమేడలా కూలింది. ఇటువంటి కఠిన పరిస్థితుల్లో గతంలో పంత్ జట్టును ఆదుకున్నాడు. బుమ్రా, సిరాజ్‌కు మూడో పేసర్ మద్దతు లేకపోవటం సెంచూరియన్‌లో భారత్‌కు కోలుకోలేని దెబ్బతీసింది. ఈ రెండు సమస్యలను భారత్ కేప్‌టౌన్‌లో అధిగమించింది. తొలుత బంతితో మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరుగగా.. ఆ తర్వాత జశ్‌ప్రీత్ బుమ్రా సైతం ఆరు వికెట్ల ప్రదర్శన పునరావృతం చేశాడు. టెస్టు క్రికెట్ చరిత్రలోనే పేసర్లు భీకర స్థాయిలో చెలరేగిన టెస్టులో టీమ్ ఇండియా పైచేయి సాధించింది. ఊరించే ఛేదనలోనూ రోహిత్‌సేన మార్క్ చూపించింది. ఐదు సెషన్లలో ముగిసిన కేప్‌టౌన్‌లో భారత్ అసమాన విజయం సాధించింది. 2021 గబ్బా టెస్టు విజయంతో కేప్‌టౌన్ గెలుపును పోల్చవచ్చు.
టెస్టు జట్టుకు ఇద్దరు ప్రతిభావంతులైన క్రికెటర్లు సైతం దొరికారు. బ్యాటింగ్ విభాగంలో యశస్వి జైస్వాల్, బౌలింగ్ విభాగంలో ముకేశ్ కుమార్ ఆకట్టుకున్నారు. సెంచూరియన్ టెస్టులో సిరాజ్, బుమ్రాలకు ఛేంజ్ ఓవర్ బౌలర్‌గా ప్రసిద్ కృష్ణ విఫలమయ్యాడు. కానీ కేప్‌టౌన్‌లో బుమ్రా, సిరాజ్ బ్యాటర్లపై ఉంచిన ఒత్తిడిని ముకేశ్ రెట్టింపు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో సఫారీ టాప్ ఆర్డర్‌ను కంగారు పెట్టిన ముకేశ్ భారత్‌కు నాల్గో పేస్ ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు గట్టి అడుగు వేశాడు. వీరెందర్ సెహ్వాగ్ తర్వాత ఆ స్థాయిలో ఓపెనర్‌గా ప్రభావం చూపిన బ్యాటర్ కనిపించడు. యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఆ స్థానం భర్తీ చేయగలడనే నమ్మకం ఏర్పడింది. సెంచూరియన్ సహా కేప్‌టౌన్ తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపరిచినా.. కీలక నాల్గో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ కదం తొక్కాడు. తొలి ఇన్నింగ్స్‌లో 0 సున్నా పరుగులకే 6 వికెట్లు చేజార్చుకున్న ఒత్తిడి వెంటాడుతుండగా.. స్వల్ప లక్ష్యాన్ని ఎదురుదాడి వ్యూహంతో కరగదీశాడు. రానున్న స్వదేశీ, విదేశీ టెస్టులకు యశస్వి జైస్వాల్, ముకేశ్ కుమార్‌లు భారత్‌కు కీలక పాత్ర పోషించనున్నారు.
సవాల్‌కు సై : దక్షిణాఫ్రికాలో భారత పర్యటన పిచ్ స్వభావంపై ఆసక్తికర చర్చకు తెరతీసింది. భారత్, దక్షిణాఫ్రికా తొలి టెస్టు ఏడు సెషన్లలో, రెండో టెస్టు ఐదు సెషన్లలోనే ముగిసింది. ఓవరాల్‌గా టెస్టు సిరీస్ 12 సెషన్లలో సమాప్తమైంది. ఓ టెస్టు మ్యాచ్‌లో 15 సెషన్లు ఉంటాయి. ఓవరాల్ సిరీస్‌లో సైతం అన్ని సెషన్ల ఆట అవసరం పడలేదు. అయినా, ఇంగ్లీశ్ మీడియా నుంచి ఎటువంటి విమర్శలు వినిపించటం లేదు. భారత్‌లో స్పిన్ మాయలో మూడు రోజుల్లో టెస్టు ముగిస్తే.. పిచ్‌పై గోల చేసే మీడియా, మాజీ క్రికెటర్లు.. సఫారీ పిచ్‌లపై పెదవి విప్పలేదు. ఇదే సమయంలో భారత క్రికెట్ వివేకంతో వ్యవహరించింది. సఫారీ టెస్టు పిచ్‌లపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్వయంగా.. ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా సిద్ధం చేసిన పిచ్‌ను ఓ సవాల్‌గా స్వీకరిస్తామని ప్రకటించాడు. తొలి బంతి నుంచే పేస్, స్వింగ్‌కు అనుకూలించగా అభ్యంతరం లేనప్పుడు.. స్పిన్ అంశంలోనూ ఉండకూడదని విమర్శకులకు గట్టిగానే చెప్పాడు. సెంచూరియన్‌లో డీన్ ఎల్గర్, కెఎల్ రాహుల్.. కేప్‌టౌన్‌లో ఎడెన్ మార్‌క్రామ్ శతకాలు సాధించినప్పుడు.. ఇంకా పిచ్‌పై గోల చేయటం ఏంటని సైతం రోహిత్ అన్నాడు. ప్రపంచ టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఐదు సెషన్లలో, 107 ఓవర్లలో ముగిసిన టెస్టు మ్యాచ్ కేప్‌టౌన్ ఒక్కటే. అయినా, భారత క్రికెట్ ఈ సవాల్‌ను క్రీడాస్ఫూర్తితో స్వీకరించింది. సఫారీ కంచుకోట కేప్‌టౌన్‌ను బద్దలు కొట్టింది. అజేయంగా దక్షిణాఫ్రికా పర్యటన నుంచి స్వదేశానికి పయనం కానుంది.
ఇక ఇంగ్లాండ్ ‘పరీక్ష’ : సఫారీ పర్యటన విజయవంతం చేసుకున్న టీమ్ ఇండియా ఇక స్వదేశంలో మరో కఠిన సవాల్‌కు సిద్ధం కావాల్సి ఉంది. జనవరి 25 నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడనుంది. హైదరాబాద్‌లో భారత్, ఇంగ్లాండ్ టెస్టు జరుగనుంది. చివరి టెస్టుకు ధర్మశాల ఆతిథ్యం ఇవ్వనుంది. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో రెండు సార్లు ఫైనల్స్‌కు చేరుకున్న టీమ్ ఇండియా.. ముచ్చటగా మూడోసారి ఫైనల్ బెర్త్ రేసులో ముందుంది. సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల్లోనూ భారత్ విజయం సాధిస్తే.. ఐసీసీ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా అగ్రస్థానం మరింత పదిలం అవనుంది. సఫారీ సక్సెస్‌లో ఉన్న భారత్.. సొంతగడ్డపై ఇంగ్లాండ్ ‘టెస్టు’కు సై అంటోంది.