సఫారీలు చిత్తు

Safaris are crazy– ఏకైక టెస్టులో భారత్‌ ఘన విజయం
– పది వికెట్లతో మాయ చేసిన స్నేహ్ రానా
అమ్మాయిలకు ఎదురులేదు. రెడ్‌బాల్‌ ఫార్మాట్‌లో వరుసగా మూడో టెస్టులో అఖండ విజయం నమోదు చేశారు. దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టులో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన టీమ్‌ ఇండియా 1-0తో టెస్టు సిరీస్‌ సొంతం చేసుకుంది. యువ స్పిన్నర్‌ స్నేహ్ రానా పది వికెట్ల ప్రదర్శనతో సఫారీలను తిప్పేయగా.. షెఫాలీ వర్మ, స్మృతీ మంధాన బ్యాట్‌తో విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడారు. వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌ తాజాగా టెస్టు సిరీస్‌ను సైతం సొంతం చేసుకుంది.
నవతెలంగాణ-చెన్నై
టెస్టు క్రికెట్‌లో టీమ్‌ ఇండియా తీన్‌మార్‌. భారత్‌, దక్షిణాఫ్రికా మహిళల ఏకైక టెస్టు మ్యాచ్‌లో గెలుపొందిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సేన.. నాలుగు రోజుల మ్యాచులో వరుసగా మూడో విజయం సాధించింది. ఫాలోఆన్‌లో దక్షిణాఫ్రికాను 373 పరుగులకు కుప్పకూల్చిన భారత్‌.. స్వల్ప లక్ష్యాన్ని ఊదేసింది. షెఫాలీ వర్మ (24 నాటౌట్‌, 30 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), శుభ సతీశ్‌ (13 నాటౌట్‌, 26 బంతుల్లో 1 ఫోర్‌) 9.2 ఓవర్లలో లాంఛనం ముగించారు. 10 వికెట్ల తేడాతో భారత్‌ అద్వితీయ విజయం సాధించింది. అంతకుముందు కెప్టెన్‌ లారా (122, 314 బంతుల్లో 16 ఫోర్లు), సునె లుస్‌ (109, 203 బంతుల్లో 18 ఫోర్లు) సెంచరీలు సహా క్లెర్క్‌ (61, 185 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించటంతో సఫారీలు భారత్‌ను రెండోసారి బ్యాటింగ్‌కు రప్పించగలిగారు. పది వికెట్లతో మాయజాలం చేసిన యువ స్పిన్నర్‌ స్నేV్‌ా రానా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకుంది. టెస్టు సిరీస్‌ ట్రోఫీ 1-0తో టీమ్‌ ఇండియా అమ్మాయిల సొంతమైంది. భారత్‌, దక్షిణాఫ్రికా మహిళల టీ20 సిరీస్‌ జులై 5న చెన్నైలో తొలి మ్యాచ్‌తో షురూ కానుంది.
అలవోకగా..
నాల్గో రోజు చివరి సెషన్లో ఛేదనకు బరిలోకి దిగిన టీమ్‌ ఇండియా.. 9.2 ఓవర్లలో లాంఛనం ముగించింది. 37 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఓపెనర్లు ఊదేశారు. స్మృతీ మంధాన స్థానంలో శుభ సతీశ్‌ (13 నాటౌట్‌) ఓపెనర్‌గా వచ్చి మెప్పించింది. విధ్వంసక బ్యాటర్‌ షెఫాలీ వర్మ (24 నాటౌట్‌) తొలి ఇన్నింగ్స్‌ ద్వి శతక దూకుడు కొనసాగించింది. మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో చెలరేగింది. భారత్‌ 10 వికెట్ల తేడాతో ఏకైక టెస్టులో ఘన విజయం సాధించింది.
సమిష్టిగా కూల్చారు
దక్షిణాఫ్రికాను తొలి ఇన్నింగ్స్‌లో స్పిన్నర్‌ స్నేహ్ రానా 8 వికెట్ల మ్యాజిక్‌తో కుప్పకూల్చింది. కానీ ఫాలోఆన్‌లో ఆ జట్టు ప్రతిఘటించింది. స్నేV్‌ా రానా సహా ఇతర బౌలర్లు వికెట్ల వేటలో చెమటోడాల్సి వచ్చింది. కెప్టెన్‌, ఓపెనర్‌ లారా (122), నం.3 బ్యాటర్‌ సునె లుస్‌ (109) శతకాలతో కదం తొక్కారు. మిడిల్‌ ఆర్డర్‌లో డి క్లెర్క్‌ (61) అర్థ సెంచరీతో మెరిసింది. దీంతో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 373 పరుగులు చేసింది. 154.4 ఓవర్ల పాటు భారత బౌలర్లను విసిగించిన సఫారీ అమ్మాయిలు.. ఆతిథ్య జట్టుకు 36 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. స్నేహ్ రానా (2/111), దీప్తి శర్మ (2/95), రాజేశ్వరి (2/55) రెండేసి వికెట్లు పడగొట్టారు. పూజ, షెఫాలీ, హర్మన్‌ప్రీత్‌ తలా ఓ వికెట్‌ ఖాతాలో వేసుకున్నారు.
స్కోరు వివరాలు :
భారత్‌ మహిళల తొలి ఇన్నింగ్స్‌ : 603/7 డిక్లేర్డ్‌
దక్షిణాఫ్రికా మహిళల తొలి ఇన్నింగ్స్‌ : 266/10
దక్షిణాఫ్రికా మహిళల రెండో ఇన్నింగ్స్‌ : 373/10
భారత్‌ మహిళల రెండో ఇన్నింగ్స్‌ : 37/0